వైద్య నిపుణల సమక్షంలో శవపరీక్షలకు పౌర హక్కుల సంఘం డిమాండ్
ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : ములుగు జిల్లా ఏటూరునాగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు ఖండించారు. ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని అన్నంలో విష ప్రయోగం జరిగినట్లు స్థానిక ప్రజలు వ్యక్తపరుస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో శవ పరీక్షలు నిర్వహించాలని, ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలంలో మళ్లీ ఎన్‌కౌంటర్ తెలంగాణగా మార్చేసిందని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర హోం మంత్రి పదవిని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పోలీసు క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరడం ఆపరేషన్ కగార్ ను తెలంగాణలో అమలుపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతోందని తెలిపారు. అడవిలో పోలీసు శోధన పేరుతో నిత్యం నిర్బంధాలను అమల్పరుస్తూ ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి చంపడానికి పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఎటూరునాగారం ఎన్‌కౌంటర్ లోపాల్గొన్న పోలీసులపై హత్యానేరం నమోదు చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.