రైతుల కోసం 54,280 ఖర్చు చేశామనడం సిగ్గు చేటు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27 : ఏడాదిగా రైతులను దగా చేసి ఇప్పుడు రైతు పండుగ పేరిట విజయోత్సవాలు జరపడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం కోసం 54,280 ఖర్చు చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోందని, కానీ అందులో రూ. 27,486 కోట్లు గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు బాకీ పడ్డ రూ. 40,800 కోట్లతో పాటు, ఈ రబీకి ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా వెంటనే విడుదల చేసి పండుగ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏడాది పాలనలో రైతులను విజయవంతంగా దగా చేసినందుకు రైతు పండుగ అంటూ మూడు రోజుల విజయోత్సవాలు చేస్తున్నావా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. గొప్పగా చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్ లోని 9 హామీల్లో ఒక్కటీ అమలు చేయనందుకు పండుగ చేస్తున్నారా అని నిలదీశారు.
రుణమాఫీ ఎగ్గొట్టి, రైతు భరోసా బోగస్ చేసి, కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేయకుండా రైతులను ఏడ్పిస్తున్నారని, మీ ఏడాది దుర్మార్గ పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. చెప్పింది కొండంత, చేసింది గోరంత. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్య పెట్టారని, . అధికారంలోకి వొచ్చాక నిండా ముంచారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసింది? కేసీఆర్ ఇచ్చిన రైతుబంధు పథకానికి ఎగనామం పెట్టిందని, నూటొక్క దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని మోసం చేశారని, సగం మందికి మొండి చెయ్యి చూపారని అన్నారు. 24 గంటల నాణ్యమైన కరెంటు అందించలేక చేతులెత్తేశారు. పంటలకు మద్దతు ధర లేదు, అన్ని పంటలకు బోనస్ అసలే లేదు. కొనుగోలు కేంద్రాలు లేవు.. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తానన్న భరోసా దిక్కులేదు.
ఈ ఏడాది పాటు రైతులకు మీరు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతు పండుగ నిర్వహించడం సిగ్గుచేటు అని హరీష్ రావు ధ్వజమెత్తారు. పైగా, ఏడాది పాలనలో రైతు సంక్షేమం కోసం 54,280 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం చేసుకోవడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. రైతు బీమా, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోళ్ల కోసం మీరు ఖర్చు చేసినట్లు చెప్పిన రూ. 27,486 కోట్లు గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు చేసింది. ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సి ఉంటుందేనని అన్నారు. కానీ, కొత్తగా తామేదో రైతులకు చేసినట్లు డబ్బా కొట్టుకోవడం రైతులను మరోసారి మోసం చేయడమేనని, ఇదేనా కాంగ్రెస్ మార్కు మార్పు? అని హరీష్ రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం రైతులకు పడిన బాకీ…రుణమాఫీ కింద దాదాపు 14,000 కోట్లు, ఖరీఫ్ రైతు బంధు కింద 7,500 కోట్లు, కౌలు రైతులకు మరో 3,000 కోట్లు, రైతు కూలీలకు 16,00 కోట్లు, అన్ని పంటలకు బోనస్ సుమారు 3,000 కోట్లు,అకాల వర్షాలకు గానూ పంట నష్టం సుమారు 11,700 కోట్లు (కేంద్రానికి రాష్ట్రం పంపిన రిపోర్టు)ఈ ఏడాది కాలంలో మొత్తం రూ. 40,800 కోట్లు రైతులకు బాకీ పడ్డారని హరీష్ రావు వివరించారు.కాంగ్రెస్ పార్టీకి రైతుల సంక్షేమంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. రైతులకు బాకీ పడ్డ రూ. 40,800 కోట్లతో పాటు, ఈ రబీకి ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా వెంటనే విడుదల చేసి పండుగ చేసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.