తెలంగాణలో ‘సార్’ (SIR) పప్పులుడకవు

-విశ్వ జంపాల
న్యాయవాది ,మొబైల్ :7793968907

భారతదేశ రాజకీయ యవనికపై ఒక్కో ప్రాంతానిది ఒక్కో నైజం. ఉత్తరాది రాష్ట్రాల్లో సాగే సాంప్రదాయ సమీకరణాలు విద్యావంతులు, ఉద్యమకారులతో కూడిన దక్షిణాది రాష్ట్రాలపై పని చేయవు. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సాగే కుల, మత, ప్రాంతీయ చదరంగం తెలంగాణ మట్టిపై అస్సలు సాగదు. ఎందుకంటే, తెలంగాణ కేవలం ఒక భౌగోళిక సరిహద్దు కాదు, అదొక నిరంతర పోరాటాల సజీవ సాక్ష్యం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వోటర్ల జాబితా ప్రక్షాళన పేరిట సాగుతున్న ‘సార్’ (SIR – Special Intensive Revision) డ్రైవ్ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 2002 నాటి పాత లింకులను, సాంకేతిక కొర్రీలను సాకుగా చూపుతూ కొన్ని రాష్ట్రాలలో లక్షలాది మంది ప్రతిపక్ష, హిందూయేతర వోటర్ల పేర్లను జాబితాల నుండి తొలగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి ‘వోటు హక్కు’ను హరించే ఈ వ్యూహం ఇప్పుడు తెలంగాణ గడ్డపైకి చేరింది. కానీ, దిల్లీ వ్యూహకర్తలు ఒక విషయం గుర్తుంచుకోవాలి… ఇది విప్లవాల తెలంగాణ! ఇక్కడ వోటును దొంగిలించాలనుకుంటే పీఠాలు కదలిపోవడం ఖాయం.

 

పోరాటాల గడ్డ… చైతన్యాల అడ్డా! తెలంగాణ సమాజం పుట్టుకతోనే తిరుగుబాటు నైజాన్ని ఒంటబట్టించుకుంది. నాడు నిజాం నిరంకుశత్వానికి, భూస్వామ్య గడీల అహంకారానికి వ్యతిరేకంగా సాగిన సాయుధ రైతాంగ పోరాటం నుండి, నిన్నమొన్నటి మలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు ఈ నేల ఎన్నో త్యాగాలను, వీరోచిత రణాలను చూసింది. సహజసిద్ధమైన వివేకం తెలంగాణ ప్రజల సొంతం. ఇక్కడి వోటరుకు రాజకీయ నాయకుల తాయిలాలు, తాత్కాలిక ప్రలోభాల కంటే తమ హక్కులు, ఆత్మగౌరవమే ముఖ్యం. తుపాకీ గుళ్లకు ఎదురొడ్డిన సమాజం ఇది. విభజించు-పాలించు సూత్రం తెలంగాణ రాష్ట్రంలో సాగదు. కొన్ని రాష్ట్రాల్లో కుల, మతాల ప్రాతిపదికన వోటర్లను విడదీసి లాభం పొందడం సులభం కావచ్చు. కానీ, తెలంగాణ ప్రజలు సామాజిక సామరస్యాన్ని, గంగా-జమునా తెహజీబ్ సంస్కృతిని ప్రాణంగా ప్రేమిస్తారు. ఇక్కడ మతాల పేరిట గోడలు కట్టడం సాధ్యం కాదు.

రాజకీయంగా నేరుగా గెలవలేనప్పుడు వోటర్ల జాబితాతో ఆటలాడటం కొందరికి అలవాటుగా మారింది. ‘SIR’ ప్రక్రియలో భాగంగా 2002 నాటి పాత రికార్డులను తవ్వి తీస్తూ, ‘అనక్రోనిజమ్స్’ (వ్యత్యాసాలు) లేదా ‘చిరునామాలు దొరకనివి’ అనే నెపంతో నిర్దిష్ట వర్గాల వోట్లను ఏరివేసే కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి.

వోటు వేటపై బీజేపీ వ్యూహాలు హ్యూహాలు రచిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో సత్ఫలితాలిచ్చిన ఈ ‘వోట్ల తొలగింపు’ ఫార్ములాను తెలంగాణలోనూ ప్రయోగించి, క్షేత్రస్థాయి సమీకరణాలను మార్చేయాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణ వోటరు అమాయకుడు కాదు సాంకేతిక కొర్రీలతో వోటు హక్కును కాలరాయాలని చూస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇది ఉత్తరాది పల్లెటూరు కాదు. డిజిటల్ యుగంలో ప్రతి ఓటరు తన హక్కుపై అప్రమత్తంగా ఉన్నాడు.

 

‘దిల్లీ’ కుట్రలు ఇక్కడ ఎందుకు చెల్లవు? జాతీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఒకే తరహా ఫార్ములాను లేదా కేంద్రీకృత అధికార బలప్రయోగాన్ని అమలు చేయాలని చూస్తుంటాయి. కానీ, తెలంగాణకు వచ్చేసరికి ఆ ఫార్ములాలు బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. దిల్లీ పెద్దలు ఆశించిన ఫలితాలు తెలంగాణలో శూన్యం. తెరవెనుక ఎన్ని కుట్రలు చేసినా, ఎంతటి భారీ నిధులు గుమ్మరించినా, ఎంతమంది అధికారులను ప్రభావితం చేసినా సరే, తెలంగాణ ప్రజల రాజకీయ వివేకం ముందు అవి తుడిచిపెట్టుకుపోతాయి. ఎవరైనా సరే తెలంగాణలో సమానమే. ఇక్కడ ఎవరూ శాశ్వత రాజులు కారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోని ఏ శక్తినైనా, ఎంతటి అగ్రనేతనైనా సరే గద్దె దించడానికి తెలంగాణ ఓటరు క్షణం కూడా ఆలోచించడు.

 

వోటరు పహారా… కుట్రలకు ప్రజాస్వామ్య చెక్! ప్రస్తుతం ‘SIR’ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఇళ్ల వద్దకు వస్తున్నప్పుడు, వోట్ల తొలగింపుపై తెలంగాణ సమాజం నిశితంగా పహారా కాస్తోంది. యువత, మేధావుల చొరవ తెలంగాణలో ఎక్కువే. ఎక్కడైనా అన్యాయంగా, ఏకపక్షంగా వోట్లు తొలగిపోతుంటే ఇక్కడి యువత, సాంఘిక శ్రేణులు, విద్యావంతులు సాంకేతికంగా, చట్టపరంగా అడ్డుకుంటున్నారు.  తెలంగాణ వోటరు నిశ్శబ్దంగా ఉంటాడు, కానీ తీర్పు ఇచ్చేటప్పుడు మాత్రం సునామీలా విరుచుకుపడతాడు. తెలంగాణ వోటర్లు నిశ్శబ్ద విప్లవం సృష్టిసారు. రాజకీయ చైతన్యంలో ఇక్కడి ప్రజలు ఎల్లప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు.

 

దిల్లీ పెద్దలు వేసే ప్లాన్లు, తెరవెనుక చేసే కుట్రలు ప్రజాస్వామ్య చైతన్యం ముందు ఎల్లప్పుడూ మోకరిల్లాల్సిందే. ‘SIR’ పేరుతో దొంగదెబ్బ తీసి, వోటర్లను తొలగించి రాజకీయంగా లాభపడదామనుకునే వారికి తెలంగాణ వోటరు త్వరలోనే ఒక బలమైన, చారిత్రాత్మకమైన సమాధానం చెప్పబోతున్నాడు. వ్యూహాలు రచించే నాయకులకు తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఒకటే సందేశాన్ని ఇస్తారు — “ఇక్కడ మీ పప్పులు ఉడకవు.” ఎన్ని సాకులు వెతికినా, ఎన్ని వోట్లను తొలగించాలని చూసినా… తెలంగాణ ప్రజల పోరాట స్పూర్తిని, వారి రాజకీయ వివేకాన్ని ఎవరూ తొలగించలేరు. ఇక్కడ గెలిచేది ప్రజాస్వామ్యమే, నిలబడేది ప్రజా ఆత్మగౌరవమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *