– మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
– స్త్రీ నిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : స్త్రీనిధి సంస్థ మన ఇల్లు వంటిది.. సంస్థను కాపాడుకుంటేనే ఉద్యోగుల హక్కులు, భవిష్యత్తు సురక్షితంగా ఉంటాయి అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. 2011లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీనిధి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరింత బలోపేతం అవుతోందన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు, అధిక వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్న మహిళలను ఆదుకోవడానికే స్త్రీ నిధిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటివరకు స్త్రీ నిధి ద్వారా 32 లక్షల మందికిపైగా మహిళలకు రూ.24 వేల కోట్ల రుణాలు అందించడం గొప్ప విజయమని మంత్రి పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో స్త్రీ నిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్త్రీ నిధి ఉద్యోగులంతా కలిసి స్త్రీ నిధి స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకోగా మంత్రి సీతక్క అభినందించారు. సంఘం ఉద్యోగులను ఐక్యం చేయడమే కాక హక్కులతోపాటు బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ ప్రయోజనాలతోపాటు లక్షలాది మహిళల ఆర్దిక సంక్షేమాన్ని కాపాడాలని కోరారు. స్త్రీ నిధి అసలు సిసలు మాహిళా బ్యాంకు అని కొనియాడారు. రాష్ట్ర మహిళలకు స్త్రీ నిధి ఒక నమ్మకమైన బ్యాంకుగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ స్త్రీ నిధి మోడల్‌ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని చెప్పారు. “కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. ఆ దిశగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. మహిళల అభివృద్ధే తెలంగాణ అభివృద్ధి అనే నమ్మకంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది’ అని మంత్రి తెలిపారు. దేశ జీడీపీలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 18 శాతానికే పరిమితమైందని, అభివృద్ధి చెందిన దేశాల్లో అది 40 శాతానికి చేరుకుందని పేర్కొన్నారు. తెలంగాణ మహిళలు కూడా ఆ స్థాయికి ఎదగాలని, అందుకోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని అన్నారు. చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి అవకాశాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ముఖ్యంగా గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరుస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో 16 మంది ఉద్యోగులను తొలగించారని, ఇప్పుడు అదే వ్యక్తులు తప్పుడు ఆరోపణలతో సంస్థను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి అసత్య ప్రచారాన్ని ఉద్యోగులంతా కలిసి తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. స్త్రీ నిధిని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం తప్ప ఎవరి ఉద్యోగాలను తొలగించడం కాదు అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. స్త్రీ నిధి సంస్థ ఏర్పాటులో, దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేసిన ఎండీ విద్యాసాగర్ రెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న విద్యాసాగర్ రెడ్డిని మంత్రి సీతక్క, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.
నూతన నాయకత్వంలో స్త్రీ నిధి సంస్థ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, స్త్రీ నిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి, డిప్యూటీ ఎండీ శ్రీనాథ్, స్త్రీ నిధి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





