జోరుగా ధాన్యం కొనుగోళ్లు

– 90 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం
– 8,525 ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాలకు 6,500 ప్రారంభం
– నిన్నటి వరకు 8.50 లక్షల టన్నుల కొనుగోళ్లు
– కొనసాగుతున్న ఇతర పంటల కొనుగోళ్లు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్రంలో ధాన్యం(వరి) కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ యాసంగి సీజన్‌లో మొత్తం 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు నిర్వహించేందుకు గత ఏడాదికంటే ఈసారి కేంద్రాల సంఖ్యను పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపాదించిన 8,525 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 6,500కు పైగా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఐకేపీ ఆధ్వర్యంలో 2,623 కేంద్రాలు, సొసైటీల ద్వారా 3,278 కేంద్రాలు, ఇతర సహకార సంస్థల ద్వారా 353 కేంద్రాలు పని చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లో దాదాపు 43,000 మంది శిక్షణ పొందిన సిబ్బంది కొనుగోళ్లలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు మంగళవారం నాటికి సుమారు 8.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు పూర్తయింది. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యంలో దొడ్డు, సన్న రకాలుగా విభజించి సేకరణ కొనసాగుతోంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించేందుకు 6,500 లారీలను అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు ఏడు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా ఆటోమేటెడ్ డ్రైయర్లు, క్లీనర్లు, మాయిశ్చర్ మీటర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచారు. అదనంగా సుమారు 20 కోట్ల గన్నీ బ్యాగులు ముందుగానే నిల్వ ఉంచారు, తద్వారా కొనుగోళ్లు ఎక్కడా నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నారు. రైతులకు చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు రూ.2031 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా ఇప్పటికే దాదాపు రూ.323 కోట్లు రైతులకు చెల్లించారు. వెంటవెంటనే చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ధాన్యంతో పాటు ఇతర పంటల కొనుగోళ్లు కూడా కొనసాగుతున్నాయి. ఈసారి 43.20 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి అంచనాలున్నాయి. ఇప్పటివరకు 3.46 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరిగాయి. దాదాపు రూ.830.69 కోట్ల విలువైన కొనుగోళ్లతో 64,779 మంది రైతులు లబ్ది పొందారు. 1.25 లక్షల మెట్రిక్ టన్నుల శనగ పంట దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు 30,220 మెట్రిక్ టన్నుల కొనుగోలు జరపగా 15,933 మంది రైతులు లబ్ది పొందారు. పొద్దుతిరుగుడు పంట 19,808 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేయగా ఇప్పటివరకు 2,512 మంది రైతుల నుంచి 3,492 మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తయింది. అన్ని జిల్లాల్లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా కొనసాగుతున్నాయి. రైతులకు కనీస మద్దతు ధర అందించటంతోపాటు సౌకర్యవంతమైన సేవలు, తక్షణ చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *