అసలు మీకు నాలెడ్జే లేదు…
మంత్రి కోమటి రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య మాటల యుద్ధం
మీ దళిత ముఖ్యమంత్రి హావిూ ఏమయ్యింది..?
కెసిఆర్ ఏం చీల్చుతాడో చూద్దామనే సభకు వొచ్చానన్న మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : బిఆర్‌ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ ఎక్కడ ఇచ్చారో హరీష్ రావు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో ఓ సబ్‌స్టేషన్ పరిశీలనకు తాను వెళ్లి లాగ్ పరిశీలిస్తే బండారం బయటపడిరదని అన్నారు. దీంతో ఆనాటి ప్రభుత్వం సబ్‌స్టేషన్లలో లాగ్ బుక్కులను లాగేసుకుందని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్ ఎందుకు చేయలేదన్నారు. డబుల్ ఇళ్ల సంగతేంటని ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీ బడ్జెట్‌పై చర్చ స్దర్భంగా ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి హరీష్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. హరీశ్ రావు కోమటిరెడ్డిని హాఫ్ నాలెడ్జ్ అని ఎద్దేవా చేస్తూ..తెలంగాణ ప్రజలకు కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలన్నదానిపై సీరియస్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…అసలు హరీష్‌కు నాలేడ్జే లేదని కౌంటర్ ఇచ్చారు.
ఆకారం పెరిగింది కానీ తెలివి లేదన్నారు. హరీష్ తనకు క్షమాపణ చెప్పాలని అన్నారు. హరీష్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. కేసీఆర్ రాలేకనే హరీష్‌ను సభకు పంపించారని చెప్పారు. అబద్ధాలు, గారడీలంటేనే బీఆర్‌ఎస్ అని చెప్పారు. హరీష్ రావు బ్జడెట్‌పై కాకుండా రాజకీయాలు సభలో మాట్లాడుతున్నారని అన్నారు. ఉద్యమంలో కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తా అన్నారని, దళితున్ని సీఎం చేయకపోతే తలనరుక్కుంటా అన్నారని కోమటి రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క హావిూ నెరవేర్చలేదన్నారు.
బడ్జెట్‌పై చీల్చి చెండాడుతా అన్న కేసీఆర్.. ఈరోజు ఏం చీల్చుతారో అని తాను అసెంబ్లీకి వొచ్చానని, కానీ కేసీఆర్ రాలేదన్నారు. కేసీఆర్‌కు సభకు రావాలంటే భయం.. అందుకే వీళ్లను పంపాడన్నారు. గతంలో హరీష్ రావు ఒక డవ్మిూ మంత్రి అన్నారు. కేసీఆర్ సభకు రాలేక హరీష్ రావును పంపారని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 24 గంటల కరెంట్ ఎక్కడిచ్చారో చెప్పాలని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కాగా గతంలో సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి…డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని మంత్రి కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా హరీష్ రావు ఎత్తిచూపారు.