పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం..

  • 12 లక్షల ఎకరాలకు సాగునీటి అందిస్తాం
  • నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రూ.27,500 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేద‌ని, తాము మాత్రం ఈ శాసన సభ కాలంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి ఉమ్మడి పాలమూరు సస్యశ్యామలం చేస్తామ‌ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల పరిశీలన, సమీక్షల నిమిత్తం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్థిక, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ ను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉత్త‌మ్ మాట్లాడుతూ.. మంగళవారం ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ఆర్అండ్ఆర్ కు రూ.45 కోట్లను విడుదల చేశామ‌ని తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ,భీమా, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ల తో పాటు, కోయిల్ సాగర్ అన్ని ప్రాజెక్టులను నూటికి నూరు శాతం పూర్తి చేస్తామని వెల్లడించారు.

గత ప్రభుత్వం ఒక ఎకరాకు సైతం నీళ్లు ఇవ్వలేదని, పైగా పాలమూరు- రంగారెడ్డికి నీటి వాటాను సైతం సాధించలేకపోయారని తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులను సైతం నూటికి నూరు శాతం పూర్తి చేస్తామన్నారు. ఉదండాపూర్ తో పాటు, ఇతర రిజర్వాయర్లలో ముంపునకు గురైన వారికి పునరావాసం అందిస్తామని, వీటన్నిటిపై సమీక్షించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటన చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ఉదండపూర్ రిజర్వాయర్ కు రూ.45 కోట్లు విడుదల చేయటంపై మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఆర్అండ్ఆర్ లో భూ సేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న 3.74కోట్లు, అలాగే పెండింగ్లో ఉన్న 2.6 కోట్లను ఉదండాపూర్ లోని నిర్మాణాలకు 13 కోట్లు పెండింగ్ ఉన్నాయని వాటిని చెల్లించాలని కోరారు. జడ్చర్ల ఎమ్మెల్యే జె.అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదని అన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు ఉదండాపూర్ ఆర్అండ్ఆర్ కేంద్రంలో 12 కోట్ల 97 లక్షల వ్యయంతో నిర్మించనున్న 4.2 కిలోమీటర్ల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ఎక్సైజ్,ప్రొహిబిషన్,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల.చిన్నారెడ్డి ,రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్ ,రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీర్ -ఇన్- చీఫ్ అనిల్ కుమార్, మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి , మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి, షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ,జిల్లా ఎస్పీ జానకి, ఎస్ ఈ శ్రీనివాసరావు, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ఎస్ మోహన్ రావు, మహబూబ్ నగర్ ఆర్డివో నవీన్, మైనర్ ఇరిగేషన్ జిల్లా ఎస్ఈ చక్రధరం, పాలమూరు- రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *