ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు గమనించినా గమనించక పోయినా రుతువులు వాటి విధులను విస్మరించవు – సకాలంలో లేక ఆకాలంలో వాటి రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. ప్రకృతి చేష్టలుడగవు . అది స్తంభించింది పోదు. ఎండలు మండిపడుతాయి. వానలతో వరదలు పొంగి పొరలుతాయి.చలి తీవ్రమయి వణుకు పుట్టిస్తుంది. వేసవిలో ఎండలకు,వాన కాలంలో వరదలకు, చలి కాలం లో చలికి గురి అయి ఇక్కట్ల పాలయ్యేది సామాన్యులు,పేదలు,నిరుపేదలు.పలు సందర్భాలలో,ప్రతి సంవత్సరం ఈ అట్టడుగు వర్గాల వారు అనేకులు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోలేక ప్రాణాలు సైతం కోల్పోతుంటారు.ప్రభుత్వాలకు,అధికార యంత్రాంగాలకు చీమ కుట్టినట్లయినా ఉండదు. సామాన్యులు అకాల మరణం పాలవుతున్నా ప్రభుత్వాలు కొనసాగుతుంటాయి. ఈ సంవత్సరం వలెనే ప్రతి సంవత్సరం వానలు పడగానే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర రోడ్లు, వీధులు, గల్లీలు వరదలతో నిండుతాయి, కోట్ల రూపాయలతో కొనుకున్న విలాసవంతమైన విల్లాలు ఉన్న ప్రాంతాలు జలమయమై నివాసితులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తాయి.
మనుషులు వాహనాలు నడపడం కష్టం. ట్రాఫిక్ జామ్ లతో గంటల కొద్దీ రోడ్ల పై నే ఆగిపోవాల్సిన దుస్థితి. రోడ్లపై తెరిచి ఉన్న మాన్ హోల్స్ లో పడి పాపం,పుణ్యం తెలియని పిల్లలు ప్రాణాలు కోల్పోతారు.ఒక సంవత్సరం ..రెండో సంవత్సరం ఇదే జరుగుతుంది.అయినప్పటికీ శాశ్వత చర్యలు కనిపించడం లేదు. వర్షా కాలం వొస్తుందని తెలుసు.. వాతావరణ శాఖ ముందే హెచ్చరిస్తుంటారు. అయినా, వర్షాలు కల్గించే ఇబ్బందులను నివారించడానికి,తట్టుకోవడానికి,జాగరూత వహించడానికి అధికార యంత్రాంగం ముందే మేల్కోదు.
రాజధాని నగరం లోనే వర్షాల వల్ల పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటే ఇక జిల్లా కేంద్రాలలో, పట్టణాలలో గ్రామాలలో ఎంత భయంకరంగా ఉంటుందో ఉహించుకోవొచ్చు. హైదరాబాద్ లోనే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనపుడు ఇక చిన్న నగరాలు.పట్టణాలు,గ్రామాలలో ఏ విధంగా ఉంటుంది . ఖమ్మం నగరంలో కురిసిన వర్షాలకు ఇబ్బందులకు గురైన వారికి సకాలంలో సహాయం అందలేదన్న వార్తలు ఇంకా వింటూనే ఉన్నాం. సహాయక చర్యలు మొక్కుబడిగా సాగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి . తెలంగాణా ప్రాంతంలో ఇప్పటికీ వ్యవసాయం చాలా వరకు చెరువులు,కుంతలా మీదనే ఆధారపడుతున్నది. వరదల తాకిడికి తట్టుకోలేక ఈ చెరువులు,కుంటలు కట్టలు తెగి విపరీత నష్టం సంభవిస్తున్నది.
వానాకాలం వరదలతో పలు వ్యాధులు, రుగ్మతలు కూడా కట్టలుతెంచుకుని వొచ్చి సోకుతుంటాయి.వానాకాలం రాబోయే ముందు మన ఆరోగ్య,వైద్య , కుటుంబ సంక్షేమ శాఖల వారు,మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీ వారు జాగరూకత వహించి వ్యాధి నిరోధక చర్యలు ముమ్మరంగా చేపట్టాలి. విశేషించి తాగునీరుతో వొచ్చే వ్యాధులు ప్రమాదకరం. తాగు నీరు,తినుబండారాలు,ఆహారపదార్థాలు కలుషితం కాకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలి..లేని పక్షంలో వానలు పడగానే విషజ్వరాలు,వింత జ్వరాలు,నీళ్ల విరేచనాలు,ఇతర ఉదార కోశ వ్యాధులు,గున్యా, డెంగ్యూ తదితర రోగాలు విజృంభిస్తాయి. ముఖ్యంగా పౌష్టికాహారం లభించని స్త్రీలు,పిల్లలు ఈ వ్యాధులకు గురయ్యే ప్రమాదముంది. పారిశుధ్యం,కాలుష్య నిరోధం పై ప్రభుత్వం అధిక దృష్టి పెట్టాలె. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ పై కేటాయిస్తున్న మొత్తాలు అతిస్వల్పం. ఈ దయనీయ స్థితిలో గణనీయమైన మార్పు వొచ్చినపుడే ప్రజల ఆరోగ్య స్థాయి,ఆరోగ్య ప్రమాణాలు మెరుగు పడతాయి.