– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : మలక్‌పేట్, ఉప్పుగూడ స్టేషన్లను గతంలో వేలాదిమంది ప్రజలు ఉపయోగించుకునే ముఖ్యమైన స్టేషన్లు. కాలక్రమేణా వాటి ప్రాధాన్యత తగ్గినా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆధునిక సదుపాయాలతో వీటిని పునరుద్ధరిస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. మýక్‌పేట ఉప్పుగూడ రైల్వే స్టేషన్‌లలో జరుగుతున్న ఆధునికీకరణ పనులను శనివారం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతంలో జరుగుతున్న రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులను పరిశీలించేందుకు మలక్‌పేట్, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లను ఈరోజు సందర్శించాను.. పాత బస్తీ ప్రజలకు కూడా దేశంలోని ఇతర నగరాల స్థాయిలో రైల్వే సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాం అని చెప్పారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా లిఫ్టులు, ఎస్కలేటర్లు, విస్తృతమైన ప్లాట్‌ఫారాలు, ప్లాట్‌ఫారం షెల్టర్లు, మెరుగైన పార్కింగ్, సర్క్యులేటింగ్ ఏరియా, ఆధునిక వెయిటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తాను విద్యార్థిగా ఉన్న రోజుల నుంచే ఉప్పుగూడ, మలక్‌పేట్ స్టేషన్లను ప్రజలు ఎంతగా ఉపయోగించుకునేవారో చూశాను.. ఇప్పుడు మళ్లీ వాటికి పూర్వ వైభవం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది.. పాత బస్తీ ప్రజలు కూడా గర్వపడేలా ఈ స్టేషన్లను అందంగా, ఆధునికంగా తీర్చిదిద్దుతున్నాం అని ఆయన చెప్పారు. హైదరాబాద్ నగరంలో రైల్వే నెట్‌వర్క్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.. ఎంఎంటీఎస్ రెండో దశ పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం.. ఈ ప్రాజెక్టు ద్వారా నగర ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాలు అందుతాయి.. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.. కొమురవెల్లి మల్లన్న భక్తులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు కొత్త కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను నిర్మించాం.. ఇప్పటికే 100 శాతం పనులు పూర్తయ్యాయి.. ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఆ స్టేషన్‌ను ప్రజలకు అంకితం చేయనున్నాం అని మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను సుమారు రూ.720 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ స్టేషన్ రూపుదిద్దుకుంటోందని, అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను కూడా రూ.350 కోట్లతో ఆధునీకరిస్తున్నామని, అక్కడ పనులు వేగంగా కొనసాగుతునాయని తెలిపారు. నగరంలో హఫీజ్‌పేట్, బేగంపేట్, నాంపల్లి, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, మలక్‌పేట్, యాకుత్‌పురా, ఉప్పుగూడ, ఉమదానగర్, షాద్‌నగర్, మల్కాజిగిరి, మేడ్చల్ తదితర రైల్వే స్టేషన్లను ఒకేసారి ఆధునికీకరించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమాన అభివృద్ధి అందించడమే తమ లక్ష్యమన్నారు. రైల్వే మౌలిక వసతులు అభివృద్ధి చెందడం ద్వారా ప్రజల ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతోపాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరుగుతాయన్నారు. ప్రజల సహాకారంతో హైదరాబాద్ రైల్వే వ్యవస్థను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని కిషన్‌రెడ్డి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



