సెల్ఫ్ హెల్ప్ గ్రూపు పథకం కింద యూనిట్లను ప్రారంభించిన మంత్రి సీతక్క
ములుగు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు మహిళలు 17 రకాల వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తున్నదని మంత్రి సీతక్క అన్నారు. గురువారం ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలోని ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఎస్‌హెచ్‌జీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్, కోమలి డిజిటల్ స్టూడియో, బుక్ స్టాల్, జిరాక్స్, ఇంటర్నెట్ సెట్ సెంటర్, సునిత ఎంబ్రాయిడరీ వర్కస్, శ్రీ వెంకటేశ్వర కిరాణం జనరల్ స్టోర్‌లను ప్రారంభించారు.
అలాగే పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో 20 ఎకరాల స్థలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి మహిళలు ఒక అప్పగిస్తామన్నారు. వడ్డీ లేని రుణాలను తీసుకుంటున్న మహిళలు సకాలంలో అప్పు చెల్లించాలని, తిరిగి పెద్ద మొత్తంలో అప్పు కోరిన మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ములుగు జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి అన్ని పార్టీల నాయకులు ముందుకు రావాలన్నారు.