గత ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులకు అప్పులను తక్కువ కాలంలో ఎక్కువ వడ్డీకి తీసుకువచ్చాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. లాంగ్ టర్మ్ లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీకి దొరికేవి. కానీ మాకు వారసత్వంగా వొచ్చిన అప్పులకు అసలు వడ్డీ రూ.15 వేల కోట్లు చెలించాల్సి వొస్తుందన్నారు. ప్రాజెక్టుల అంశంపై ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదు. తక్కువ నిధులతో త్వరగా పూర్తయ్యి ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా చేపట్టాం. అలాంటి ప్రాజెక్టులు మీ దృష్టిలో ఉంటే చెబితే ప్రాజెక్టుల ద్వారా నీరందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. మేం యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి దేవాదుల 3 పూర్తి చేశాం.
ఒకటి రెండు రోజుల్లో పంపింగ్ ప్రారంభిస్తాం. ఎస్ఎల్బిసి టన్నెల్ లో ప్రమాదం జరగడం అత్యంత దురదృష్టకరం. ప్రపంచలోనే అత్యంత నిష్ణాతులైన సాంకేతిక నిపుణులతో రెస్క్యూ చేస్తున్నాం. అవకాశం ఉన్న అన్ని శాఖలను ఉపయోగిస్తున్నాం. ప్రమాదం జరిగిన వెంటనే 3 గంటల్లో నేను అక్కడికి వెళ్లి సహాయక చర్యలపై సమీక్ష చేశా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా అక్కడికి వచ్చి సమీక్ష చేశారు. ఇప్పటికి రెండు మృతదేహాలు దొరికాయి.
మిగతా చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణహిత విషయంలో నిర్లక్ష్యం లేదు. త్వరలోనే తుమ్మిడిహెట్టి వద్ద పనులు మొదలుపెడతాం. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన విషయంలో విజిలెన్స్ రిపోర్ట్ తొందరగా ఇవ్వాలని కోరాం.. కాళేశ్వరం బ్యారేజ్ పనులలో డిజైన్, నిర్మాణం, మెయింటెనెన్స్ ల లో లోపాలు, తేడాలు ఉన్నట్టు గుర్తించారు. డిపిఆర్ లో ఉన్న దానికి, నిర్మాణానికి తేడాలు ఉన్నాయి. ఎన్ డి ఎస్ఏ రిపోర్ట్ వొచ్చాక, జ్యూడిషియల్ కమిషన్ గోష్ నివేదిక వొచ్చాక ముందుకుపోతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పీపీఆర్ ప్రాజెక్ట్, కొమురం భీమ్, చనక, జగన్నాథం ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు