“న్యాయస్థానాల తలుపులు కూడా తట్టి, అనుకూలమైన ఉత్తర్వులు సంపాదించుకుని కూడా వాటిని ఖాతరు చేయని ప్రభుత్వాధికారుల ముందు నిస్సహాయంగా మిగులుతున్నవాళ్లు. రాజకీయ నాయకత్వాల రెండు నాల్కల, బహు నాల్కల వైఖరులతో విసుగెత్తినవాళ్లు. ఒక చివరి అవకాశంగా తమ గోడు సమాజానికి వినిపించుకుందామని వచ్చారు. రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల అఖిల పక్ష సమావేశంలో హృదయవిదారకమైన వేదన వినిపించారు. సమాజం నుంచి సంఘీభావాన్ని ఆశిస్తున్నారు.”
“గుర్తులు మారినయి గని గుణాలు మారలే” అన్నాడు మేడిపల్లి రైతు కొండల్ రెడ్డి. ఆ ఒక్క వాక్యం చాలు, పాలకులెవరైనా ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదనే వాస్తవానికి అద్దం పట్టడానికి. దాదాపు పది సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో మొదలైన కష్టాలు, అప్పుడు ప్రతిపక్షంగా ఉండిన కాంగ్రెస్ తాను అధికారం లోకి రాగానే తొలగిస్తానని వాగ్దానం చేసిన కష్టాలు, ఈ రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కూడా యథాతథంగా కొనసాగడం, ఇంకా ఎక్కువ కావడం ఆయన స్వానుభవంలో ఉంది గనుక ఆయన ఆ అద్భుతమైన సత్యాన్ని ప్రకటించగలిగారు. ఆయనతో పాటే నానక్ నగర్ కు చెందిన బర్ల మల్లేష్, కుర్మిద్దకు చెందిన దేవుజీ, కుర్మిద్ద తండాకు చెందిన శ్రీకాంత్ వంటి రైతులెందరో అవే విషాద, ఆగ్రహ కథనాలను వినిపించారు. “రాష్ట్ర అభివృద్ధి కోసం మేం, ఎకరం, రెండెకరాలున్న చిన్న రైతులమే త్యాగం చేయాలా? వందల ఎకరాలున్న ఆసాములు మీరు త్యాగం చేయండి. మీ భూములు ఇవ్వండి” అని వాళ్లు పాలకులను నిలదీశారు.
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో రెండు వారాల కింద జరిగిన ఒక సమావేశంలో హాజరైన వారి ముందు తమ కష్టాలూ కడగండ్లూ వెళ్లబోసుకున్న, పోరాటస్ఫూర్తి ప్రకటించిన అయిదారుగురు రైతులలో కొండల్ రెడ్డి ఒకరు. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలలోని గ్రామాల నుంచి దాదాపు ముప్పై నలబై మంది రైతులు ఆ రోజు ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన ఒక అఖిలపక్ష సమావేశంలో పాల్గొనడానికి వచ్చారు.
కందుకూరుకూ యాచారంకూ మధ్య గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఫార్మా సిటీ, అక్కడే ప్రస్తుత ప్రభుత్వం విస్తరిస్తున్న ఫ్యూచర్ సిటీ, గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టుల వల్ల భూమి కోల్పోయిన, కోల్పోతున్న రైతులు వాళ్లు. దాదాపు పది సంవత్సరాలుగా తమ మీద ప్రభుత్వాల దౌర్జన్యానికి, నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా ఎక్కే గడపా, దిగే గడపా అన్నట్టుగా అధికార కేంద్రాలను అడిగీ అడిగీ అలసిపోయినవాళ్లు. న్యాయస్థానాల తలుపులు కూడా తట్టి, అనుకూలమైన ఉత్తర్వులు సంపాదించుకుని కూడా వాటిని ఖాతరు చేయని ప్రభుత్వాధికారుల ముందు నిస్సహాయంగా మిగులుతున్నవాళ్లు. రాజకీయ నాయకత్వాల రెండు నాల్కల, బహు నాల్కల వైఖరులతో విసుగెత్తినవాళ్లు. ఒక చివరి అవకాశంగా తమ గోడు సమాజానికి వినిపించుకుందామని వచ్చారు. రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల అఖిల పక్ష సమావేశంలో హృదయవిదారకమైన వేదన వినిపించారు. సమాజం నుంచి సంఘీభావాన్ని ఆశిస్తున్నారు.
“ఈ క్రమమంతా, అంటే 2017 నుంచి 2023 దాకా ఈ రైతులకు, ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీకి అప్పటి ప్రతిపక్ష నాయకులైన కాంగ్రెస్ నేతలందరూ సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులు చేసిన మహా పాదయాత్రలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క వంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఫార్మా సిటీకి భూములు ఇవ్వవద్దనీ, తాము అధికారంలోకి రాగానే ఫార్మా సిటీని రద్దు చేసి, రైతుల భూముల మీద వారికే పూర్తి హక్కు కల్పిస్తామనీ వాగ్దానాలు చేశారు.”
రంగులూ నినాదాలూ పేర్లూ ఏవైనా మన పాలకుల అసలు స్వభావాన్ని చూపే ఈ రైతు విషాద గాథ ఇప్పటిది కాదు. తొమ్మిది సంవత్సరాలుగా అనేక మలుపులు తిరిగిన గాథ ఇది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం 2017లో ఈ ప్రాంతంలో 19,333 ఎకరాలలో ఫార్మా సిటీ నిర్మించాలని ఆలోచన ప్రారంభించింది. మూడు దశలుగా సాగే ఈ పథకం మొదటి దశలో 150 ఫార్మా కంపెనీలు ఉత్పత్తి ప్రారంభిస్తాయని, మొత్తంగా ఈ పథకంలోకి 9.7 బిలియన్ డాలర్ల (అప్పటి మారకపు రేటు ప్రకారం రు. 64,000 కోట్లు) పెట్టుబడులు ప్రవహిస్తాయని, ఒక లక్షా యాబై వేల మందికి ప్రత్యక్షంగా, ఐదు లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ కల్పన జరుగుతుందని అప్పటి పాలకులు ప్రకటించారు. (అప్పుడు అమ్మిన కలలు అవి. ఇన్నేళ్ల తర్వాత అందులో పదో వంతు కూడా నిజం కాలేదనేది వేరే సంగతి). పాలకులు వాగ్దానం చేసిన పాలూ తేనే ప్రవహించలేదు గాని రైతుల భూముల ఫలహారం మాత్రం మొదలయింది. తెలంగాణ పాలకులు ప్రారంభించిన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించి, 2019లో దీన్ని నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ మానుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) గా ప్రకటించింది.
అప్పటికే 2013 భూసేకరణ చట్టం స్ఫూర్తిని తారుమారు చేస్తూ తెరాస ప్రభుత్వం తెచ్చిన అనేక జీవోల సాయంతో, 2017 తెలంగాణ చట్టం సాయంతో యాచారం మండలంలో దాదాపు పది వేల ఎకరాలు, కందుకూరు మండలంలో మూడు వేల ఐదు వందల ఎకరాలు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. ఈ పథకానికి ఎంచుకున్న భూముల్లో ఎక్కువ భాగం ప్రభుత్వ భూములు, పేద ప్రజలకు పంచిన అసైన్డ్ భూములు. దళితులకు అందిన చిన్నపాటి మడిచెక్కలను కూడా కొల్లగొట్టే ప్రక్రియ ఇది. ఈ భూములు సేకరించడానికి ప్రభుత్వం తెచ్చిన జీవో చెల్లదని హైకోర్టు కొట్టివేసింది. తర్వాత మరొక జీవో తెస్తే దాన్ని కూడా హైకోర్టు కొట్టేసింది. అప్పుడిక 2017 చట్టం ప్రకారం పట్టా భూముల సేకరణ కూడా ప్రారంభించారు. ఈ భూసేకరణకు వ్యతిరేకంగా మేడిపల్లి, నానక్ నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, కుర్మిద్ద తండాల నుంచి దాదాపు ఎనిమిది వందల మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు భూసేకరణను నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చింది. దాదాపు 2,500 ఎకరాల భూమి ప్రభుత్వం సేకరించడానికి వీలు లేదని కోర్టు స్టే ఉంది. కొన్ని కేసుల్లోనైతే హైకోర్టు అప్పటికే సాగిన భూసేకరణను కూడా రద్దు చేసి, ప్రక్రియ మళ్లీ ప్రారంభించాలని ఆదేశించింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నాలుగు గ్రామాలలో భూసేకరణకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ రద్దయ్యాయి.
ఈలోగా ఈ గ్రామాలకు చెందిన కూలీలు కూడా తమకు పూర్తి స్థాయి పునరావాసం కల్పించకుండా గ్రామంలో ఎటువంటి భూమినైనా భూసేకరణలో స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదని హైకోర్టుకు వెళ్లారు. ఆ వాదనను అంగీకరించిన హైకోర్టు భూసేకరణ జరపగూడదని, సేకరించిన భూమిలో పనులు మొదలు పెట్టగూడదని స్టే ఇచ్చింది. అసైన్మెంట్ భూమి అయినా, పట్టా భూమి అయినా, రైతులు ఆమోదం తెలిపి సమర్పించిన భూమిలో అయినా ఎటువంటి పనులు చేపట్టగూడదని 2021 లో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు నిర్దేశిస్తున్నాయి.
అయినప్పటికీ, ప్రభుత్వం ఏమీ ఖాతరు చేయకుండా ధరణి ఆన్ లైన్ రికార్డులలో పట్టా రైతుల పేర్లను తొలగించింది. ఈ కోర్టు ధిక్కారాన్ని రైతులు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తే, అప్పటి ప్రభుత్వం ఆర్ డి ఓ ద్వారా “తప్పు జరిగింది. రైతుల పేర్లు ఆన్ లైన్ లో తొలగించడం పొరపాటు. తొలగించిన పేర్లన్నీ మళ్లీ చేరుస్తాము” అని కోర్టుకు హామీ ఇచ్చింది. ఆ పని అప్పటికీ ఇప్పటికీ జరగలేదు.
“ఈ కొత్త ఫ్యూచర్ సిటీ కోసం, రేడియల్ రోడ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇంతకాలం విమర్శించిన 2017 భూసేకరణ చట్టాన్నే ఉపయోగించుకుని భూసేకరణ ప్రయత్నాలు చేస్తున్నది. గతంలో ప్రభుత్వ సేకరణనుంచి కాపాడతామని చెప్పిన భూములనే ఇప్పుడు రైతుల నుంచి లాక్కుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది. గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో తమ భూములను లాక్కోవద్దని కుర్మిద్ద తండా రైతులు నిరసన దీక్షలు చేపడితే వారిని బెదిరిస్తున్నారు. ప్రతి గ్రామంలో వందలాది మంది పోలీసులను దించి భీతావహం సృష్టిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూసేకరణ జరపగూడదని, సేకరించిన భూములలో ఎటువంటి నిర్మాణాలూ చేపట్టగూడదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను, స్టేలను తుంగలో తొక్కుతూ చట్టవ్యతిరేకంగా పనులకు టెండర్లు పిలుస్తున్నారు.”
నిజానికి ఇక్కడ రైతుల నిర్వాసితత్వం, భూమిని ప్రభుత్వం కారు చౌకగా లాక్కొని ఫార్మా కంపెనీలకు అమ్మడం అనే సమస్యలే వెలుగులోకి వచ్చాయి గాని, ఫార్మా కంపెనీలవల్ల రానున్న కాలుష్యం, పర్యావరణ విధ్వంసం వంటి పెద్ద సమస్యలు పైకి రాలేదు. ఈ ప్రాంతాల బాధిత రైతులు ‘ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ’ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడం, రాజకీయ నాయకులను, అధికారులను కలవడం, న్యాయస్థానాల్లో పోరాడడం, పాదయాత్రలు నిర్వహించడం వంటి ఎన్నో రూపాలలో తమ నిరసన వ్యక్తం చేశారు. ‘ఫార్మా సిటీ వద్దురా, వ్యవసాయం ముద్దురా’ అనే నినాదం ఆ గ్రామాలన్నిట్లో మారుమోగింది. మూడు పంటలు పండే విలువైన భూమిని వదులుకుని పట్నాలకు వలసవెళ్లి బిచ్చగాళ్లుగా మారేందుకు ఆ రైతులు నిరాకరించారు. ఎకరానికి ఎనిమిది లక్షలు ఇచ్చి తమను వెళ్లగొట్టే అక్రమాన్ని తిరస్కరించారు.
ఈ క్రమమంతా, అంటే 2017 నుంచి 2023 దాకా ఈ రైతులకు, ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీకి అప్పటి ప్రతిపక్ష నాయకులైన కాంగ్రెస్ నేతలందరూ సంఘీభావం ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులు చేసిన మహా పాదయాత్రలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క వంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఫార్మా సిటీకి భూములు ఇవ్వవద్దనీ, తాము అధికారంలోకి రాగానే ఫార్మా సిటీని రద్దు చేసి, రైతుల భూముల మీద వారికే పూర్తి హక్కు కల్పిస్తామనీ వాగ్దానాలు చేశారు.
ఎన్నికలు జరిగి 2023 డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ‘ఫార్మా సిటీని రద్దు చేస్తున్నాం’ అని ఒక ప్రకటన కూడా వెలువడింది. కాని ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తూ అంతకు ముందు వచ్చిన జీవో నం. 31 రద్దు కాలేదు. ఎన్నికలకు ముందు, ఫార్మా సిటీ బాధిత రైతుల ఆందోళన సందర్భంగా హామీ ఇచ్చినట్టుగా ధరణి ఆన్ లైన్ లో తొలగించబడిన రైతుల పేర్లను పునరుద్ధరించడం జరగలేదు. ధరణికి ముందే మొదలైన రైతుల సమస్యలు ధరణిలో మాత్రమే కాదు, భూభారతిలో కూడా యథాతథంగా కొనసాగాయి. చివరికి ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం తయారు చేసిన వెబ్ సైట్ ను కూడా ఇప్పటికీ మూసివేయలేదు. (పైగా ఇప్పుడు భారత రాష్ట్ర సమితి నాయకులు ఫార్మా సిటీని వ్యతిరేకిస్తూ చేస్తున్న ప్రకటనల వార్తలు ఆ వెబ్ సైట్ మీద వస్తున్నాయి!). తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తెచ్చిన 2017 భూసేకరణ చట్టాన్ని రద్దు చేసి, 2013 భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరిస్తామని చేసిన వాగ్దానం అమలులోకి రాలేదు.
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అనాలో, పుండు మీద కారం అనాలో గాని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాత 19,333 ఎకరాల ఫార్మాసిటీ స్థానంలో, అదే ప్రాంతంలో కొత్తగా 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీ లేదా ఫోర్త్ సిటీ ప్రకటించింది. ప్రస్తుతానికి రు. 18,785 కోట్ల వ్యయంతో తయారైన ఫ్యూచర్ సిటీ ప్రణాళికలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ హబ్, ఎంటర్టేన్ మెంట్ డిస్ట్రిక్ట్ లతో పాటు నివాస గృహాలు కూడా ఉంటాయట. ఔటర్ రింగ్ రోడ్ మీద రావిర్యాల నుంచి ఆమన్ గల్ వరకూ వెళ్లే గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ కూడా ఈ ప్రాంతం మీది నుంచే పోతుంది. ఫ్యూచర్ సిటీ కోసం ఒక డెవలప్ మెంట్ అథారిటీని, ఒక కమిషనరేట్ ను నెలకొల్పడం కూడా జరిగిపోయింది.
ఈ కొత్త ఫ్యూచర్ సిటీ కోసం, రేడియల్ రోడ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తాము ఇంతకాలం విమర్శించిన 2017 భూసేకరణ చట్టాన్నే ఉపయోగించుకుని భూసేకరణ ప్రయత్నాలు చేస్తున్నది. గతంలో ప్రభుత్వ సేకరణనుంచి కాపాడతామని చెప్పిన భూములనే ఇప్పుడు రైతుల నుంచి లాక్కుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది. గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో తమ భూములను లాక్కోవద్దని కుర్మిద్ద తండా రైతులు నిరసన దీక్షలు చేపడితే వారిని బెదిరిస్తున్నారు. ప్రతి గ్రామంలో వందలాది మంది పోలీసులను దించి భీతావహం సృష్టిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూసేకరణ జరపగూడదని, సేకరించిన భూములలో ఎటువంటి నిర్మాణాలూ చేపట్టగూడదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను, స్టేలను తుంగలో తొక్కుతూ చట్టవ్యతిరేకంగా పనులకు టెండర్లు పిలుస్తున్నారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్, ఎల్ అండ్ టి వంటి కంపెనీలకు నిర్మాణ పనులు అప్పగిస్తున్నారు. ఈ కాంట్రాక్టు కంపెనీలు పోలీసుల సహాయంతో రైతుల భూములను దురాక్రమించి చదును చేస్తున్నారు. నిర్మాణాలకు సిద్ధం చేస్తున్నారు. రైతులు హైకోర్టు స్టే గురించి ప్రస్తావిస్తే, “కావాలంటే కోర్టుకు వెళ్లి కంటెంప్ట్ కేసులు వేసుకోండి” అని పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు. కమిషనరేట్ ఏర్పాటు సందర్భంగా తమ గోడు వినిపించుకోవాలని, అధికారులకు మెమోరాండం ఇవ్వాలని రైతులు ప్రయత్నిస్తే వారిని అరెస్టు చేశారు.
దెబ్బ మీద దెబ్బ మీద దెబ్బగా సాగుతున్న ఇటువంటి అత్యవసర పరిస్థితిని సమాజం దృష్టికి తీసుకురావడానికే ఆ ప్రాంత రైతులు హైదరాబాద్ కు వచ్చారు. ఈ గ్రామీణ సమాజపు తీవ్ర, జీవన్మరణ సమస్యను నాగరిక నగర సమాజం వింటుందా? ప్రభుత్వాలు వినేట్టుగా చేస్తుందా?





