2027 డిసెంబరుకు దేవాదుల పూర్తి

– 38.16 టీఎంసీలతో 5.57 లక్షల ఎకరాలకు నీరు
– రూ.6,016 కోట్లతో ప్రారంభం.. సవరించిన అంచనాలతో రూ.18,400 కోట్లు
– ఇప్పటివరకు ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చు రూ.14,422 కోట్లు
– ఇప్పటికే 87.70 శాతం పనులు పూర్తి
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దేవాదుల ఎత్తిపోతల పధకం(జేసిఆర్‌డిఎల్ఐఎస్) 2027 డిసెంబర్ మాసాంతానికి పూర్తి చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాUల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 38.16 టీఎంసీల నీటితో హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భోనగిరి, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతోపాటు కరీంనగర్ జిల్లాకు చెందిన 5.57 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని తెలిపారు. పథకం పనుల పురోగతిపై శనివారం ఉదయం సచివాలయంలో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ(సీతక్క)లతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ 2004-2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రూ.6,016 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టిన దేవాదుల ఎత్తిపోతల పధకం నిర్మాణం గత బీఆర్‌ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురవడంతో అంచనా వ్యయం రూ.18,400 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై రూ.14,422 కోట్లు ఖర్చు పెట్టామని, మరో రూ.3,978 కోట్లతో 2027 డిసెంబర్‌కు పూర్తిచేసేందుకు పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు. మొత్తం మూడు దశలలో చేపట్టిన ఈ పథకం నిర్మాణాన్ని 16 ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మొదటి దశ ద్వారా 1.23 లక్షల ఎకరాలకు, రెండో దశ ద్వారా 1.93 లక్షల ఎకరాలకు, మూడో దశ ద్వారా 2.39 లక్షల ఎకరాలకు నీరు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. 20 పంప్ హౌజ్‌లు, 642 కి.మీ పైపు లైన్లు, 57.16 కి.మీ సొరంగ మార్గం, 20 రిజర్వాయర్లు, 306 ప్రధాన కాలువలు, 2,185 కి.మీ పంపిణీ కాల్వలకు ఈ ప్రాజెక్టు విస్తరించి ఉందని వివరించారు. ఆసియాలోనే అతి పొడవైన 49 కి.మీ డి-ఆకారపు సాగునీటి సొరంగం ఈ ప్రాజెక్టులో భాగమని పేర్కొన్న మంత్రి ప్రాజెక్టుకు అవసరమైన 495.55 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమ్మక్క బ్యారేజ్ అనుసంధానం వల్ల ఏడాది పొడవునా నీటి లభ్యత దాదాపు నిరంతరంగా ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు పనులు 87.70 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ప్రధాన పంప్ హౌస్‌లు, పైప్‌లైన్ వ్యవస్థలు, సొరంగ తవ్వకాల పనులు ఎక్కువగా పూర్తయ్యాయని చెప్పారు. కాల్వల లైనింగ్, పంపిణీ కాల్వల పనులు, కొన్ని నిర్మాణాల ఆలస్యం, భూసేకరణ సమస్యలు ఇంకా పూర్తిస్థాయి వినియోగాన్ని అడ్డుకుంటున్నాయని అన్నారు. ఫేజ్-1లోని ప్యాకేజీ-45 పూర్తిగా ముగిసిందని, ప్యాకేజీ-46 పనులు 96.86 శాతం పూర్తయ్యాయని తెలిపారు. అయితే బొల్లికుంట సమీపంలో 700 మీటర్ల కాల్వ లైనింగ్ పనులు కోర్టు కేసు కారణంగా నిలిచిపోయి వేల ఎకరాలకు సాగునీటి లాభాలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. ఫేజ్-2లో హెడ్‌వర్క్స్, పంప్ హౌస్‌లు, ప్రధాన పైప్‌లైన్ వ్యవస్థలు ఎక్కువగా పూర్తయ్యాయన్నారు. ఆర్‌ఎస్ ఘన్‌పూర్ పంపిణీ వ్యవస్థ సిద్ధంగా ఉన్నప్పటికీ తపాసుపల్లి, అశ్వరావుపల్లి, చిట్టకోడూరు పంపిణీ వ్యవస్థల పనులు భూసేకరణ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా ఆలస్యమవుతున్నాయని ఆయన తెలిపారు. ఫేజ్-3ను అత్యంత కీలకమైన, సవాళ్లతో కూడిన భాగంగా మంత్రి అభివర్ణించారు. ప్యాకేజీ-6ను నిర్వహిస్తున్న పాత కాంట్రాక్టర్ పనులను సమయానికి పూర్తి చేయకపోవడంతో ఒప్పందాన్ని రద్దు చేసి కొత్త సంస్థకు అప్పగించినట్లు అధికారులు మంత్డ్రికి వివరించారు. ప్రస్తుతం 3.33 లక్షల ఎకరాలకు సాగునీటి సామర్థ్యం సృష్టించినట్లు, మరో 2.23 లక్షల ఎకరాలకు ఇంకా సాగునీటి సదుపాయం కల్పించాల్సి ఉందని అన్నారు. ముఖ్యంగా సూర్యాపేట, ములుగు, వరంగల్ రూరల్, సిద్ధిపేట జిల్లాల్లో ఆయకట్టు సృష్టి తక్కువగా ఉందన్నారు. భూసేకరణ ఈ ప్రాజెక్టులో ప్రధాన అడ్డంకిగా మారిందని అధికారులు వివరించారు. మొత్తం 34,622 ఎకరాల అవసరంలో 31,963 ఎకరాలు సేకరించగా ఇంకా 2,659 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉందన్నారు. భూసేకరణ కేసులను వెంటనే టోకెన్ దశకు తీసుకెళ్లి పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ప్రతిపాదిత ఆయకట్టులోని సుమారు 39,651 ఎకరాల ప్రాంతం కొన్ని ప్రాంతాల్లో వేగంగా పట్టణీకరణకు లోనవుతున్నందున సర్వే ఆధారంగా వాటిని ప్రాజెక్టు కమాండ్ ఏరియా నుంచి తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీనివల్ల అవసరం లేని సాగునీటి డిమాండ్ తగ్గి అనవసర భూసేకరణ ఖర్చులు నివారించవచ్చన్నారు. నిలిచిపోయిన ప్యాకేజీలను గుర్తించి అవసరమైతే వెంటనే కాంట్రాక్టులను రద్దు చేసి రీటెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించారు. పనులు చేయని కాంట్రాక్టర్ల ఒప్పందాలను వెంటనే రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని, పరిపాలనా అనుమతుల జాప్యాల వల్ల విలువైన సాగునీటి సామర్థ్యం నిలిచిపోవద్దని అన్నారు. లోక్£సభ సభ్యుడు బలరాం నాయక్‌తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కె.ఆర్.నాగరాజు, మురళీ నాయక్, దొంతు మాధవరెడ్డి, జి.సత్యనారాయణ, రామచంద్ర నాయక్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీధర్, సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, సలహాదారు ఆదిత్యాదాస్ నాథ్ ఇ.ఎన్.సి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *