స్టేషన్‌ఘ‌న్‌పూర్‌ను అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నా…

స్టేషన్‌ఘ‌న్‌పూర్ , ప్రజాతంత్ర, నవంబర్ 24 :  స్టేషన్‌ఘ‌న్‌పూర్ అభివృద్ధికి శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నాన‌ని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపడమే త‌న లక్ష్యమ‌ని ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రీ అన్నారు. ప్రతిపక్ష నాయకులు దివాలకోరు రాజకీయాలు చేస్తున్నారని, బిఆర్ ఎస్ నాయకులు అధికారాన్ని పోగొట్టుకొని అక్కసుతో మాట్లాడుతున్నారని ఆరోపించారు.ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చింద‌ని, ప్రతిపక్షాలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. స్టేషన్ నియోజకవర్గ కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో ఎన్‌పిడిసీఎల్, ఎస్‌డిఎఫ్‌, ఎంఎన్ ఆర్ ఈజీఎస్‌, కుడా, జీడ‌బ్ల్యూఎంసీ ద్వారా సుమారు రూ.18కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సమబందించిన ప్రొసీడింగ్ కాపీలను ఆయా గ్రామాల స్థానిక నాయకులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందజేశారు.అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ…..

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎస్‌డీఎఫ్‌, ఈజీఎస్ ద్వారా సిసి రోడ్లు, కమ్యూనిటీ హాల్స్‌, పాఠశాల భవనాలు, గ్రామ పంచాయ‌తీ భవనాలు, అలాగే లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండడానికి విద్యుత్ శాఖ ద్వారా సబ్ స్టేషన్ల నిర్మాణానికి సుమారు రూ.18కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబందించిన ప్రొసీడింగ్ కాపీలను ఆయా గ్రామాల స్థానిక నాయకులకు అందజేసినట్లు తెలిపారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో లో ఓల్టేజ్ సమస్యను పరిష్కరించడాని రూ.6కోట్లతో 132/33కెవి సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టనట్లు తెలిపారు. దీంతో నియోజకవర్గంలో చాలా వరకు లో ఓల్టేజ్ సమస్య తగ్గిందన్నారు. నియోజకవర్గంలో లో ఓల్టేజ్ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి నాలుగు 33/11కెవి సబ్ స్టేషన్ల నిర్మాణానికి మంజూరు చేయించామ‌ని తెలిపారు. చిల్పూర్ మండలం కొండాపూర్, జఫర్ గడ్ మండలం సాగరం, రఘునాథపల్లి మండలం పుచ్చపల్లి గ్రామాలలో 33/11కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే స్టేషన్ ఘనపూర్ కు డీఈ ఆఫీస్ మంజూరు అయిందని కానీ భవనం లేదని కావున 132/33కెవి సబ్ స్టేషన్ ఆవరణలో కోటి రూపాయలతో డీఈ కార్యాలయ భావన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. వీటికి సంబందించి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ధర్మసాగర్ మండలం రాయగూడెంలో 33/11కెవి సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి అయిందని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండకుండా జనగామ జిల్లాలో 222/132కెవి సబ్ స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఎస్‌డిఎఫ్ నిధుల‌తో

  • రఘునాథపల్లి మండల కేంద్రంలో మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10లక్షలు.
  • రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లిలో మహిళా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 5లక్షలు.
  • రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్ లో ఎస్సి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10లక్షలు.
  • రఘునాథపల్లి మండలం కోడూరులో కుర్మ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 3.75లక్షలు.
  • లింగాలఘనపూర్ మండలం చీటూరులో ఎస్సి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10లక్షలు.
  • రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ లో ఎస్సి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10లక్షలు.
  • జఫర్ గడ్ మండలం కొనాయిచలంలో ఎస్సి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10లక్షలు.
  • జఫర్ గడ్ మండలం రఘునాథపల్లిలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10లక్షలు,
  • ముదిరాజ్ కమ్యూనిటీ హల్ నిర్మాణానికి 5లక్షలు.
  • చిల్పూర్ మండలం మల్కాపూర్ లో ఎస్సి కమ్యూనిటీ హల్ నిర్మాణానికి 16లక్షలు.
  • జఫర్ గడ్ మండల కేంద్రంలో సముద్రాల రమేష్ ఇంటి నుండి కుమారస్వామి ఇంటి వరకు సిసి రోడ్ నిర్మాణానికి 3.70లక్షలు, ఆర్ అండ్ బీ రోడ్డు నుండి సముద్రాల నర్సయ్య ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణానికి 5లక్షలు మంజూరు అయ్యాయ‌ని తెలిపారు.

కుడా ద్వారా పెద్ద పెండ్యాల గ్రామంలో కోటి 76లక్షలతో రోడ్ వైడెనింగ్, సిసి రోడ్డు చేపట్టనున్నట్లు తెలిపారు. జీడబ్ల్యూఎంసీ నుంచి ఉనికిచర్ల – రాంపూర్ లలో రూ.80లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈజీఎస్ నిధుల ద్వారా గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మొత్తం సుమారు రూ.18కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈ రోజు ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. హరీష్ రావు, కేటీఆర్ లు అధికారం కోల్పోయి అక్కసుతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు జరగడం లేదు, బోనస్ అందడం లేదు అని దుష్ప్రచారం చేస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. హరీష్ రావు, కేటీఆర్ లు జనగామకు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ రైతు సంక్షేమానికి కృషి చేస్తుంటే బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు దివాలకోరు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. వయనాడ్ లో 4లక్షల పైచిలుకు మెజారిటీతో భారీ విజయం సాధించిన ప్రియాంక గాంధీకి ఎమ్మెల్యే కడియం శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంక గాంధీ గెలుపుతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వొచ్చిందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page