‌బీఆర్‌ఎస్‌ ‌కనుమరుగవుతుందా ?

బిజెపీలో విలీనంపై వదంతులు
ఎంఎల్‌ఏలను కాపాడుకునే పనిలో నేతలు
ప్రశ్నార్థకంగా బీఆర్‌ఎస్‌ ‌భవిష్యత్తు

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్‌, ‌జూలై 17 : భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ‌మనుగడపైన గత కొద్దిరోజులుగా మీడియాలో అనేక వదంతులు వొస్తున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ‌బిజెపీలో విలీనం అవుతుందన్న వార్తలు విస్తృతమైనాయి. శాసనసభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బీఆర్‌ఎస్‌కు పార్లమెంటు ఎన్నికల్లో చంపుడు పందెం కూడా పుట్టకపోవడంతో ఇప్పుడు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన ఎంఎల్యేలు, ఎంఎల్‌సీలు పార్టీ ఫిరాయించడం ప్రారంభించారు. ఇప్పటి వరకు పది మంది ఎంఎల్‌ఏలు, ఆరుగురు ఎంఎల్సీలు కాంగ్రెస్‌ ‌కండువ కప్పుకున్నారు. మరికొందరు త్వరలో అదే బాటపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వారిని నిలువరించేందుకు స్వయంగా పార్టీ అధినేత కెసిఆర్‌ ‌రంగంలోకి దిగినప్పటికీ లాభంలేకుండా పోతుంది. దీంతో తమ ఎంఎల్‌ఏలను తీసుకోవడం సరైంది కాదంటూ ఆ పార్టీ ప్రతినిధులు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్‌ ‌దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోని పక్షంలో సుప్రీమ్‌ ‌కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించడం ద్వారా గోడ దూకాలనుకున్న మరికొందరిని తాత్కాలికంగానైతే ఆలోచనలో పడవేశారనే చెప్పాలె. ఇదిలా ఉంటే బీఆర్‌ఎస్‌కు చెందిన రాజ్యసభ సభ్యులంతా బిజెపీలో చేరబోతున్న వార్తలు విస్తృతమయ్యాయి.

 

దీనిపై ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ మాటలు సంచలనంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండీ బీఆర్‌ఎస్‌తో అంటకాగిన ఓవైసీ, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌కు అనుకూలంగా మారాడు. ఇప్పుడు ఏకంగా బిఆర్‌ఎస్‌ను టార్గెట్‌ ‌చేస్తూ ఆయన మాట్లాడటం విచిత్రకరంగా మారింది. బిజేపిలో బిఆర్‌ఎస్‌ ‌విలీనం జరుగుతున్నదన్న వార్తలపై బీఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ను స్పందించాలంటూ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడం లేదా ఆ పార్టీకి బయటి నుంచి మద్దతివ్వడమన్న విషయంలో ఏది నిజమన్న విషయంపైన స్పందించాలంటూ ఆయన కెసిఆర్‌ను కోరారు. బిజేపీలో విలీనం పైన గత కొద్దిరోజులుగా మీడియాలో విస్తృతంగా వార్తలు వొస్తున్నా బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌గాని, ఆపార్టీ ముఖ్యనేతలు కెటిఆర్‌, ‌హరీష్‌రావులు ఎవరూ స్పందించకపోవడం కూడా వొస్తున్న వదంతుల్లో నిజం లేకపోలేదన్న అభిప్రాయానికి తావిచ్చేవిగా ఉన్నాయి. దానికి తగినట్లుగా ఆపార్టీ మరో ముఖ్యనేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ ‌వ్యాఖ్యలు కూడా విలీనం విషయంలో జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్నిస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరుగవచ్చంటూ వినోద్‌కుమార్‌ ‌నర్మగర్బ మాటలతో విలీనం విషయంలో ఏదో జరుగుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారాన్ని కోల్పోయినప్పటి నుండీ బీఆర్‌ఎస్‌ ‌కష్టకాలాన్ని అనుభవిస్తున్నది.

 

ఎంఎల్‌ఏలను, ఎంఎల్సీలను కాపాడుకోవడం ఇప్పుడు ఆ పార్టీకి శక్తిమించినట్లు అవుతున్నది. నిత్యం పై స్ధాయి నుండి కింది స్థాయి నాయకుల వలసలతో పార్టీ ప్రతిష్ట దిగజారుతుంది. దీనికి తగినట్లుగా కెసిఆర్‌పైన అక్రమాలకు సంబంధించి కేసుల విచారణలు మొదలైనాయి. అధికారంలోకి రాకముందు నుండి కూడా కెసిఆర్‌కు చిప్పకూడు తినిపించడం ఖాయమంటూ ప్రకటనలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వకాలంలోని అనేక అవకతవకలపై న్యాయవిచారణకు ఆదేశించడంతో బీఆర్‌ఎస్‌ ‌శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కెసిఆర్‌ ‌కుమార్తె, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ ‌దిల్లీ లిక్కర్‌ ‌కేసులో గత మూడు నెలలుగా జైలు శిక్షను అనుభవిస్తున్నది. ఆమెకు కనీసం బెయిల్‌ ‌కూడా ఇప్పించుకునే స్థితిలో తమ అధినేత లేక పోవడం చూస్తుంటే, తమ రాజకీయ భవిష్యత్‌ ఏమిటన్న ఆలోచన వారిలో మొదలైంది. ఇప్పటి వరకు పోయినవారు పోగా మిగతావారు కూడా ఏకమొత్తంగా పార్టీ ఫిరాయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వార్తలు వొస్తున్నాయి. కొద్ది తేడాలో అధికారాన్ని కోల్పోయిన బిఆర్‌ఎస్‌, అధికార కాంగ్రెస్‌ను కూలదోస్తామంటూ చేసిన ప్రకటన పర్యవసానాన్ని అనుభవిస్తున్నదన్న వాదనకూడా లేకపోలేదు.

 

మిగిలిన ఎంఎల్‌ఏలనైనా కాపాడుకోవాలంటే బిజెపితో సాన్నిహిత్యమే ప్రత్యమ్నాయంగా ఆ పార్టీ భావిస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. ఇటీవల కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావులు కవితను పరామర్షించేందుకంటూ దిల్లీకి వెళ్ళినట్లు చెబుతున్నా, బిజేపీ అధినేతలతో మంతనాలకే వెళ్ళినట్లు రాజకీయవర్గాలు ఆరోపిస్తున్నాయి. విలీనంపైన బిబెపి కేంద్ర నాయకత్వం ఎలా స్పందించినా, రాష్ట్ర నాయకత్వం మాత్రం మొదటి నుండీ బిఆర్‌ఎస్‌ను వ్యతిరేకిస్తూనే ఉంది. బిఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీని పరుష పదజాలంతో దూషించడం, కేంద్రంపైన ధ్వజమెత్తడం లాంటి సన్నివేశాల నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా బిఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే అవకాశాలు లేకపోలేదు. అలాంటి పరిస్థితిలో బిఆర్‌ఎస్‌ ‌భవిష్యత్తు ఏమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కాగా ఇదే అదనుగా తెలంగాణపై మరోసారి పెత్తనం చేసేందుకు ఆంధ్రా పార్టీలు సిద్దమవుతున్న నేపథ్యంలో తెలంగాణవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page