-
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు.. హైదరాబాద్ కోర్ ఏరియాలో అదనంగా లక్ష ఇళ్లు!
-
జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. గోదావరి పుష్కరాలకు రూ.1,000 కోట్లు కేటాయింపు.
-
రాష్ట్రంలో ‘గుడిసెలు లేని ఆదర్శ తెలంగాణ’ లక్ష్యంగా మంత్రివర్గం కీలక తీర్మానం.
హైదరాబాద్, ప్రజాతంత్ర : నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ రాష్ట్రంలో రెండో విడత కింద 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను (Indiramma Indlu) మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం చారిత్రాత్మక తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శనివారం రోజున అత్యంత కీలకమైన మంత్రిమండలి సమావేశం శనివారం ముగిసింది. ఈ కేబినెట్ భేటీ (Telangana Cabinet Decisions 2026) లో ప్రజా సంక్షేమం, విద్య, మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి పలు సంచలన నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. నిరుపేదల మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిలు మీడియా సమావేశంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాల వివరాలను వెల్లడించారు.
జూన్ 1న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని జూన్ 1వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నారు. వివిధ సర్వేల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేల కుటుంబాలు ఇంకా పూరి గుడిసెల్లోనే నివసిస్తున్నట్లు తేలడంతో, ఆయా కుటుంబాలన్నింటికీ ప్రాధాన్యత క్రమంలో తక్షణమే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
హైదరాబాద్‌లో స్థలాలు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ : హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలోని 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో కూడా లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. నగర పరిధిలో సొంత స్థలాలు ఉన్న వారు చాలా తక్కువ మంది ఉన్నందున, నిరుపేద మరియు మధ్య తరగతి కుటుంబాల కోసం ప్రస్తుతం వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ప్రభుత్వ స్థలాలను గుర్తించి అల్పాదాయ వర్గాల (LIG) కోసం ఇళ్లను నిర్మించనున్నారు.
విద్యార్థులకు వరం: జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం.. పాలు!
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాఠశాలలతో సమానంగా కాలేజీ విద్యార్థులకు కూడా ప్రతిరోజూ ఉదయం హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం)తో పాటు పాలు అందించాలని స్పష్టం చేసింది.
కేబినెట్ తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు:
- విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న RDSS లో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
- రాష్ట్రంలోని అన్ని డీసీఎంఎస్‌లను (DCMS) మార్కెఫెడ్‌లో, అలాగే రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను ‘హాకా’ (HACA) లో విలీనం చేయాలని తీర్మానించారు.
- సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పక్కన పెట్టి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలనే సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖకు సూచించారు.
గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణ
2030 నాటికి ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా తెలంగాణను నిలబెట్టాలన్న దృఢ సంకల్పంతో ‘నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30’ కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి గారి దావోస్ పర్యటనలో ఈ పాలసీని లాంఛనంగా ప్రకటించారు.
ఈ పాలసీ ద్వారా రాబోయే ఐదేళ్లలో లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మరియు మెడికల్ ఇన్నోవేషన్ రంగాలలో 25 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 లక్షల కోట్లు) పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, యువతకు 5 లక్షల హై-క్వాలిటీ ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇకపై కేవలం తయారీ రంగమే కాకుండా.. ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయనుంది.





