సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఆసక్తి
వ్యర్థ జలాల పునర్వినియోగంపై శిక్షణ
కృతజ్ఞతలు తెలిపిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఇజ్రాయెల్ టెక్నాలజీని వినియోగించనున్నారు. మూసీ ప్రక్షాళనకు అధునాతన సాంకేతిక పరిజ్ణానాన్ని అందించేందుకు ఇజ్రాయెల్ సంసిద్ధత వ్యక్తం చేయడంపై ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయంలో ఆ దేశపు రాయబారి రువెన్ అజర్ కు ఆయన కృతజ్ణతలు తెలిపారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఇజ్రాయెల్ ఎంతో ఆసక్తి కనబర్చడం సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
కృత్రిమ మేథ, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణకు సహకరించాలని శ్రీధర్ బాబు కోరారు. డిఫెన్స్, వ్యవసాయం, నీటి వినియోగంలో ఆధునిక సాంకేతికత, నూతన పరిశోధనలు, పారిశ్రామిక అభివృద్ధిలో తోడ్పాటునందించాలని మంత్రి చేసిన అభ్యర్థనకు రువెన్ అజర్ సానుకూలంగా స్పందించారు. 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని శ్రీధర్ బాబు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, శిక్షణనిచ్చే వారికి అత్యాధునిక శిక్షణ (ట్రెయినింగ్ టు ట్రెయినర్స్) లో మద్ధతు ఇవ్వాలని ఆయన కోరారు. వ్యర్థ జలాల పునర్వినియోగ సాంకేతికలో తమకు సహకరించాలని శ్రీధర్ బాబు కోరారు.
రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసామని ఇజ్రాయెల్ దేశం ఏ పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చినా నైపుణ్యం కలిగిన మానవ వనరులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నూతన పరిజ్ణానం, పరిశ్రమల ఏర్పాటులో సాయపడితే ఇక్కడి నుంచే ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని సూచించారు. డిఫెన్స్, ఏరో స్పేస్ లో స్టార్టప్ సంస్థలకు టెక్నాలజీ సమకూర్చి ముందుకు నడపాలని శ్రీధర్ బాబు కోరారు. మౌలిక వసతుల నిర్మాణంలో రెండు దేశాలు సహకరించుకోవాలని ఇజ్రాయెల్ రాయభారి ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు తమ దేశాన్ని సందర్శించాలని రాయబారి రువెన్ ఆహ్వానం పలికారు. భేటీలో ఇండో ఇజ్రాయెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కెన్ ఉదయ కుమార్, డైరెక్టర్ డాక్టర్ రాధాకృష్ణ, సిఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఐటీ సలహాదారు సాయికృష్ణ పాల్గొన్నారు.
ఇజ్రాయల్ రాయబారికి సన్మానం..
భారత్ లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ మంత్రి శ్రీధర్ బాబు జ్ణాపికను బహూకరించి సన్మానించారు. కార్యక్రమంలో ఐటీ సలహాదారు సాయికృష్ణ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఇండో ఇజ్రాయెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కెన్ ఉదయ్ కుమార్, డైరెక్టర్ రాధాకృష్ణ పాల్గొన్నారు.
ద్వైపాక్షిక సంబంధాలపై తుర్కియె ఆసక్తి
తెలంగాణ(భారత్) తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ఆసక్తితో ఉన్నామని తుర్కియె దేశపు రాయబారి ఫిరట్ సునెల్ వెల్లడించారు. శుక్రవారం ఆయన ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సచివాలంయలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఇద్దరు అరగంట సేపు పరస్పర సహకారంపై చర్చించారు. తుర్కియె తెలంగాణాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నాయని శ్రీధర్ బాబు అన్నారు. వ్యవసాయం, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతారణం ఉందని ఆయన తెలిపారు. తుర్కియె పారిశ్రమిక ప్రతినిధుల బృందాన్ని పంపిస్తే వారు ఇక్కడి ఎకోసిస్టమ్ ను పరిశీలించే అవకాశం ఉంటుందన్న అభ్యర్థనకు రాయబారి ఫిరట్ సునెల్ సుముఖత వ్యక్తం చేశారు. ఈ భేటీలో తుర్కియె కాన్సుల్ జనరల్ ఓర్హాన్ యమన్ ఓకన్ పాల్గొన్నారు.