సెప్టెంబర్‌ 17‌కు కాంగ్రెస్‌ ‌కొత్త నామకరణం

  • మొదటిసారిగా అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం
  • ఈసారి అన్ని పార్టీలు పోటీ పడి నిర్వహించే అవకాశం
  • రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా సెంటిమెంట్‌ ‌రాజేసి లబ్దికి యత్నించే అవకాశం

మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, ‌సెప్టెంబరర్‌ 12 : ‌తెలంగాణ చరిత్రలో అతి ప్రధాన ఘట్టమైన సెప్టెంబర్‌ 17‌కు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కొత్త నామకరణం చేసింది. ఆరోజును ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా’ పిలువాలంటూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత 13 నెలల ఆలస్యంగా ఈ ప్రాంతం స్వేచ్ఛావాయువులను పీల్చుకున్న విషయం తెలిసిందే. నాటి నుండి ఈ ఏడున్నర దశాబ్దాల కాలంగా ఆ రోజును ఏ పేరుతో పిలవాలన్న విషయంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. కాని, ఆ సెంటిమెంట్‌ను తమ రాజకీయ లబ్ధికి వాడుకునే విషయంలో ఏ పార్టీ కూడా అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఆ రోజును బిజెపి ‘విమోచదినం’ అని, కమ్యూనిస్టులు ‘విద్రోహదినం’ అని, కాంగ్రెస్‌ ‘‌విలీనదినం’ మంటూ ఎవరికి తోచిన విధంగా వారు పిలుస్తూ వొస్తున్నప్పటికీ దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం కూడా అధికారిక ఉత్సవాలను నిర్వహించింది లేదు. స్వాతంత్య్రానంతరం ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ‌తెలుగుదేశం పార్టీలు ఏనాడు కూడా ఆ రోజున అధికారిక ఉత్సవాలను జరిపింది లేదు.

 

తెలంగాణ అభిమానులు, కొంతకాలం తెలంగాణ ప్రజాసమితి(టిపిఎస్‌) ‌నాయకులు మాత్రం నాటి తెలంగాణ పది జిల్లాల పతాకాన్ని ఎగురవేయడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ముందు తెలంగాణ రాష్ట్ర సమితి నేటి బిఆర్‌ఎస్‌ ‌సెప్టెంబర్‌ 17‌ను అధికారిక జరుపాలంటూ ఆనాడు అధికారంలోఉన్న పార్టీలను నిలదీస్తూ వొచ్చింది. కాని అధికారంలోకి వొచ్చిన తర్వాత చాలా కాలం వరకు బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించకపోవడం పట్ల విపక్షాలు తీవ్రంగానే విమర్శిస్తూ వొచ్చాయి. ఈ నేపథ్యంలో గత సంవత్సరం(2023) అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిఆర్‌ఎస్‌  ‌ప్రభుత్వం ‘సమైక్యతా దినోత్సవంపేర’ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. అప్పటివరకు సెప్టెంబర్‌ 17‌ను విలీనదినంగానే పరిగణిస్తూ వొచ్చిన బిఆర్‌ఎస్‌ ‌సమైక్యతా దినోత్సవంగా కొత్త నామకరణ చేసి కార్యక్రమాలను నిర్వహించింది. దొడ్డి కొమురయ్య, చాకలి అయిలమ్మ, కుమురం భీమ్‌, ‌రావి నారాయణరెడ్డి లాంటి వారికి వినమ్రంగా నివాళులర్పించింది బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం. వారి స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ఆనాటి సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పుకున్నారు.

 

ఆనాడు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం కూడా సమైక్యతా దినోత్సవానికే వంతపాడడాన్ని తీవ్రంగా విమర్శించిన విపక్షాలు కూడా ఆనాడు పోటీ పడి కార్యక్రమాలను నిర్వహించాయి. అది ఎన్నికల సంవత్సరం కావడంతో అన్ని పార్టీలు విస్తృత కార్యక్రమాలను చేపట్టాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కేంద్ర ప్రభుత్వ పరంగా ఇక్కడ కార్యక్రమాలను చేపట్టింది. కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌ ‌షా ముఖ్యఅతిధిగా పాల్గొన్న కార్యక్రమంలో నాటి పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు,, పివి నరసింహారావు లాంటి పలువురిని గుర్తుచేసుకుని నివాళులర్చించారు. ఆపరేషన్‌ ‌పోలో పేరుతో ఈ ప్రాంత విముక్తికి కారణమైన ఆనాటి ఇండియన్‌ ‌యూనియన్‌ ‌హోమ్‌ ‌శాఖ మంత్రి సర్దార్‌ ‌వల్లభాయ్‌పటేల్‌, ‌మున్షీలను వారు ఆనాడు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. అనుకోని రీతిలో సెస్టెంబర్‌ 17‌న ప్రధాని మోదీ పుట్టిన రోజు కావడం కూడా ఆ పార్టీకి కలిసివచ్చింది.

 

అదే క్రమంలో ఇంతవరకు విలీనదినమంటూ గొంతెత్తిన కాంగ్రెస్‌ ఇప్పుడు ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’మంటూ మరో కొత్త నామకరణం చేయడం కూడా విమర్శకు కారణమైంది. విమోచన దినానికి ప్రజాపాలన దినోత్సవానికి ఏమైనా పోలిక ఉందా అని బిజెపి శ్రేణులు విమర్శిస్తున్నాయి.. ప్రజాపాలన అంటే ఎవరి ప్రజాపాలన, నిజామ్‌ ‌ప్రజాపాలననా, లేక పాలనా అంటూ ప్రశ్నిస్తున్నాయి. పైరేమైనా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మొదటిసారిగా అధికారికంగా సెప్టెంబర్‌  17‌ను జరిపేందుకు సిద్ధమైంది. ఆ రోజున రాష్ట్ర రాజధానిలో సిఎం రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేయనుండగా జిల్లాల్లో  మంత్రులు, కార్పొరేషన్‌ ‌చైర్మన్‌లకు ఆ అధికారాన్ని ఇస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. బిజెపి కూడా గతంలో లాగానే పర్యడ్‌ ‌గ్రౌండ్‌లో నిర్వహించే  కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా రానున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కాగా  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో లిబరేషన్‌ ఆఫ్‌ ‌తెలంగాణ సంస్థాన్‌ ‌పేర త్రిడి వీడియోను ప్రదర్శనకు సిద్ధం చేశారు. అందులో శాతవాహన కాలం నుండి ఆపరేషన్‌ ‌పోలో వరకు భారత స్వాతంత్య్ర పోరాటంలో జరిగిన పరిణామాల వీడియోను ప్రదర్శనకు సిద్ధం చేశారు. మొత్తం మీద రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *