నల్లగొండ జిల్లాలో దారుణం

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో కుర్చీలోనే మహిళ ప్రసవం
హాస్పిటల్‌ ‌సిబ్బందిపై చర్య తీసుకోవాలని రోగుల బంధువుల డిమాండ్‌

‌నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ‌నల్లగొండ  జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ ప్రసవించిన అమానవీయ ఘటన జిల్లా ప్రభుత్వ దదవాఖానలో చోటు చేసుకుంది. జిల్లాలోని నేరడుగొమ్మ మండల కేంద్రానికి చెందిన గర్భిణి నల్లవెల్లి అశ్విని గురువారం రాత్రి పురిటినొప్పులతో జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు వెళ్లారు. అక్కడ డాక్టర్లు లేరని.. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది పంపించారు. దేవరకొండ నుంచి అంబులెన్స్‌లో నల్గొండ జిల్లా దవాఖానకు చేరుకున్నారు. ఇక్కడికి ఎందుకు వొచ్చారని హాస్పిటల్‌ ‌సిబ్బంది వారిని ప్రశ్నించారు. మూడో కాన్పు దేవరకొండలో చేయించక ఇక్కడి దాక రావడం ఏంటంటూ అసహనం వ్యక్తం చేస్తూ నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఈ క్రమంలో అశ్వినిని బయట కుర్చీలోనే కూర్చోబెట్టారు నర్సులు.

 

నొప్పులు వొస్తున్నాయి అని చెప్పినప్పటికి ఎవరు పట్టించుకోలేదు. తీవ్ర నొప్పులతో బాధ పడుతూ అశ్విని కుర్చీలోనే డెలివరీ అయింది. కుర్చీ కింద తీవ్ర రక్త స్రావం కావడంతో అప్పుడు హాస్పిటల్‌ ‌సిబ్బంది వొచ్చి హడావుడి చేస్తూ పేషెంట్‌ ‌పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ తరువాత లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణంపై అక్కడే ఉన్న ఇతర రోగుల బంధువులు, ఇతరులు వైద్యులు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికి రాకూడదని, నిర్లక్ష్యం చేసిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి భర్త ఆంజనేయులు డిమాండ్‌ ‌చేశారు.

 

డ్యూటీలో ఉన్న డాక్టర్‌, ‌నర్సులపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్‌ ‌పూర్ణ చందర్‌ ‌హుటాహుటిగా హాస్పిటల్‌కు తరలి వొచ్చారు. ఘటనపై వివరాలు సేకరించారు. బాధ్యులపై చర్యల కోసం నివేదికను ఉన్నతధికారులకు అందజేస్తానని తెలిపారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నల్గొండ ఎంసీహెచ్‌లో చేరిన వెంటనే బెడ్‌, ఇతర సౌకర్యాలు కల్పించకపోవడంతో కుర్చీలోనే కూర్చుని ఉంది. ఆ సమయంలోనే పురిటి నొప్పులు వొచ్చి మగశిశువుకు జన్మనిచ్చింది. గమనించిన సిబ్బంది ఆమెను వార్డులోకి తీసుకెళ్లి చికిత్స అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page