అర్బన్, రూరల్ జిల్లా పరిషత్‌లలో మార్పులు
హనుమకొండ, వరంగల్ జడ్పీల ఏర్పాటు
స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు..
రాష్ట్ర ప్రభుత్వం 2016లో జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఇందులో ఉమ్మడి వరంగల్ ను మొదట ఐదు జిల్లాలుగా విభజించింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఏర్పాటు చేయగా.. 2019లో మరోసారి జిల్లాల పునర్విభజన చేపట్టి ములుగు జిల్లాను కూడా ఏర్పాటు చేసింది. ఉమ్మడి వరంగల్ లో ఆరు జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఇదిలాఉంటే వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ఏర్పాటు సమయంలోనే కొంత అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రెండు జిల్లాలను ఒకటిగా చేయాలనే డిమాండ్లు వినిపించాయి. కానీ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల పేరునైనా మార్చాలనే వాదనలు వినిపించాయి. దీంతో 2021 జూన్ లో హనుమకొండలో నిర్మించిన కలెక్టరేట్ ఓపెనింగ్ కోసం వొచ్చిన అప్పటి సీఎం కేసీఆర్.. రెండు జిల్లాల పేరును మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2021 ఆగస్టు 12న మండలాల మార్పులు, చేర్పులతో వరంగల్ అర్బన్ జిల్లాను హనుమకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా మారుస్తూ ఆ వెంటనే ఉత్తర్వులు కూడా ఇచ్చారు.
కానీ మండలాలు మారినా జడ్పీల విభజన జరగకపోవడంతో హనుమకొండ జడ్పీ వరంగల్ అర్బన్ గా, వరంగల్ జడ్పీ వరంగల్ రూరల్ గానే కొనసాగుతూ వొచ్చాయి. దీంతో కొంతమేర గందరగోళం ఏర్పడింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ రెండు జిల్లాల పరిధిలో మొత్తం 27 మండలాలు ఉన్నాయి. కాగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ నుంచి హనుమకొండ, వరంగల్ జిల్లాల ఏర్పాటు సమయంలో 14 మండలాలతో హనుమకొండ రెవెన్యూ జిల్లాగా ఏర్పాటైంది. 13 మండలాలతో వరంగల్ రూరల్ జిల్లా ఆవిర్భవించింది. కానీ అప్పటికే జిల్లా పరిషత్ పాలక మండళ్లు కొనసాగుతుండగా, ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయకుండానే పాత పద్దతిలోనే జడ్పీలను కొనసాగించింది. వాస్తవానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి హనుమకొండ జిల్లాలో వొచ్చే రెండు మండలాలు, వరంగల్ జిల్లాకు చెందిన రెండు మండలాలను మినహాయించి ప్రత్యేకంగా 12 మండలాలతో హనుమకొండ, 11 మండలాలతో వరంగల్ జడ్పీలను ఏర్పాటు చేయాల్సి ఉంది.
హనుమకొండ జిల్లా పరిధిలో హనుమకొండ, కాజీపేట మండలాలు, వరంగల్ జిల్లా పరిధిలోని వరంగల్, ఖిలావరంగల్ మండలాలు పూర్తిగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి. ఆ మండలాలు పోనూ హనుమకొండ జిల్లా పరిధిలో 12, వరంగల్ జిల్లా పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. ఇప్పుడు అవే మండలాలలో జడ్పీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాని ప్రకారం హనుమకొండ జిల్లా పరిషత్తు పరిధిలో 12 మండలాలు ఉండగా.. అందులో ఐనవోలు, హసన్ పర్తి, ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర, శాయంపేట మండలాలు ఉన్నాయి. వరంగల్ జడ్పీ పరిధిలో 11 మండలాలు ఉండగా.. అందులో గీసుకొండ, సంగెం, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ మండలాలున్నాయి.