సేకరించిన చెత్తను వెంటనే డంపు యార్డుకు తరలించాలి
హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: గణేష్ నిమజ్జనం ప్రక్రియ పూర్తయిన సందర్భంగా, గురువారం మిలాద్ ఉన్ నబి ర్యాలీ (ప్రొసిషన్ ) లను పురస్కరించుకొని జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట చార్మినార్ జోన్ లోని పలు ప్రాంతాల్లో క్షేత్ర పరిధిలో ఆకస్మికంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణ, పై పరిశీలన చేసారు. గురువారం ఉదయం కమిషనర్ ఆమ్రపాలి చార్మినార్ జోన్ లోని అలియాబాద్, శంషీర్ గంజ్, ఇంజన్ బౌలి, శాలిబండ మెయిన్ రోడ్, ఫలక్ నూమా బ్రిడ్జి ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా రోడ్లపై పడిన కలర్ పేపర్ షాట్స్, ఇతర మెటీరియల్స్ తదితర వ్యర్థాలను శుభ్రంగా తొలగించినది లేనిది పరిశీలించారు. సేకరించిన చెత్త ను వెంటనే డంపు యార్డు కు తరలించేందుకు అవసరమైన వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. గణేష్ శోభాయాత్ర సందర్భంగా అక్కడక్కడ వెలసిన ఫ్లెక్సీలు తొలగించాలని అధికారులకు సూచించారు.
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులు ర్యాలీలు నిర్వహిం చనున్నందున శానిటేషన్ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ర్యాలీలు నిర్వహించే ఆయా ప్రాంతాల్లో ఎలాంటి వ్యర్థాలు లేకుండా పారిశుధ్య నిర్వహణ సజావుగా జరగాలని, అదేవిధంగా గణేష్ నిమజ్జనానికి సంబంధించి తొలగించని మెటీరియల్ ను వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలని ఏ ఎం హెచ్ ఓ లకు సూచించారు.
మిలాద్ ఉన్ నబీ ర్యాలీలు పూర్తయిన వెంటనే రోడ్లపై పడిన చెత్త ఇతర వ్యర్థాలను వెంటనే తొలగించేలాచర్యలు తీసుకోవాలని శానిటేషన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట చార్మినార్, ఫలక్ నూమా అసిస్టెంట్ మెడికల్ అధికారులు జ్యోతి బాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.