నేడు దివంగత ప్రధాని శాస్త్రి జయంతి
వేసవి ఎండ తీవ్రతకు సలసలమని మండుతున్న వీధులలో కాళ్లకు చెప్పులు లేకుండా పాఠశాలకు మైళ్లకు మైళ్లు నడిచిన ఓ బాలుడు, పదహారేళ్ళ వయస్సులోనే గాంధీ పిలుపునకు స్పందించి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న ధైర్యశాలి, శాస్త్రిగా పిలిచే స్నాతకోత్సవ పట్టానే తన పేరులోనే భాగంగా చేసుకున్న విద్యావేత్త, వివాహంలో కానుకగా కొన్ని గజాల చేనేత వస్త్రం, ఒక రాట్నాన్ని తీసుకున్న వరుడు, స్వతంత్ర పోరాటంలో ఏడేళ్లు జైలులో గడిపిన ఒక వ్యక్తి శక్తిగా మారి దేశ ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించాడు ఒక ధీరుడు. ఆయనే లాల్ బహుదూర్ శాస్త్రి. 2 అక్టోబర్ 1904లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసికి ఏడు మైళ్ల దూరంలోని మొఘల్ సరాయ్ అనే చిన్నపట్టణంలో శారద ప్రసాద్ శ్రీవాస్తవ, రామదులారి దేవి దంపతులకు జన్మించారు.
ఏడాదిన్నర వయసు ఉన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నారు. పదవ తరగతి చదువుతున్నప్పుడే బెనారస్‌లో గాంధీ, పండిట్ మదన్మోహన్ మాలవీయ నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు వైదొలిగి సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరాలని మహాత్ముని పిలుపుతో ప్రేరణ పొందిన శాస్త్రి తను చదువుతున్న పాఠశాల నుంచి బయటకు వొచ్చి పికెటింగ్, బ్రిటిష్ వ్యతిరేక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, కాంగ్రెస్ పార్టీ స్థానిక శాఖలో వలంటీర్‌గా చేరారు. గాంధీచే ప్రభావితమై 1920లో భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చేరారు. లాలా లజపత్ రాయ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు.1928లో మహాత్మాగాంధీ పిలుపు మేరకు భారత జాతీయ కాంగ్రెస్‌లో చురుకైన పరిణతి చెందిన సభ్యుడయ్యారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం ఏడేళ్లపాటు జైళ్లలో గడిపారు. ఈ పోరాటమే ఆయన వ్యక్తిత్వాన్ని రాటుదేల్చి పరిపక్వతను ఇచ్చింది.
రాజకీయ జీవితం:
1937, 1946 సం.లలో యునైటెడ్ ప్రావిన్స్‌కు ప్రతినిధిగా ఎన్నికయ్యారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చింది. అప్పటికే శాస్త్రి అపార శక్తి సామర్థ్యాలను జాతీయ నేతలు గుర్తించారు. దేశ నిర్మాణంలో పంచుకోవలసిందిగా పిలుపు వొచ్చింది. దానిని అందిపుచ్చుకొని స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలంలోనే స్వయం కృషితో రాష్ట్ర హోం, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. రవాణా వ్యవస్థలో మొట్ట మొదటి సారిగా మహిళా కండక్టర్లు ఈయన హయాంలోనే నియమించబడ్డారు. అల్లరి మూకలను చెదరగొట్టడానికి లాటీలకు బదులు వాటర్ జెట్‌లను వినియోగించాలని పోలీసులకు ఆయన సూచించారు.
ఆ సమయంలో ఎక్కువగా చెలరేగిన మత కలహాలను, సామూహిక వలసలను అత్యంత సమర్ధవంతంగా అరికట్టి నిరాశ్రయులకు ఆశ్రయాన్ని కల్పించి అందరిచే శభాష్ అనిపించుకున్నారు. కఠోరశ్రమకు, సామర్థ్యానికి ఉత్తరప్రదేశ్ లో శాస్త్రి ఒక సమున్నత సంకేతంగా నిలిచారు. శాస్త్రి ప్రతిభను గుర్తించిన ప్రభుత్వపెద్దలు దిల్లీకి రమ్మని ఆహ్వానించారు. 1951లో శాస్త్రి రైల్వే, రవాణా, సమాచార, వాణిజ్య, హోం లాంటి పలు శాఖలకు కేంద్రమంత్రిగా పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు ఒక రైలు ప్రమాదం జరిగింది. ఎంతో మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. జరిగిన ప్రమాదానికి శాస్త్రికి సంబంధం లేకపోయినప్పటికీ, ఇతర నేతలకు ఇది ఆదర్శం కావాలని ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారు.
ప్రధానమంత్రిగా తనదైన ముద్ర:
అప్పటి ప్రధాని నెహ్రూ మరణాంతరం 9 జూన్ 1964 నాడు మనదేశ రెండవ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెహ్రూ సోషలిస్టు ఆర్థిక విధానాలను కేంద్ర ప్రణాళికతో శాస్త్రి కొనసాగి ంచారు. ఆహార కొరత, నిరుద్యోగం, పేదరికం వంటి అనేక ప్రాథమిక సమస్యలను శాస్త్రి పరిష్కరించారు. దేశంలో భారతదేశ ఆహారోత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ 1965లో హరిత విప్లవాన్ని ప్రోత్సహించారు. ఇది పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆహారధాన్యాల ఉత్పత్తికి, పెరుగుదలకు దారితీసింది. ఈయన హయాంలోనే వ్యవసాయ ధరల సంఘం ఏర్పాటు చేయబడిరది. భారత ఆహార సంస్థ (ఎఫ్ సిఐ) ఉనికిలోకి వొచ్చింది.జాతీయ విత్తనాల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ వచ్చింది.
ఆల్మట్టి డ్యామ్‌కు కూడా ఆయనే శంకుస్థాపన చేశారు. పాల ఉత్పత్తిని పెంచే దిశగా శ్వేత విప్లవాన్ని ప్రోత్సహించి జాతీయ పాడిపరిశ్రామాభి వృద్ది సంస్థను అముల్ సహకార సొసైటీ ఏర్పాటుకు ఎనలేని కృషి చేసారు.డాక్టర్ హోమీ జహంగీర్ బాబా అణు పేలుడు పదార్థాలను అభివృద్ధి చేయాలని సూచించారు. దీనిని శాస్త్రి ఆమోదించారు. దేశంలో ప్లూటోనియం రీప్రాసెసింగ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. చైనా దేశంతో తలెత్తిన రక్షణ సమస్యలను శాంతియుతంగా సమయస్పూర్తితో పరిష్కరించారు. ప్రధానిగా ఉన్న కొద్ది కాలంలోనే భారతదేశాన్ని అనేక క్లిష్ట పరిస్థితుల నుండి గట్టెక్కించగలిగారు. శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది. యుద్ద సమయంలో చిన్నాభిన్నమైన దేశ ఆర్ధిక, రక్షణ వ్యవస్థలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ‘‘ జై జవాన్ – జై కిసాన్’’ అనే పిలుపునిచ్చారు. ఈ నినాదం బాగా ప్రాచుర్యం పొంది ఇప్పటికీ ప్రతిధ్వనిస్తుంది. ఈ యుద్ధం అధికారికంగా 10 జనవరి 1966న తాష్కెంట్ ఒప్పందంతో ముగిసింది.
మరణం:
ఈ ఒప్పందం జరిగిన మరుసటి రోజు జనవరి 12 న తాష్కెంట్ లో శాస్త్రి మరణించారు. ఆయన చనిపోవ డానికి కారణం ఇప్పటికీ అనుమా నాస్పదమే… ! తాష్కెంట్ లో ఆయనపై విష ప్రయోగం జరిగిందనే బలమైన వాదన కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ భారతదేశం ఒక ఆదర్శ మూర్తిని, మహా నేతను, గొప్ప దేశ భక్తుడిని శాశ్వతంగా కోల్పోయింది.
యువతకు స్ఫూర్తిదాయకం:
భారత ప్రభుత్వం 1966లో లాల్ బహదూర్ శాస్త్రికి మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కాం మైన ‘’భారతరత్న’’తో సత్కరించింది. మరణానంతరం ‘‘భారతరత్న’’ పురస్కారం పొందిన మొదటి వ్యక్తి. ఆయన గౌరవార్థం దిల్లీలో ‘విజయ్ ఘాట్’ పేరుతో స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాజీవితానికి లాల్ బహదూర్ శాస్త్రి చేసిన కృషి అపూర్వం. మూడు దశాబ్దాలకుపైగా దేశానికి సేవలందించారు. ఈ వ్యవ ధిలో నీతికి, నిజాయితీకి, సామర్థ్యానికి ప్రతీకగా నిలి చారు. వినయం, సహనం, దృఢచిత్తం, అద్భుతమైన అంతఃశక్తితో కూడిన ఆయన ప్రజల మనసును అర్థం చేసుకున్న నాయకుడిగా ఎదిగారు. అంతేకాదు గొప్ప దూరదృష్టితో దేశాన్ని ప్రగతి బాటన ముందుకు తీసుకెళ్లారు. దేశ ప్రధానమంత్రిగా చేశాక కూడా మరణించే సమయానికి ఒక ఇల్లు కూడా లేని శాస్త్రి నిరంతర సేవామయ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం.
` కింజరాపు అమరావతి
9494588909