- పొన్నెకల్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనలో మంత్రి పొంగులేటి
ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్11: పేద ప్రజల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 10 వేల 6 పోస్టులు డీఎస్సీ ద్వారా ఇచ్చామని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలతో పాటు ఉద్యోగ ఉన్నతి ఇందిరమ్మ ప్రభుత్వం కల్పించిందని, గత ప్రభుత్వం అనేక స్కూల్స్ పెట్టిందే తప్ప పక్కా వసతి కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేసుకుంటున్నామని, పేదల పట్ల ప్రభుత్వం చిత్తశుద్దతో పనిచేస్తోందని, విద్య వైద్యానికి ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం, పొన్నెకల్‌లో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అమ్మ ఆదర్శ పథకంతో రూ. 657 కోట్లతో ప్రభుత్వం వొచ్చిన మూడునెల్లోనే చేపట్టి సౌకర్యాలు కల్పించిందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇందిరమ్మ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శ్రీకారం చుట్టిందన్నారు.
రాష్ట్రంలో అన్ని నియోజక వర్గాల్లో 125 నుంచి 150 కోట్లతో అద్భుతమైన స్కూల్ ఈ ప్రభుత్వం నిర్మాణం చేయబోతోందని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల నెత్తిన భారం మోపిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చాక రూ. 300 కోట్లతో అనేక కంపెనీలతో స్కిల్ డెవలప్ మెంట్ నైపుణ్యం పెంపొందించే అవకాశం కలిపించిందన్నారు. మాటలతో కాదు ఇందిరమ్మ ప్రభుత్వం చేతలతో చేసి చూపిస్తుందని.. ప్రవేటుకు దీటుగా పేద విద్యలకు కార్పొరేట్ విద్యానందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను అందించాలన్న లక్ష్యంతో సకృత గురుకులాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలిదశలో 28 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను తీసుకురావాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న గురుకులాలను కొనసాగిస్తూనే.. అత్యాధునిక వసతులతో సకృత భవనాలను నిర్మించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు గురువారం ఆయా నియోజకవర్గాలతో కూడిన జాబితాను విడుదల చేయడంతోపాటు సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్‌నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, ఆంధోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, జడ్చర్ల, పరకాల, నారాయణఖేడ్, దేవరకద్ర, నాగర్‌కర్నూలు, మానకొండూరు, నర్సంపేటలో సకృత భవనాలను నిర్మించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.