రైతు సంక్షేమంపై కువిమర్శలా..!
భారత దేశంలో ప్రతి అర్థగంటకు ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశంలో రైతుల పట్ల దయలేదు, ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. గిట్టుబాటు ధర లేక ప్రతిరోజు వందల మంది రైతులు వ్యవసాయం అంటే విరక్తితో బతికుంటే బలుసాకు తిని బతుకోచ్చని బ్రతుకు దెరువు కోసం వివిధ మార్గాలు వెతుకుంటున్నారు. ఓట్ల సమయంలో రైతును రాజు చేస్తామని, జై జవాన్, జై కిసాన్ అంటూ రైతును ఎదో చేస్తామని ,రైతు దేశానికి వెన్నెముక అని ఊకదంపుడు ఉపన్యాసాలతో జనాన్ని అయోమయానికి గురిచేసి నాలుగు ఓట్లు దండుకొని గద్దేనేక్కిన తర్వాత అసలు రంగు భయట పడుతున్నది. గిది నిన్న మొన్నటి కాంచి కాదు 76సంవత్సరాల నుండి చూస్తున్నామనే చరిత్ర చెప్పుతున్నది. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి కానీ రైతు బతుకు ఎక్కడి వేసిన గొంగళి అక్కడనే ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎద్దేడ్సిన ఎవుసం బాగుపడదు, రైతెడ్సిన రాజ్యం నిలబడదని నాడు దండుగన్న వ్యవసాయాన్ని కెసిఆర్ పండుగ చేసే ప్రయత్నం చేసారు. అందులో బాగంగానే పెట్టుబడి సాయం అందించడం దేశ చరిత్రలోనే సాహసోపేత నిర్ణయం. అదేగాకుండా ఒకగుంట భూమి ఉన్న రైతు అకాలమరణం చెందినా 10రోజుల్లో 5లక్షల ‘రైతు భీమా’ వచ్చే విదంగా నాటి ప్రభుత్వం చెల్లించింది. ఆ రైతు భీమాతో బాదిత కుటుంబం బాదరబంది లేకుండా జీవనం సాగిస్తున్నాయి.
చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రైతులకు చేయూతనిచ్చే మహత్తర కార్యక్రమానికి శ్రికారం చుట్టి వరంగల్ కేంద్రంగా రైతు డిక్లరేషన్ ప్రకటించింది. రేవంత్ సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన డే వన్ నుండి రైతును రాజు చేయడం లక్ష్యంగా 54,280 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వంగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నది, రేవంత్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టు గానే నిరంతరం రైతు శ్రేయస్సు కోసం తపన పడుతూనే ఉన్నారు. అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలో వ్యవసాయ, ఇతర అనుబంధ రంగానికి బడ్జెట్ లో 72వేల కోట్లు సింహ బాగం కేటాయించింది. నాడు కేసిఆర్ ప్రభుత్వం ఫసల్ భీమాకు మంగళం పాడితే దూరదృష్టితో పంటల భీమా పునరుద్దరించింది. సన్నాలు ధాన్యం కొనుగోలులో క్వింటాకు 500 బోనస్ చేల్లిస్తున్నందుకు రైతాంగం మురసిపోతుంది. 2లక్షల రుణమాఫీ 25,35,964 మంది రైతులకు 20,747వేల కోట్లు ఏకకాలంలో రుణమాఫి చేసి చరిత్ర సృష్టించింది. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 10వేల రూపాయలు ఖాతాలో జమచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీరు అందకపోయినా ఖరిఫ్ లో 66 లక్షల ఎకరాల్లో వరి వేసి, కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది. నాడు కాంగ్రేస్ కట్టిన జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీపాద తదితర ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉన్నందునే సాధ్యమైందనే బావం నెలకొంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ పునర్నిర్మాణంలో రైతే అజెండాగా విధానాలు, కార్యక్రమాలు రుపొందిస్తున్నది. ఇప్పటికే రైతు సంక్షేమాన్ని సాధిస్తున్న రాజ్యంగా ఆదర్శంగా నిలుస్తున్నది. ఆరు గ్యారెంటిల్లో ప్రకటించినట్లుగానే ‘రైతు భరోసా’ అందించితే రైతు పండుగ అనేది సంపూర్ణంగా ఆచరణలో కనిపించేది.
రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడానికి వ్యవసాయం, వ్యవసాయ పరమైన మౌలిక వసతుల కల్పనల కోసం అదనపు బడ్జెట్ కేటాయింపులు చాల అవసరం. కనీస మద్దతు ధర పెంపు, అది కనీస ఉత్పదనా వ్యయానికి ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేలా మోడీ ప్రభుత్వం తగినంత కేటాయింపులు చేయకుండానే రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఊకదంపుడు మాటలకే కేంద్రం పరిమితమైంది. దేశీయంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు సరైన ఆదాయాలు లభించేలా చూడటం ప్రభుత్వాల భాద్యత. పాలకుల అనాలోచిత నిర్ణయాలు, తాత్కాలిక విధానాల వల్ల సాగుదారులకు ప్రణాళికకు ఆటంకం కల్గి, నష్టాలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనలేమని మొరాయించారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని, నాటి కేసిఆర్ ప్రభుత్వమే వరి వేస్తె ఉరి అని, రాష్ట్ర బీజేపి మీరు వేయండని అయోమయానికి గురి చేసినారు. రైతులు ఏమి చేయాలో తోయక మెట్ట పంటలు వేసుకున్నారు.
విపత్తులతో నష్టపోయిన పంటకు ‘ఫసల్ భీమా’ యోజన పథకంపై బిజేపి, బిఆర్ఎస్ పంచాయతితో పరిహారం అందక రైతులకు చిర్రెత్తింది. తెలంగాణ ప్రజలకు కాపలా కుక్కాలా ఉంటానన్నకెసిఅర్ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేసరికి, ప్రత్యామ్నాయంగా కాంగ్రేస్ ఇచ్చిన ఆరు హామీలను నమ్మి చరిత్రను తిరగ రాసారు, మార్పు కోసం పట్టం కట్టినారు. రుణమాఫి చేసినాం అంటూ సిఎం చెప్పడం, నిన్నగాక మొన్న అర్హత గల రైతులు 40లక్షల మంది ఉన్నారని,అందులో 22 లక్షల మందికి మాఫీ చేసినట్టు సంబందిత మంత్రి చెప్పడంఏది నిజం? ఏది అబద్దం? అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటి వరకు పంట సాయం ‘రైతు భరోసా’ ఇవ్వలేని రేవంత్ ప్రభుత్వం క్వింటాల్ 500 బోనస్ చెల్లించడానికి 35వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తుందని, రైతులను మభ్య పెట్టుతున్నారని ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది. డిప్యూటి సిఎం భట్టి మాత్రం రైతు పండుగ ఓర్వలేక మా ప్రభుత్వంపై నిందారోపణలు చేస్తున్నారని, రైతు సంక్షేమం పై ప్రతిపక్షాలకు ఏడ్పు తప్ప వేరే మార్గం లేదని దుయ్యబట్టారు. అయితే కేసిఆర్ ప్రకటించిన లక్ష రైతు రుణమాఫి నాలుగు ఏండ్లుగా, నాల్గు దఫాలుగా చేయడం వల్ల వడ్డికే సరిపోయిందనే విమర్శ ఉంది.
డాక్టర్ సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్-9866255355