రూ.8,888 కోట్ల అమృత్‌ టెండర్ల కుంభకోణం

సొంత బావమరిది కంపెనీకి టెండర్లు కట్టబెట్టిన సిఎం
బిజెపి ప్రభుత్వం విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ డిమాండ్‌

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్‌ పథకంలో సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన విూడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు అప్పగించారు. రూ.2 కోట్ల లాభం ఉన్న కంపెనీ రూ.1000 కోట్ల విలువైన పనులు చేస్తుందా? అమృత్‌ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టడం లేదు. టెండర్లపై కేంద్రం విచారణ జరిపించాలి. ఇప్పటి వరకు జరిగిన అమృత్‌ పథకం టెండర్లను రద్దు చేయాలి.

ఈ టెండర్ల అవినీతిపై కేంద్రానికి లేఖ రాశాం. ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయటపెడతాం అని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో రేవంత్‌ రెడ్డి అవినీతి కుటుంబ కథాచిత్రం నడుస్తోందని కేటీఆర్‌ విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో విూడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన 8,888 కోట్ల రూపాయల అమృత్‌ టెండర్ల కుంభకోణం గురించి సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే.. ఫిబ్రవరి మొదటి వారంలో 8,888 కోట్ల రూపాయల భారీ అవినీతికి సీఎం రేవంత్‌ రెడ్డి తెరలేపారని కేటీఆర్‌ విమర్శించారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా రేవంత్‌ రెడ్డి ఈ కుంభకోణాన్ని చేశారని అన్నారు. ఈ భారీ కుంభకోణంతో రేవంత్‌ రెడ్డి పదవీ కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి బావమరిది సూదిని సృజన్‌ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకపోయినా వేల కోట్ల రూపాయల పనులను కట్టబెట్టారని విమర్శించారు.

ఇండియన్‌ హ్యూమ్‌ పైప్‌ అనే కంపెనీని పిలిపించి బెదిరించి, ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారని తెలిపారు. పేరుకే ఇండియన్‌ హ్యూమ్‌ పైప్‌ కంపెనీ అయినా రేవంత్‌ రెడ్డి బావమరిది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారని కేటీఆర్‌ అన్నారు. ఇందులో టెండర్‌ దక్కించుకున్న ఇండియన్‌ హ్యూమ్‌ పైప్‌ కంపెనీతో రేవంత్‌ రెడ్డి బావమరిది జాయింట్‌ వెంచర్‌ పేరుతో డ్రామాకు తెరలేపారని తెలిపారు. 1,137 కోట్ల రూపాయల కాంట్రాక్టు గెలుచుకున్న తర్వాత ఆ కంపెనీ 20 శాతం పని చేస్తుందని, రేవంత్‌ రెడ్డి బావమరిది 80 శాతం వెయ్యి కోట్ల పని చేస్తుందని అంటున్నారని పేర్కొన్నారు. ఐహెచ్‌పీ అనే కంపెనీ ఈ మేరకు సెబీకి సమాచారం ఇచ్చిందని అన్నారు. ఈ కంపెనీని శిఖండి సంస్థగా అడ్డుపెట్టుకొని అనుముల రేవంత్‌ రెడ్డి, సూదిని సృజన్‌ రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి స్వయంగా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ కాంట్రాక్టులు కట్టబెట్టారని అన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా ఈ భారీ అవినీతికి తెరలేపారని కేటీఆర్‌ అన్నారు. ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ చట్టం, అవినీతి నిరోధక చట్టం 7, 11, 13 నిబంధనల మేరకు రేవంత్‌ రెడ్డి విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు. రేవంత్‌ రెడ్డి పదవి కోల్పోతారని అన్నారు. తన కుటుంబ సభ్యులకు లబ్ది చేకూరిస్తే, ఆశ్రితపక్షపాతం చూపిస్తే ఈ చట్టం ప్రకారం శిక్షార్హులేనని స్పష్టం చేశారు. ఇవే చట్టాల కింద సోనియా గాంధీ తన పదవిని కోల్పోయిందని గుర్తుచేశారు. 2006లో సోనియా గాంధీ నేషనల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌గా పదవిలో ఉన్నందుకు ఈ చట్టం ప్రకారం తన పదవిని కోల్పోయిందని తెలిపారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా అక్రమ మైనింగ్‌ అనుమతులు తన కుటుంబ సభ్యులకు ఇచ్చినందుకు తన పదవి కోల్పోయారని గుర్తుచేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి 2011లో అశోక్‌ చవన్‌ ఆదర్శ కుంభకోణంలో తన పదవి కోల్పోయారని అన్నారు. ఇండియన్‌ హ్యూమ్‌ పైప్‌ కంపెనీ స్టాక్‌ ఎక్స్చేంజీలకు సమాచారం ఇవ్వాల్సిన గత్యంతరం వలన ముఖ్యమంత్రి బావమరిది సృజన్‌ రెడ్డికి దక్కిన వందల కోట్ల రూపాయల టెండర్‌ బయటకు వచ్చిందని తెలిపారు. వీటికి సంబంధించిన ఒక్క జీవో కూడా ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పెట్టడం లేదని అన్నారు. టెండర్ల తాలూకు పూర్తి సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని డిమాండ్‌ చేశారు.

రేవంత్‌ రెడ్డి చేస్తున్న అనేక కుంభకోణాలకు సంబంధించిన వివరాలను ప్రజల ముందు వరుసగా ఉంచుతామని కేటీఆర్‌ తెలిపారు. కొడంగల్‌ ఎత్తిపోతల పథకం, ఫోర్‌ బ్రదర్స్‌ సిటీ వంటి కుంభకోణాలను ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. బావమరిదికి అమృతం పంచుతూ తెలంగాణ ప్రజలకు విషాన్ని పంచుతున్న రేవంత్‌ రెడ్డిని ప్రజల ముందు ఎండగడతామని స్సష్టం చేశారు. అమృత్‌ పథకం అనేది కేంద్ర ప్రభుత్వ పథకమని.. అందుకే ఈ టెండర్లలో జరిగిన అభివృద్ధి అక్రమాలపై నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులకు లేఖ రాశామని తెలిపారు. ఈ టెండర్లలో జరిగిన అక్రమాలను తేల్చాలని కోరామని అన్నారు.

రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్న కేంద్ర ప్రభుత్వ అమృత్‌ పథకంలో జరిగిన అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మక్కు కాకపోతే పూర్తిస్థాయి ఎంక్వైరీకి కేంద్రం ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. అమృత్‌ టెండర్లను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఈ విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం పరిధిలోని ఈ పథకంలో జరుగుతున్న అవినీతిపై వెంటనే విచారణకు ఆదేశించాలన్నారు. లేదంటే రేవంత్‌ రెడ్డికి, కేంద్రంలోని బీజేపీ నేతలకు అవినీతితో సంబంధం ఉందని అనుకోవాల్సి వస్తుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *