సమ్మిళిత అభివృద్ధి, సుస్థిరతతోనే లక్ష్య సాధన

– 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్‌ 30ః రాష్ట్రం 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన ప్రతిభ, పారిశ్రామిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం రాష్ట్రానికి పుష్కలంగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (డాక్టర్ ఎం.సి.ఆర్. హెచ్.ఆర్.డి.ఐ.) స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహించిన “ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి, ప్రజా విధానాలు” అనే రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రచురించిన ‘సమృద్ధి’ జర్నల్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఆర్థిక వృద్ధి అనేది కేవలం స్థూల ఆర్థిక గణాంకాలు, తలసరి ఆదాయ పెరుగుదలకే పరిమితం కాకూడదని, సామాన్య ప్రజల జీవన ప్రమాణాల్లో స్పష్టమైన మార్పును తీసుకురావాలని స్పష్టం చేశారు.పర్యావరణాన్ని విస్మరించి చేపటే అనాలోచిత పట్టణ విస్తరణ ప్రమాదకరమని హెచ్చరించారు. చెరువులు, సహజ నీటి వనరులను కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలపై తీవ్ర భారం పడుతుందన్నారు. మూసీ నది పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులు పర్యావరణ సమతుల్యత, బాధితులకు సరైన పునరావాసం ప్రాతిపదికగా ముందుకు సాగుతాయని తెలిపారు.  ప్రభుత్వ శాఖల మధ్య విభాగపరమైన గోడలను తొలగించి, వ్యవసాయం, విద్యుత్, సాగునీటి శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల సమయాన్ని వృథా చేయకుండా వేగవంతమైన సేవలు అందించడమే పరిపాలనా సామర్థ్యానికి నిజమైన కొలమానమని పేర్కొన్నారు.

సదస్సులో ప్రముఖుల భాగస్వామ్యం

ఈ జాతీయ సదస్సులో డాక్టర్ ఎం.సి.ఆర్. హెచ్.ఆర్.డి.ఐ. డైరెక్టర్ జనరల్ శాంతికుమారి, అదనపు డైరెక్టర్ జనరల్ అనితా రామచంద్రన్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ శాంతా సిన్హాతో పాటు దేశంలోని 12 రాష్ట్రాల నుంచి విచ్చేసిన సుమారు 200 మంది విద్యావేత్తలు, పరిశోధకులు మరియు విధాన నిపుణులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *