పగటి కలలు కంటున్న సీఎం రేవంత్

– ఎంపీ అరుణ విమర్శ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 :ముఖ్యమంత్రిగా 2034 వరకు తానే ఉంటానని, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజా సమస్యలపై అవగాహన కన్నా పగటి కలలపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారూ.. మీరు, మీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, వాగ్దానాలు ఏమి అమలు చేశారో ముందుగా చెప్పండి అని నిలదీశారు. ఆరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటి అమలులో పూర్తిగా విఫలమై ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం మీది అని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు.. ఇలా ప్రతీ వర్గం కాంగ్రెస్ పాలనపై అసంతృప్తితో ఉందన్నారు. మీ అసమర్థ పాలన, ప్రజా సమస్యలను పట్టించుకోని తీరు చూసి ప్రజలు విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు, నిరుద్యోగుల ఆందోళనలు, మహిళల భద్రత సమస్యలు, పెండింగ్ హామీలు.. ఇవన్నీ పక్కన పెట్టి 2034 వరకు సీఎం కుర్చీ గురించి మాట్లాడటం ప్రజలను అవమానించడమేనని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత అనుకూల ఫలితాలు ఇస్తే వాపును చూసి బలుపు అనుకుంటున్నారు.. ప్రజల అసలు తీర్పు ఇచ్చే రోజులు ముందున్నాయి అని వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల విషయానికి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రతీ ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి చవిచూస్తున్న వాస్తవాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోవద్దన్నారు. అసలు 2034 వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉంటుందా.. లేక పూర్తిగా పతనమవుతుందా అన్నదే ప్రశ్నగా మారిందని ఎద్దేవా చేశారు. అలాంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పడం ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయని అన్నారు. ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్లుకుని ప్రజా సమస్యలు పరిష్కరించండి.. ఆ తర్వాత భవిష్యత్ రాజకీయాల గురించి మాట్లాడితే కనీసం ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది అని హితవు పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *