– పోస్టర్, టీజర్‌ విడుద‌ల చేసిన మంత్రులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : సరస్వతి నది అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి ఛాంబర్‌లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి అంత్య పుష్కరాల పోస్టర్, అధికారిక టీజర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అంత్య పుష్కరాలను మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజులపాటు కాళేశ్వరంలో నిర్వహిస్తున్నట్లు, పుష్కరాలకు రూ.30.63 కోట్లతో 162 అభివృద్ధి పనులను చేపట్టామని, భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని వివరించారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు పుష్కర స్నానం, స్వామి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంత్య పుష్కరాలకు 30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరస్వతి ఆది పుష్కరాలు (మే 15, 2025 నుండి మే 26, 2025), సమ్మక సారలమ్మ జాతర నిర్వహణకు అవకాశం వచ్చిందని, వీటిని అత్యంత ఘనంగా నిర్వహించామని అన్నారు. ఇప్పుడు సరస్వతి అంత్య పుష్కరాలు, వచ్చే సంవత్సరం రానున్న గోదావరి పుష్కరాలకు పనులను కూడా ప్రారంభించామని తెలిపారు. మంత్రిశ్రీధర్ బాబు మాట్లాడుతూ సరస్వతీ పుష్కరాల కోసం భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. పది రోజుల ముందే పుష్కరాల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య కలగకుండా పోలీసు యంత్రాంగం, ఇతర శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి పుష్కరాలను విజయవంతం చేయాలని సూచించారు. కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.198 కోట్లను కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ ఈ పుష్కరాలను కాళేశ్వరంలో నిర్వహిస్తున్నట్లు, మొదటి రోజు ఉదయం 5.43 గంటలకు ప్రారంభ పుష్కర స్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజేంద్ర సరస్వతీ స్వామి చేస్తారని తెలిపారు. గవర్నర్‌ను ఆహ్వానించామని తెలిపారు. ప్రతి రోజూ ఒక పీఠాధిపతి ఉదయం పుష్కర స్నానం చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి రోజూ త్రివేణి సంగమం వద్ద సాయంత్రం 6.30గంటలకు కాశీ పండిట్‌లు హారతి నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, కాళేశ్వర ఆలయ ట్రస్ట్ చైర్మన్ మోహన్ శర్మ, దేవాదాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.