మనుషుల మనసుల
ముసుగుల మొఖాల
లోపలి మెకాల రకాల
కకావికల వికార విలీనాల
అకాల క్షోభల
పాపాల ప్రాయశ్చిత్తాల
దుఃఖాల ముద్రల
నిద్రల ఛిద్రల
అభద్రతా ఫలితాల
ఒకే గాటికి తాడులు అల్లుతూ
చెల్లుతు చెబుతూ చూపుతూ
గుచ్చుతు గెచ్చుతు నచ్చుతూ
ఆత్మన్యూనతల హాలాహలాల
పరాకాష్టల మనోకాష్టంలో…
నీ వెయ్యితలలనే ముళ్ల పొదలను
గెంతుతు చిందుతూ దుంకుతూ
అనుకూలంగా అనునయంగా
తిప్పీ మలిపీ కలిపీ నలిపీ
తప్పించుకుపోలేవ్
అంతా తెలుసని నలుసని
అలుసని కలగలుపని విరుపుగా
వ్యాఖ్యానాలను చీత్కారాలుగా
మలుస్తు గెలుస్తు వెలివేస్తూ
పైపై మెరుగుల మురుగులు
కలుగులు కప్పెట్టెదవ్
ఇక చెల్లవ్ నడవవ్ గిడవవ్
ఉండవ్ పండవ్ వుడకవ్
దొరకవ్ మోఖలు రాకలు పోకలు
అతితెలివి వెలితి కలితి కడకి
సహజత్వం సరలత్వం
ఈ తత్వం బహుకష్టం
మరి ఇష్టం నిష్ఠం సత్యం
అదే అందరి అనునిత్యం అమరత్వం
ఇదే జీవన విపరీతం వివరించం
అర్థం పర్థం అపార్థం అకారణం
అంతరార్థం అంతర్థానం అధోస్థానం
చివరికి చెప్పే వేదాంతం రాద్ధాంతం
ఆద్యంతం అదోరకం అవహేళనం!!
– రఘు వగ్గు