– సింగూరు నీటి అవసరాల కోసం రూ.120 కోట్లు.
– ఇతర జిల్లాలకు రూ.కోటి చొప్పున మంజూరు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తెలిపారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాల కోసం రూ.120 కోట్లు, ఇతర జిల్లాల్లో తక్షణ అవసరాల కోసం రూ.కోటి చొప్పున విడుదలకు ప్రభుత్వం ఆమోదించిందని వెల్లడించారు. ఈ నిధులతో అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వేగవంతం చేసి, ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో మంత్రి సీతక్క శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాల్లో స్థానిక వనరులను వినియోగించుకోవడంతోపాటు, అవసరమైనచోట బోరు బావులను అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు. చేతిపంపులు, సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ నీటి సరఫరా పథకాలు, బావులు తదితర స్థానిక నీటి వనరులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మిషన్ భగీరథ సరఫరాలో అంతరాయం ఏర్పడే గ్రామాలు, భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాలను గుర్తించి, అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు. నీటి పొదుపు, ఎల్నినో ప్రభావంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు. హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, యాదాద్రి సహా పలు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. తాగునీటి వనరుల వద్ద ఇప్పటికే నిర్మించిన ఇంకుడు గుంతలు, మ్యాజిక్ పిట్లలో నీరు ఇంకేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పురోగతిలో ఉన్న నిర్మాణాలను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ కృపాకర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ విభాగాల సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





