*రైతు భరోసా రూ.12వేలకు పెంచాం..
*భూమిలేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రూ.12 వేలు ఇస్తాం
*వ్యవసాయ ఉచిత కరెంటుకు ఏటా రూ.12 వేల కోట్లు చెల్లిస్తున్న ప్రజా ప్రభుత్వం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే రైతు బంధు ఇవ్వదని దుష్ప్రచారం చేసిన వారి చెంపలు చెల్లుమనే విధంగా రైతు భరోసా పెట్టుబడిని ప్రజా ప్రభుత్వం పది వేల నుంచి 12 వేల రూపాయలకు పెంచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు.నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి, నరసాయిపల్లి పాలెం, ఇద్రకల్, సిరిపురం గ్రామాల్లో 33/11 కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంట్ సభ్యులు మల్లు రవిలతో కలిసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా శాయిన్ పల్లి గ్రామంలో 7500 ఎకరాలకు సాగు నీరు అందించే మార్కండేయ ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి 12 వేల రూపాయలు ఇచ్చేటువంటి ప్రక్రియ ఈనెల 26 నుంచి మొదలు కాబోతుందని వెల్లడించారు. రైతులకు, వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత కరెంటుకు సంబంధించి ఏడాదికి 12 వేల కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం రైతుల పక్షాన విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్ల కరెంటును గృహ జ్యోతి పథకం ద్వారా గత మార్చి ఒకటి నుంచి ఇస్తున్నామన్నారు. డిస్కంలపై భారం పడకుండా ప్రతినెల ప్రజా ప్రభుత్వం విద్యుత్ శాఖకు ఈ డబ్బును చెల్లిస్తున్నదన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులకు ఏ పంటకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు పంట నష్టపరిహారం చెల్లించడంతో పాటు పంట బీమా, రైతు బీమా ప్రీమియం డబ్బులను రైతుల పక్షాన ప్రభుత్వమే చెల్లిస్తున్నదని చెప్పారు. గత ప్రభుత్వ హాయంలో ట్రాన్స్ఫార్మర్ కావాలంటే రైతులు ఎంతో ఇబ్బంది పడాల్సి వొచ్చిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా చేశామన్నారు. పైరవీలు లేకుండా, దలారుల బెడద లేకుండా అవసరం ఉన్నచోట అడిగిన రైతులకు సకాలంలో ట్రాన్స్ ఫార్మర్ లు అందజేస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రైతులకు, విద్యుత్ అవసరాలు ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కావలసిన సామాగ్రిని రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి పైరవీ లేకుండా అందజేయడానికి కావలసిన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు పోతున్నామని వివరించారు. 108 తరహాలో విద్యుత్ శాఖలు 1912 కాల్ నెంబర్లు తీసుకొచ్చామని చెప్పారు. విద్యుత్ శాఖలో అత్యవసర సమస్యల పరిష్కారం కొరకు వినియోగదారులు 1912 నెంబర్ కు కాల్ చేసి సమస్యలను పరిష్కారం చేసుకోవొచ్చన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం పేదలకు 5 లక్షల రూపాయలు ఇస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మాణం చేస్తామన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేయాలని ఏడాదికి 20వేల కోట్లు, ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో మహిళలను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలని ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నదని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని గ్రామీణ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కె. రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్ తదితరులు పాల్గొన్నారు.