బిఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధికి చేసిన అప్పు రూ.3.22.499 లక్షల కోట్లు మాత్రమే..
ఆర్‌బిఐ ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్-2024’ నివేదికే నిదర్శనం
అబద్ధాలతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రంపై దుష్ప్రచారాలు మానుకోవాలి
సిద్ధిపేటలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే హరీష్‌రావు వార్నింగ్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 12: తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం కాదు, దేదీప్యమానంగా వెలుగుతున్న రాష్ట్రమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రిపోర్టు తేల్చిచెప్పిందని, తెలంగాణ దివాలా అంటున్నవారికి ఆర్‌బిఐ తాజా రిపోర్ట్ చెంపపెట్టు అని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. గురువారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో హరీష్‌రావు మాట్లాడారు. అబద్ధాల అబద్దాల పునాదులపై ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవే అబద్ధాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతోందని ధ్వజమెత్తారు. నిజాన్ని అబద్దంగా మార్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ,నిజం నిప్పు లాంటిదని, కొంత ఆలస్యంగాన్కెనా బయటకు వొచ్చి అందరి కళ్ళు తెరిపిస్తుందన్నారు. ఆర్‌బిఐ నివేదికతో పదేళ్ల తెలంగాణ అభివృద్ధిపై, ఆర్థిక వృద్ధిపై కాంగ్రెస్ మంత్రులు, సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్నది దుష్ప్రచారమేనని తేలిపోయిందన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో సంపదను సృష్టించడం, దాన్ని రెట్టింపు చేయడమెలాగో దేశానికే చెప్పింది తెలంగాణేనని అన్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రతి రంగాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారని ఆర్‌బిఐ విడుదల చేసిన ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్-2024’ నివేదికలోని గణాంకాలు కండ్లకు కట్టినట్టు చెప్తున్నాయని పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేండ్ల బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ మొత్తం అప్పులు రూ. 7 లక్షల కోట్లకు చేరాయన్న రేవంత్ ప్రభుత్వ ప్రకటన వాస్తవ దూరమన్నారు.
అప్పుల కుప్ప అంటూ రాష్ట్ర పరువును దిగజార్చారు..
బిఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ అభివృద్ధికి చేసింది రూ.3.22.499లక్షల కోట్లు మాత్రమే అన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో జీఎస్డీపీ, తలసరి ఆదాయం, విద్యుత్తు, సాగు విస్తీర్ణం, వ్యవసాయం, అటవీ విస్తీర్ణం, మూలధన వ్యయం, ఉపాధి అవకాశాలు ఇలా అన్నింటా తెలంగాణ రికార్డు సృష్టించి అభివృద్ధికి అర్థమేంటో చెప్పిందని అన్నారు. కేసీఆర్ ఘనతకు, తెలంగాణ పదేళ్ల అభివృద్ధికి ఇంతకుమించిన తార్కాణం ఇంకేముంటుంది? స్పష్టం చేశారు. తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం కాదని ఆర్బీఐ రిపోర్టుతో తేలిపోయింది కదా, దీనిపై కాంగ్రెస్ నేతలు ఏమంటారు? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ అప్పుల కుప్ప అని రాష్ట్ర పరపతిని, పరువును దిగజార్చారని మండి పడ్డారు. ఏడు లక్షల కోట్ల అప్పు అని దుష్ప్రచారం చేశారన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ పేద రాష్ట్రమని ప్రచారం చేశారు. అసెంబ్లీ వేదికగా రాష్ట్రంపై తప్పుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. కానీ, ఆర్‌బిఐ రిపోర్టుతో అవన్నీ పటాపంచలయ్యాయన్నారు. గత డిసెంబర్‌లో కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల కరపత్రమని తేటతెల్లమైందన్నారు. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ. 72,658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూ. 3,22,499.20 కోట్లకు చేరినట్టు ఆర్‌బిఐ వెల్లడించిందన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన అప్పు 3 లక్షల 22 వేల 499 కోట్లు మాత్రమే అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ విషప్రచారం చేయడాన్ని మానుకోవాలని హెచ్చరించారు. అప్పుల ద్వారా కేసీఆర్ సంపద సృష్టించారు. పేదలకు పంచారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఇది కూడా ఆర్‌బిఐ తన నివేదికలో స్పష్టంగా చెప్పిందన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ఆర్‌బిఐ కళ్ళు తెరిపించేలా చెప్పిందని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో ఆస్తులు సృష్టించామనీ, సంపద పెంచామనీ, పేదలకు పంచామన్నారు. బిఆర్‌ఎస్ పాలన తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల ఆస్తులను సమకూర్చిందనే వాస్తవాలను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే వెలుగు చూడనివ్వడం లేదనీ, చర్చకు రానివ్వడం లేదన్నారు.
కాలేశ్వరానికి 94,000 కోట్ల రూపాయలతో లక్షల కోట్ల విలువైన ఆస్తులను సాధించామని చెప్పారు. మిషన్ భగీరథకు రూ. 28,000 కోట్లు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం … రూ. 27,554 కోట్లు, సీతారామ ప్రాజెక్టు …. రూ. 8056 కోట్లు, దేవాదుల ప్రాజెక్టు రూ. 6000 కోట్లు, సమ్మక్క సాగర్ రూ. 2000 కోట్లు, మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల కోసం 4,000 కోట్లు ఖర్చు చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించామని పేర్కొన్నారు. తుమ్మిళ్ల, భక్త రామదాసు ప్రాజెక్టులు పూర్తి కావొచ్చాయన్నారు. ఆర్‌అండ్‌బి ద్వారా 8200 కిలోమీటర్లు డబుల్ ల్కెన్, 321 కి.మీ ఫోర్ ల్కెన్, 382 బ్రిడ్జిలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిందన్నారు. దేవాలయాలను కట్టడానికి రూ. 2,800 కోట్లు, రైతు బంధుకు రూ. 72,972 కోట్లు, రైతు బీమాకు రూ. 6,800 కోట్లు, రైతు రుణమాఫీకి రూ. 29 వేల కోట్లు, ఉచిత కరెంట్‌కు రూ. 61వేల కోట్లు, గొర్రెల పంపిణీకి రూ. 5 వేల కోట్లు, ఆసరా పింఛన్లకు రూ. 61 వేల కోట్లు, మీరు కూర్చుంటున్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయం, పటిష్టమైన భద్రత కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ, జిల్లాకు ఒక కలెక్టరేట్, జిల్లాకు ఒక ఎస్‌పి ఆఫీస్, వెయ్యికి పైగా గురుకులాలు, 68 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న వరి ఉత్పత్తిని 2 కోట్ల మెట్రిక్ టన్నులకు పెంచామన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో ఇంత అభివృద్ధి జరిగినా, మీరు తెలంగాణ దివాలా రాష్ట్రమని దుష్ప్రచారాలు చేస్తున్నారనీ, ఇకన్కెనా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్రంపై ఈ దుష్ప్రచారాలు మానుకోవాలని హరీష్‌రావు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, కడవేర్గు రాజనర్సు, పాల సాయిరాం, కాముని శ్రీనివాస్, గుండు భూపేష్, తాడూరి సాయి ఈశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.