కమిషన్ దృష్టికి వొచ్చిన అంశాలపై నివేదిక
హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబర్7: రాష్ట్రంలో వెనుకబడిన కులాల స్థితిగతులు తెలుసుకునేందుకు బీసీ కమిషన్ ఈ నెల 18వ తేదీ నుంచి బహిరంగ విచారణలు తిరిగి ప్రారంభించనుంది. తొలుత అక్టోబర్‌లో జారీ చేసిన షెడ్యూలు ప్రకారం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 13 వరకు ఉమ్మడి జిల్లాలు, కమిషన్ కార్యాలయంలో అన్ని వర్గాలతో విచారణలు నిర్వహించాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ వేసింది. అయితే, అప్పటికే బీసీ కమిషన్ ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ విచారణలు పూర్తిచేయగా… మిగిలిన జిల్లాల్లో ఈ ప్రక్రియను నిలిపివేసింది.
తాజాగా నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో ఈ నెల 18 నుంచి 26 వరకు విచారణలు నిర్వహించాలని నిర్ణయించింది. బహిరంగ విచారణ సమయంలో కమిషన్ దృష్టికి వొచ్చిన వివిధ అంశాలను ప్రభుత్వానికి తెలపనుంది. ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలందరూ సహకరించి, తమ వివరాలు నమోదు చేయాలని కమిషన్ కోరింది. నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు బీసీ కులాల వారిని సామాజికంగా బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీసీ కమిషన్ పేర్కొంది. ఆ కమిటీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ రాయనుంది.
బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరనుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గత, ప్రస్తుత కమిషన్లు చేసిన అధ్యయన వివరాలను కొత్తగా ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ తెలుసుకుంది. పొరుగు రాష్ట్రాల కమిషన్లు.. రిజర్వేషన్ల ను ఎలా ఖరారు చేశాయి? ప్రస్తుత పరిస్థితులు, ఇతర వివరాలు అడిగింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్..\
ను తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్, సభ్యులు జయప్రకాష్, సురేందర్, బాలలక్ష్మిలను కలిసింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారంపై ఆరా తీసింది. అంతకుముందు ప్రత్యేక కమిషన్ ఛైర్మన్‌గా బూసాని వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. సంక్షేమభవన్ నాలుగో అంతస్తులో కమిషన్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా నివేదిక తయారు చేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రత్యేక కమిషన్ కార్యదర్శిగా బి.సైదులు బాధ్యతలు తీసుకున్నారు.