ఓడిపోతారనే నివేదిక కారణంగానే అయోధ్య నుంచి పోటీ చేయని మోదీ
భూములు కోల్పోయినా న్యాయం జరుగలేదని స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
అహ్మదాబాద్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూలై 6 : ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో ఎలా ఓడించామో ప్రధాని నరేంద్ర మోదీనీ, ఇతర బిజెపి నేతలను గుజరాత్‌లోనూ అలాగే వోడిస్తామని లోక్ సభలో ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. అయోధ్య ప్రజలు విమానాశ్ర నిర్మాణంలో తమ భూములను కోల్పోయారని, అయినా వారికి రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం లేక పోవడంలో తీవ్ర అసంతృప్తికి గురయ్యారని అన్నారు. వారికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదని రాహుల్ దుయ్యబట్టారు. ఈ కారణాల వల్లనే అయోధ్యలో బిజెపి వోడిపోయిందని అన్నారు. ఆనాడు అయోధ్య ప్రాంతంలో అద్వానీ ప్రారంభించిన ఉద్యమాన్ని కొనసాగించడంలో బిజెపి విఫలమయిందని అన్నారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ట సందర్భంగా అదానీ, అంబానీలు దర్శనమిచార్యరని, కానీ ఒక్క పేద వ్యక్తి కనిపించలేదని అన్నారు.
శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బిజెపి విధ్యంసం చేసిందని, తమ పార్టీకార్యకర్తలపై దాడిచేసిందని, తమను బెదిరించి, తమ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం ద్వారా బిజెపి వాళ్లు విసిరిన సవాల్‌ను తాము స్వీకరించామని, తమ కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లే తామంతా కలిసి వారి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయబోతున్నామని చెప్పారు. గుజరాత్లో కాంగ్రెస్ నరేంద్ర మోదీని ఓడిస్తుందనే విషయాన్ని రాసి పెట్టుకోవాలని అన్నారు. అయోధ్యలో విజయం సాధించినట్లే గుజరాత్‌లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, ఆ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ కొత్త శకం ప్రారంభమవుతుందని రాహుల్ అన్నారు.
హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బిజెపి యువజన విభాగం సభ్యులు నిరసన తెలిపేందుకు జూలై 2న అహ్మదాబాద్ పాల్డి ప్రాంతంలోని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం రాజీవ్ గాంధీ భవన్ వెలుపల కాంగ్రెస్ మరియు బిజెపి సభ్యుల మధ్య జరిగిన ఘర్షణను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ లక్ష్యంగా తన ప్రసంగంలో అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ లోక్‌సభ స్థానం నుండి బిజెపి ఓటమిని ప్రస్తావిస్తూ..ప్రధాని మోదీ అయోధ్య నుంచి పోటీ చేయాలనుకున్నారని, అయితే ఆయన ఓడిపోతారని, అలా అయితే రాజకీయ జీవితం ముగిసిపోతుందని, అలా చేయవద్దని ఆయనకు సర్వేయర్లు సలహా ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు.