- ఇప్పటి వరకు తీవ్రవాదానికి 17 వేల మంది బలి
- కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా వెల్లడి
రాయ్‌పుర్, ఆగస్ట్ 24 : మావోయిస్టుల హింస ప్రజాస్వామ్యానికి సవాలుగా మారిందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 17 వేల మంది తీవ్రవాదానికి బలయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నక్సల్స్ అంతానికి బలమైన, పకడ్బందీ వ్యూహం అవసరమన్నారు. ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో శనివారం నిర్వహించిన అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
2004-14 వ్యవధితో పోలిస్తే 2014-24 మధ్యకాలంలో నక్సల్స్ సంబంధిత ఘటనల్లో 53 శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్రమంత్రి తెలిపారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఏకకాలంలో భద్రతా కార్యకలాపాలు, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్‌ఐఏ, ఈడీ వంటి కేంద్ర సంస్థలు మావోయిస్టు హింస నిర్మూలనకు కృషి చేస్తున్నాయని తెలిపారు.