2 నుండి స్నేహా సమ్మర్ క్యాంప్స్

– మంత్రి సీతక్క ఆదేశాలతో ఏర్పాట్లు ముమ్మరం
– ప్రతి గ్రామంలో నిర్వహించేలా ఏర్పాట్లు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల కిశోర బాలికల కోసం స్నేహా సమ్మర్ క్యాంప్స్‌ను మే 2 నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. బాలికల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్య కొనసాగింపు, ఆరోగ్య పరిరక్షణ, భద్రతపై అవగాహన, జీవన నైపుణ్యాల పెంపు, బాల్య వివాహాల నివారణ వంటి ముఖ్య అంశాలపై దృష్టి సారిస్తారు. సమాజంలో బాలికలు ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు కీలకమని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ బాలికల భవిష్యత్తును బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్, విద్య, పోలీస్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల సమష్టి కృషితో ఈ శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. స్నేహా సమ్మర్ క్యాంప్స్‌లో భాగంగా ఏరోజుకారోజు ప్రత్యేక థీమ్‌లతో కార్యాచరణ రూపొందించారు. బాలికల పరస్పర పరిచయం నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలు బాల్య వివాహాల దుష్పరిణామాలపై అవగాహన, అనీమియా వంటి ఆరోగ్య సమస్యలపై చర్చలు, గ్రామస్థాయిలో భద్రతా ప్రణాళికల రూపకల్పన, సామాజిక బాధ్యత పెంపు వంటి అంశాలను స్పృశిస్తాయి. ఆర్థిక నిర్వహణ, క్రీడలు, సైబర్ భద్రత, విద్య ప్రాముఖ్యత, కెరీర్ మార్గదర్శనం, సైక్లింగ్, ఇతర నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శిబిరాల ముగింపు సందర్భంగా గ్రామస్థాయిలో బాలికల గ్రామ సభలు నిర్వహించి బాల్య వివాహాల నిరోధం, బాలికల భద్రత, విద్య కొనసాగింపు వంటి అంశాలపై తీర్మానాలు చేస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక కిశోర బాలికను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ‘సెర్ప’ సీఈఓ దివ్యా దేవరాజన్ మార్గదర్శకాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి మండలంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని, క్షేత్రస్థాయి సిబ్బంది సక్రమంగా మార్గదర్శకాలను అనుసరించాలని మంత్రి సీతక్క ఆదేశించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *