వరుస షాక్‌లతో తలలు పట్టుకుంటున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు

పార్టీ సమావేశాలకూ పలువురు ఎంఎల్‌ఏలు డుమ్మా
ఎవరు పార్టీ వీడుతారో అర్థం కాని పరిస్థితి
సైలెంట్‌గా కాంగ్రెస్‌లో చేరిపోయిన బండ్ల కృష్ణమోహన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత ఊహించని పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎప్పుడు గులాబీ కండువా తీసేసి..కాంగ్రెస్‌ ‌కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగి హస్తం గూటికి చేరడం..మరో ఆరుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారనే వార్తలతో పార్టీ పరిస్థితి ఏంటనేది హైకమాండ్‌కే తెలియక తలలు పట్టుకుంటుంది..! ఈ క్రమంలో గద్వాల ఎంఎల్‌ఏ ‌బండ్ల కృష్ణమోహన్‌ ‌రెడ్డి కూడా సిఎం రేవంత్‌ ‌సమక్షంలో కాంగ్రెస్‌ ‌కండువా కప్పుకున్నారు. అయితే మూకుమ్మడిగా కాకుండా ఒకకొక్కరుగా పార్టీని వీడడం అర్థం కావడం లేదు. సరిగ్గా ఈ క్రమంలోనే తెలంగాణ భవన్‌ ‌వేదికగా జరుగుతున్న బీఆర్‌ఎస్‌ ‌కీలక సమావేశానికి పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది.

అసలే మరో ఆరుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ ‌కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తల నేపథ్యంలో భేటీ జరగడం..ఈ సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు రాకపోవడంతో ఏదో తేడా కొడుతుందనే అనుమానాలకు తావిచ్చినట్లయ్యింది. తొలిరోజు సమావేశానికి రాలేదు సరే..రెండో రోజు కూడా హాజరుకాకపోవడంతో పార్టీ మార్పు పక్కా అనే వార్తలు గుప్పుమంటున్నాయి. జీహెచ్‌ఎం‌సీ కౌన్సిల్‌ ‌సమావేశం జరుగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో వేదికగా కీలక సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే.. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోగా శనివారం జరిగన కౌన్సిల్‌ ‌సమావేశానికీ రాకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. కౌన్సిల్‌ ‌భేటీకి ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్‌ ‌గౌడ్‌, ‌మహిపాల్‌ ‌రెడ్డి డుమ్మా కొట్టారు. కౌన్సిల్‌ ‌భేటీకి కచ్చితంగా హాజరుకావాలని అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ హాజరుకాకపోవడం గమనార్హం.

దీంతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏమయ్యారు..? బీఆర్‌ఎస్‌కు బై బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నారా..? లేకుంటే మరేదైనా కారణాలతో డుమ్మా కొట్టారా అనేది తెలియట్లేదు. రాష్ట్ర రాజధాని పరిధిలో బీఆర్‌ఎస్‌కు 14 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో ఏడుగురు శక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశానికి రాలేదు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో 24 నియోజక వర్గాలకుగాను 16 బీఆర్‌ఎస్‌ ‌గెలుచుకుంది. కండువాల మార్పిడి సీజన్‌ ‌నడుస్తున్న సమయంలో ఒకరోజు ముందు సమాచారమిచ్చి మరీ బీఆర్‌ఎస్‌ ‌ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌కు హైదరాబాద్‌లోనే ఉండి కూడా కొందరు ఎమ్మెల్యేలు రాకపోవడం పార్టీ మారుతారనే వార్తలకు బలం చేకూరుతోంది.

శుక్రవారం నాటి సమావేశానికి.. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ (‌సనత్‌నగర్‌), ‌పద్మారావు (సికింద్రాబాద్‌), ‌ప్రకాష్‌గౌడ్‌ (‌రాజేంద్రనగర్‌), ‌సుధీర్‌రెడ్డి(ఎల్‌బీనగర్‌), ‌మాగంటి గోపినాథ్‌(‌జూబ్లీహిల్స్), ‌ముఠా గోపాల్‌ (‌ముషీరాబాద్‌), ‌కాలేరు వెంకటేష్‌(అం‌బర్‌పేట) హాజరయ్యారు. అయితే.. అరెకపూడి గాంధీ(శేరిలింగంపల్లి), మాధవరం కృష్ణారావు(కూకట్‌పల్లి), బండారి లక్ష్మారెడ్డి(ఉప్పల్‌), ‌మర్రి రాజశేఖర్‌రెడ్డి(మల్కాజ్‌గిరి), కేపీ వివేకానందగౌడ్‌ (‌కుత్బుల్లాపుర్‌), ‌సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు)లు రాలేదు. దీంతో ఇవాళ అయినా..కౌన్సిల్‌కు వొస్తారనుకుంటే రాకపోవడంతో ఏదో తేడా కొడుతుందనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page