భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిక్కించదగిన ఉద్యమం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. సాయుధ పోరాటానికి నాంది పలికినది దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన రావి నారాయణరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మ బిక్షంతో పాటు అనేకమంది యోధుల పోరాట వారసత్వ స్పూర్తిని పునికిపుచ్చుకొని తెలంగాణ ఆస్థిత్వాన్ని పతాక స్థాయిలో నిలబెట్టడానికి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమం నుండి మొదలుకొని పెద్ద మనుషుల ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, 1969 ఉద్యమం,తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్యవేదిక, వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ జన సభ, టీఆర్ఎస్ ఆవిర్భావం,సెంటిమెంట్ పేరిట జరిగిన ఉప ఎన్నికలు, 2009 ఫ్రీ జోన్ కి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉధ్యమం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు, ఎన్నారైలు, ఇంకా అనేక సంస్థలు, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామిక శక్తులు భిన్న రూపాలలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించడంలో క్రియాశీలక భూమిక పోషించారు. 1969 విద్యార్థి అమరవీరుల నుంచి మొదలుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ నారాయణ రావు, కేశవరావు జాదవ్, బియ్యాల జనార్దన్ రావు, ఆచార్య జయశంకర్, మారోజు వీరన్న, బెల్లి లలిత, గద్దర్, గూడ అంజన్న, అనేకమంది కవులు కళాకారులు, రచయితలు, మేధావులు, విద్యావంతులు, విప్లవ శక్తులు విరమణ లేకుండా తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను ఆరు దశాబ్దాలుగా సజీవంగా ఉంచారు. జరిగితే కొంత విరామం జరిగి ఉండవచ్చు. కానీ ఉద్యమ పంథాను ఏనాడు విరమించలేదు. సకల జనుల పోరాటం, సమష్టి ఉద్యమాలు, వందలాది మంది అమరుల త్యాగం ద్వారా 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. స్వార్థపూరిత రాజకీయ శక్తుల కంటే కూడా ప్రజా రాజకీయాలు చేసే వ్యక్తుల పాత్రే రాష్ట్ర ఏర్పాటు లో కీలకం. ఈ మహత్తరమైన ఆరు దశాబ్దాల పోరాటంలో ఎవరి త్యాగాలను, ఎవరి పోరాటాన్ని కూడా తక్కువ చేసి చూడడానికి వీలు లేదు.
మొత్తంగా వెలకట్టలేనంత గొప్ప ప్రజా ఉద్యమంగా కొనసాగింది. వొచ్చిన నూతన రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా చెప్పుకున్న తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు.ఈ పార్టీకి అధికారం కట్టబెట్టడానికి ప్రధాన కారణం ఆరు దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న అవమానాలు, అన్యాయం, వనరుల దోపిడీ ప్రధాన కారణమని తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో తేల్చి చెప్పారు. మా రాష్ట్రాన్ని మా ప్రాంతం వారే పరిపాలిస్తే అన్యాయాలకు అక్రమాలకు తావు ఉండదని తెలంగాణ సమాజం కలలుగన్నది. కానీ ఆది నుంచే వలసవాద నమూనా పాలనను ప్రారంభించారు. బహుశా ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎంపికైన కేసీఆర్ చంద్రబాబుతో కలిసి పనిచేసిన అనుభవంతో వలసవాద విధానాలకు ఆకర్షితులైన ప్రభావమై ఉండవచ్చు. తొలి ప్రభుత్వం మంత్రివర్గమంతా తెలంగాణ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారితో పరిపూర్తి చేశారు. ఉద్యమ ఆకాంక్షలను విస్మరించిన వారిని, ఉద్యమకారులను వెంటపడి కొట్టిన వారిని పాలన విభాగంలో ప్రధానం చేశారు.దరిదాపుగా 10 ఏళ్ల పాలన మొత్తం కూడా కాంట్రాక్టర్ల కార్పొరేట్ శక్తుల కేంద్రంగా నడిపించారు. అధికారాన్ని మొత్తం కేంద్రీకరణ చేసుకొని ప్రజాస్వామిక శక్తులను పౌర సమాజ సంస్థలను అణచివేశారు. ప్రశ్నించిన ప్రజాస్వామ్య గొంతుకలను పనిగట్టుకొని పథకం ప్రకారం అక్రమ కేసులు బనాయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.ఆచార్య జయశంకర్ ఆలోచనలకు, ఉద్యమ ఆకాంక్షలకు ఈ పాలన వ్యతిరేకంగా కొనసాగుతుందని గొంతెత్తి నినదించిన తెలంగాణ ఉద్యమ రథసారథి ఆచార్య కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టడానికి కూడా కేసీఆర్ వెనకాడ లేదు. దీనినిభట్టి కేసీఆర్ పాలన ఎంత నిరంకుశంగా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్ర ఏర్పాటులో క్రీయాశీలక భూమిక పోషించిన ఉద్యమకారులను అణగదొక్కడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నాడు. ఉద్యమకారుల గురించి ఏనాడు కీర్తించలేదు. కొంతమంది వందీమాగధులను తప్ప ప్రజల ఆకాంక్షల పట్ల అవగాహన ఉన్నవారిని ఎవరిని కూడా పాలనలో భాగస్వాములు చేయలేదు. తెలంగాణకు జరిగిన అన్యాయాల పట్ల వివక్షతల పట్ల అవగాహన లేనివారు ప్రధాన స్థానాలలో కూర్చోవడంతో దశ దిశ లేని 10 ఏళ్ల పాలనలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల కుప్పై కూర్చున్నది. తెలంగాణ ఉధ్యమ కారులు(శక్తులు) తొలిదశ నుండి మొదలుకొని మలిదశ ఉధ్యమం వరకు ఏమి ఆశించకుండా నిస్వార్థంగా ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు కోసం ఉధ్యమించారు. నూతన రాష్ట్రంలో, పాలనలో భాగం, పైసలో భాగం ప్రజలందరికి దక్కాలని ఉధ్యమకారులు ఆకాంక్షించారు.కాని కేసీఆర్ పాలనలో ఉద్యమకారుడు అనే పదం వినపడకుండా, ఉద్యమ శక్తుల నామరూపాలు లేకుండా చేయడమే పనిగా పెట్టుకున్నారు.కేసీఆర్ పదేళ్ల పాలనలో విసిగి వేసారిన ఉధ్యమ శక్తులు, పౌర సమాజ సంస్థలు కేసీఆర్ నియంతృత్వ దుర్మార్గపు విధానాలను ప్రజల ముందు ఉంచడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ఆదరించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కాంగ్రెస్ పదేళ్లలో ప్రజల మధ్యన ఉన్నది చాలా అరుదు. పౌర సమాజ సంస్థలు, ఉద్యమ కారులు చేసిన భావజాల వ్యాప్తే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడింది.
తెలంగాణ ఉద్యమం కోసం అనేకమంది ఉద్యమ కారులు అనేక త్యాగాలు చేశారు. ఆస్తులను అమ్ముకొని ఉద్యమానికి ఖర్చు పెట్టిన వారు ఉన్నారు. ఉద్యమంలో పాల్గొని కుటుంబాలు ఆర్థికంగా సంక్షోభంలో కూరుకొనిపోయాయి. కొంతమంది కుటుంభ సభ్యులను కోల్పోయిన వారు ఉన్నారు, మా రాష్ట్రం మాకు వొస్తే మా ఉద్యోగాలు మాకు వొస్తాయని యువత ఉవ్వెత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. పదుల సార్లు జైలుకు పోయి, వందల కేసులను అనుభవించారు. ఇంకా కేసులు సంపూర్ణంగా ఎత్తివేయకపోవడంతో న్యాయస్థానాల చుట్టు తిరుగుతున్న వారూ ఉన్నారు. అరకొరగా కొంతమందికి ఉద్యోగాలు వొచ్చినా కేసుల కారణంతో కోల్పోతున్నారు. ఐదేళ్లు తెలంగాణ ఉద్యమం, పదేళ్ల కేసీఆర్ పాలనలో ‘ఉద్యోగాల కరువు’ మొత్తంగా 15 ఏండ్లు వయస్సు పైబడి అంతంతమాత్రంగా వొచ్చిన ఉద్యోగ అవకాశాలు కోల్పోయినవారు అనేకం. ఉద్యమ కేసులు ఉండటంతో విదేశాలలో ఉంటున్న తమ పిల్లల వద్దకు పోవడానికి వీసా విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. టిఆర్ఎస్ (బిఆర్ఎస్ ) ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తొలినాళ్లలో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రం కోసం 1200 మంది అమరులయ్యారని వారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని తీర్మానం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూములు, వ్యవసాయ భూములు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆఖరికి 500 పైగా కుటుంబాలను మాత్రమే గుర్తించి ఆరా కోరా ఆర్థిక సహయం చేసి చేతులు దులుపుకున్నది. మొత్తంగా ఉద్యమకారులను బిఆర్ఎస్ మోసం చేసింది.
ఉద్యమకారుల గురించి మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేయడంతో మేము(కాంగ్రెస్) అధికారంలోకి వస్తే ఉధ్యమకారుల,అమరవీరుల త్యాగాలకు గుర్తింపుగా తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతి, యువకులను ఉద్యమ అమరవీరులుగా గుర్తించి ఆ కుటుంభంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హమీ ఇచ్చారు. ఆ కుటుంభంలో తల్లి/తండ్రి/భార్యకు నెలవారీ గా 25000/ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేస్తామన్నారు.ఉద్యమంలో పాల్గొన్న యువతపై కేసులు ఎత్తివేయడంతో పాటు ఉద్యమకారులను గుర్తించి జూన్ 2 న ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇస్తాం. 250 గజాల ఇంటిస్థలాన్ని కేటాయించి గౌరవభృతిని అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో అనేక వేదికల పై వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చి 15 నెలలు గడుస్తున్నది. ఇంతవరకు ఉద్యమకారులను గుర్తించిన దాఖలాలు లేవు. డిసెంబర్ 7,2023న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడుతూ చాలా పోరాటాల తర్వాత, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి ఉద్యమకారులను కూడా ఆహ్వానించారు కానీ ఆ వైపుగా ప్రసంగం కొనసాగలేదు. 2024 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ గ్రామాలు, మండలాలు, పట్టణాల నుంచి ప్రభుత్వమే రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉద్యమకారులను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు ఆహ్వానించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిననాడే తెలంగాణ సాధనకు సార్థకత దక్కుతుందన్నారు. కాని అమరుల కుటుంబాల గురించి గాని, ఉద్యమకారుల గురించి గాని, వారికి ఇచ్చిన హామీల విషయమై గాని ఒక్క వాక్యం అంటే ఒక్క వాక్యం కూడా మాట్లాడలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ పలుమార్లు మాట్లాడుతూ ఉద్యమకారులను ఆదుకుంటామన్నారు.ఎమ్మెల్సీ ఆచార్య కోదండరాం కూడా శాసనమండలిలో ఉద్యమకారులకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని ప్రస్తావించారు. కాని సమాధానం రాలేదు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి డిమాండ్ తెలంగాణ తోనే ముడిపెట్టడం జరిగింది. ప్రతి సమస్యకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే పరిష్కారమని సమాజం ముందు ఉంచడం జరిగింది .ఉద్యమకారులు ఉద్యమ కాలంలో ఎలాంటి ప్రయోజనాలను ఆశించలేదు. కానీ మారిన కాలానుగుణంగా ఉద్యమకారుల డిమాండ్ కూడా పట్టించుకోవాలి. దీనికి రాజ్యాంగం వ్యతిరేకం కాదు, రాజకీయ పార్టీలు, న్యాయస్థానాలు కూడా వ్యతిరేకం కాదు.ఉద్యమకారులకు ఒక క్రైటీరియా నిర్ణయించుకొని దశలవారీగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అన్ని జిల్లా కేంద్రాలలో ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి.ప్రభుత్వానికి ఇది పెద్ద ఆర్ధికపరమైన సమస్య కూడా ఏమి కాదు.కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ లో 5% కాదు.కార్పొరేట్ కంపెనీల బకాయిలు మాఫీ చేసే దాంట్లో 10% ఖర్చుగా కూడా ఉండబోదు.ఈ ప్రయత్నం చేయకుండా రాజకీయాలు చేయడం గాని,అధికారం చేపట్టడం గానీ చేస్తే భవిష్యత్తులో ఇలాంటి పార్టీలకు అవకాశాలు ఉండవని గ్రహించాలి.అంతిమంగా ఉద్యమ ఆకాంక్షలను,ఉద్యమకారులకు ఇచ్చిన హమీలను,మాత్రం పట్టించుకోవాలి.ఈ బడ్జెట్ ఉద్యమకారులకు న్యాయం చేసే దిశగా ఉండాలని సోయి కలిగిన పౌర సమాజంగా ఆకాంక్షిస్తున్నాం..
పందుల సైదులు న్యాయవాది
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192