కాజీపేట‌ కోచ్‌ ‌ఫ్యాక్టరీపై క‌ద‌లిక‌

ఐదు దశాబ్దాల‌ పోరాట ఫలితం..
ఇప్పటికే రెండు సార్లు ఆశ‌ల‌పై నీళ్లు..
తాజా ఉత్తర్వులతో మళ్ళీ చిగురించిన ఆశలు

(మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): కాజీపేటలో కోచ్‌ ‌ఫ్యాక్టరీని అప్‌‌గ్రేడ్‌ ‌చేస్తూ  కేంద్ర రైల్వేశాఖ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో ఐదు దశాబ్ధాలుగా ఈ ఫ్యాక్టరీ కోసం వరంగల్‌ ‌ప్రజల నిరీక్షణకు తెరపడినట్లయింది. సుమారు నాలుగున్నర దశాబ్దాల కాలంగా కాజీపేటలో వ్యాగన్‌ ‌తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పాలంటూ ఓరుగల్లు ప్రజలు ఆనేక రీతుల్లో ఆందోళనలు చేశారు. ఈ ఫ్యాక్టరీ సాధన కోసం రాజకీయ పార్టీలు తమ విభేదాలను ప‌క్క‌న‌బెట్టి సంఘటితమై జాయింట్ యాక్షన్‌ ‌కమిటీగా ఏర్పడి ఉద్య‌మాలు చేశారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివొచ్చింది. కాజీపేటలో వ్యాగన్‌ ‌తయారీ ఫ్యాక్టరీ నెలకొల్ప‌నున్న‌ట్లు హామీ ఇచ్చింది. కానీ, హామీని రెండు సార్లు నిలబెట్టుకోలేకపోయింది. చారిత్రాత్మక ఓరుగల్లు రాజకీయంగా, విద్య, వైద్యరంగాల్లో తెలంగాణలోని ఇతర జిల్లాలకన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ ఉపాధి విషయంలో వెనుకబడిపోయింది. ఎప్పుడో నిజాంకాలంలో ఏర్పాటు చేసిన ఆజంజాహిమిల్లు తప్ప మరే ఇతర పరిశ్రమలు ప్రభుత్వపరంగా నెలకొల్పలేదు.

దాన్నికూడా నడవదన్న ముద్రవేసి మూసివేయడంతో బడుగు బలహీన వర్గాలవారికి ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. మిల్లు వొడిదొడుకుల్లో ఉన్నప్పటి నుంచి వరంగల్‌ ‌ప్రజలు కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ కోసం డిమాండ్‌ ‌చేస్తూ వొచ్చారు. 1978  నుంచి ఈ డిమాండ్ విస్తృతమైంది. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వొచ్చినా కోచ్‌ఫ్యాక్టరీ డిమాండ్‌ ‌ప్రధానాంశంగా ఉంటూ వొచ్చింది. ఈవిషయంలో వరంగల్‌ ‌నుంచి దిల్లీ వరకు ఆందోళనలు చెలరేగినా లాభం లేకుండా పోయింది. కాగా 1982 ప్రాంతంలో పివి నరసింహారావు చొరవతో ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది. అయితే ఆ సంబరం ఎంతోకాలం నిలువలేదు. 1984లో ఇందిరాగాంధీ హత్యతో పంజాబ్‌లో చెలరేగిన అల్లకల్లోలాన్ని శాంతింపజేసేందుకు అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సముచితంగా ఆనాటి కేంద్రప్రభుత్వం భావించింది. కాజీపేటలో ఏర్పాటు చేస్తామన్న కోచ్‌ఫ్యాక్టరీని ఆగమేఘాలమీద కబుర్థాలలో ఏర్పాటుచేసి వరంగల్‌ ప్రజలకు రిక్త హస్తం చూపించారు. దాంతో మళ్లీ కోచ్ ఫ్యాక్టరీ కోసం వరంగల్‌ ‌ప్రజలు నిర్విరామ ఉద్యమం ప్రారంభించారు.

కేంద్ర మంత్రివర్గంలో వరంగల్ నుంచి ప్రాతినిధ్యం  వహించిన కమాలుద్దీన్‌ ‌కోచ్ ఫ్యాక్టరీ రాకపోయినా రైల్వేకు కావల్సిన  నట్లు, బోల్టులు తయారుచేసే అనుబంధ చిన్నతరహా పరిశ్రమలకు మంచి అవకాశముందని ఇక్కడి ప్రజలను అనునయించే ప్రయత్నం చేశారు. దానికి వరంగల్‌ ‌ప్రజలు ఇష్టపడకపోవడం ఒకటికాగా, కమాలుద్దీన్ కూడా ఆ తర్వాత దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మళ్ళీ కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్‌ ‌ముందుకు వొచ్చింది. అయితే ఇప్పటికే దేశంలో నెలకొల్పిన రైల్వేకోచ్‌ ‌ఫ్యాక్టరీలు రైల్వేలకు కావల్సిన కోచ్‌లను ఉత్పత్తి చేసే సామర్ధ్యంతో ఉన్నాయని, కొత్తగా ఈ ఫ్యాక్టరీలను ఏర్పాటుచేసే అవసరంలేదని రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఒక పక్క పేర్కొంటూనే 2018లో మహారాష్ట్రలోని లాతూర్‌లో కోచ్‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు.

అంతేకాదు యుద్దప్రాతిపధికన రూ.625 కోట్లు కూడా మంజూరు చేయడం విశేషం. దాంతో తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అంతేగాక ప్రత్యేక నినాదంతో తెలంగాణలో    ఉద్యమం ఉదృతంగా సాగుతున్నవేళ 2004లో మన్‌మోహన్‌ ‌సింగ్‌ ‌ప్రధానిగా కాజీపేటకు మరోసారి కోచ్‌ ‌ఫ్యాక్టరీ మంజూరుకు నిర్ణయం తీసుకున్నారు. వరంగల్‌ ‌ప్రజల దురదృష్టమేమోగాని దాన్ని కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ ప్రాతినిద్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లోని రాయబరేలీలో నెలకొల్పి మరోసారి ఓరుగల్లు ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. అనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ‌విభజన 2014 ఒప్పందాల్లో అది ఒక ప్రత్యేక డిమాండ్‌గా నిలిచింది. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడిన దశాబ్దకాలం తర్వాత అంటే 1978 నుంచి దాదాపు నలభై ఆరేళ్ళ పోరాటం తర్వాత దానికిప్పుడు మోక్షం లభించింది. ఈసారికూడా ఇక్కడ హామీఇచ్చి మరో ప్రాంతంలో నెలకొల్పే అవకాశం, ఉండకపోవచ్చనే ప్రజలు భావిస్తున్నారు.

రైల్వేలో కీల‌కంగా  కాజీపేట జంక్ష‌న్
    దక్షిణ మధ్య‌ రైల్వేలో కాజీపేట జంక్షన్‌కు అత్యంత ప్రాధాన్యముంది. ఉత్తర దక్షిణ ప్రాంతాలను కూడలి అయిన ఈ జంక్షన్‌ను రైల్వే డివిజన్‌గా చేయాలన్నది ఒకటి కాగా, ఇక్కడ కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ‌చాలా కాలంగా ఉంది. అందుకు కావాల్సిన 150 ఎకరాల స్థలాన్ని బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం గతంలోనే ఏర్పాటు చేసింది కూడా. స్థానిక ప్రజల డిమాండ్‌ను తట్టుకోలేక మొదట్లో వ్యాగన్‌ ‌రిపేర్‌ ‌వర్క్‌షాపు ఏర్పాటు కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని పిరియాడికల్‌ ఓవరాలింగ్‌ ‌యూనిట్‌ అన్నారు.

ఇప్పుడు దీన్ని అప్‌‌గ్రేడ్‌ ‌చేస్తూ ఇంటిగ్రేటెడ్‌ ‌కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు సెప్టెంబర్‌ 9‌న రైల్వేశాఖ ఉత్తర్వులను జారీచేసింది. ఆందుకు 650 కోట్లను మంజూరు చేస్తున్నట్లుకూడా ప్రకటించింది. దీనివల్ల సుమారు నాలుగున్న దశాబ్దాల వరంగల్‌ ‌ప్రజలకల నెరవేరినట్ల‌యింది. ప్రత్యక్షంగా సుమారు ఆరవై వేల మందికి, పరోక్షంగా మరో 40 వేలమందికి ఉపాధి కల్పించే ఈ ఫ్యాక్టరీతో అనేక అనుబంధ పరిశ్రమలకు అవకాశం ఏర్పడనుంది. తెలంగాణ ఏర్పడిన దశాబ్దకాలానికి, స్వాతంత్య్రానంతరం ఏడు దశాబ్దాల తర్వాత వరంగల్‌కు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీ ఇది. ఇంతకాలానికి వరంగల్‌ ‌ప్రజలు చెప్పుకోవడానికి ఇదొక దిక్సూచిగా నిలువబోతున్నది. త్వరలో మామునూరు విమానశ్రయం, టెక్స్‌టైల్‌ ‌పార్క్ అభివృద్ది చెందుతాయని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page