
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఇటీవలకాలంలో చేస్తున్న ప్రసంగాలు పలువురిని విస్మయపరుస్తున్నాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా వాడని భాషతో రాష్ట్ర రాజకీయాలను సంచలనాత్మకంగా మారుస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన నోటికి హద్దు లేకుండా పోతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకానొక సందర్భంగా తనకు హిట్లర్ మార్గదర్శి అని చెప్పుకున్నారు. దానికి నిదర్శనంగా ‘రక్తం’ పారించడంపై ఆయన తాజా ప్రసంగం సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు చేసే డిమాండ్ కాని, మేధావులు, సాంకేతిక నిపుణులు ఇచ్చే ఏ సలహాలనైనా ఆయన ఒకే గాటున కట్టేస్తున్నారు. అందరిపైన ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రవేస్తున్న విధానంపై పలువురు విస్మయాన్ని వ్యక్తంచేస్తున్నారు. తాజాగా మీడియా సమావేశంలో ఆయన చేసిన కామెంట్ రాజకీయ దుమారాన్ని లేపింది. ‘వీళ్ళను ( బిఆర్‌ఎస్ నాయకులను) కోసి, వీరి నెత్తురును పంటలపై చల్లుతే అదే పండుంది, వీరి బలుపు, కొవ్వు పంటలకు సరిపోద్ది’ అన్న ఆయన మాటలు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల్లో రచ్చకు దారితీసింది. సిఎంను రక్తపిపాసిగా వ్యవహరిస్తూ బిఆర్‌ఎస్వీ తెలంగాణ భవన్‌లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. తమ రక్తాన్ని అందించి, పంటలకు నీళ్ళను కోరుతామంటూ వారంతా ముఖ్యమంత్రి ఇంటికి బయలుదేరడం గొడవ గా మారింది. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మరోపక్క బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు వ్యతిరేక నినాదాల ప్లేకార్డ్సు పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించడం ఉద్రిక్తతలకు దారితీసింది.
మొదటినుంచి కాళేశ్వరం నీళ్ళ విషయం పెద్ద వివాదంగా మారింది. పదేళ్ళ బిఆర్‌ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కూడా అదే కారణమైంది. ఎల్ నినో నేపథ్యంలో తెలంగాణలో వర్షాలు పడక భవిష్యత్‌లో మరింత కరువు పరిస్థితులు ఏర్పడనుండడంతో, పంటపొలాలకు నీరందించే విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ప్రధానంగా కన్నెపల్లి నుండి నీళ్ళు ఎత్తిపోసే విషయంలో ప్రభుత్వం ససేమిరా అనడం మరింత వివాదస్పదంగా మారింది. కన్నెపల్లి పంప్ హౌజ్‌ద్వారా ఎట్టిపరిస్థితిలోనూ కాళేశ్వరం నీటిని ఎత్తిపోయడం సాధ్యకాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఖచ్చితంగా చెప్పేశారు.
ఎన్‌డిఎస్‌ఏ ఆదేశాల మేరకు మేడిగడ్డ గేట్లు ఎత్తే ఉంచాలని, గేట్లు మూస్తేనే ఎత్తి పోయడానికి అవకాశం ఉంటుందన్నది ఆయన వాదన. కన్నెపల్లి పంపులు పనిచేయాలంటే మేడిగడ్డ బ్యారేజీలో కనీసం 93.5 మీటర్ల ఎత్తు నీటి నిల్వ ఉండాలి. కానీ ప్రస్తుతం మేడిగడ్డ వద్ద కేవలం 89.9 మీటర్ల ఎత్తులోనే నీటి లభ్యత ఉన్నకారణంగా అది సాధ్యంకాదన్నది రేవంత్‌రెడ్డి చెబుతున్నమాట. దీన్ని మాజీమంత్రి హరీష్‌రావు కొట్టిపడేశారు. ప్రస్తుత నీటిమట్టం 97.5 మీటర్లున్నప్పటికీ సీఎం అబద్దాలు చెబుతున్నారని ఆయన వాదిస్తున్నారు. అలాగే మేడిగడ్డ గేట్లు మూసి వేయకుండానే నీటిని ఎత్తి పోసుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఈ విషయం పైన వాస్తవంగా ఉన్న నీటి లభ్యత కు సంబంధించిన పూర్తి వివరాలు గణాంకాలతో సహా మీడియా ముందుంచారాయన. అలాగే తనకు మూడు నెలలు అవకాశమిస్తే తెలంగాణ పంట భూములకు నీళ్ళు ఎలా పారుతాయో చేసి చూపిస్తానని పేర్కొన్నారు హరీష్‌రావు. ఇదే విషయమై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ తాజాగా కన్నెపల్లి సందర్శించి వృధాగా పోతున్న లక్ష క్యూసెక్కుల నీళ్ళను మీడియాకు చూపించారు.
“ప్రతిపక్షాలు చేసే డిమాండ్ కాని, మేధావులు, సాంకేతిక నిపుణులు ఇచ్చే ఏ సలహాలనైనా ఆయన ఒకే గాటున కట్టేస్తున్నారు. అందరిపైన ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రవేస్తున్న విధానంపై పలువురు విస్మయాన్ని వ్యక్తంచేస్తున్నారు. తాజాగా మీడియా సమావేశంలో ఆయన చేసిన కామెంట్ రాజకీయ దుమారాన్ని లేపింది. ‘వీళ్ళను ( బిఆర్‌ఎస్ నాయకులను) కోసి, వీరి నెత్తురును పంటలపై చల్లుతే అదే పండుంది, వీరి బలుపు, కొవ్వు పంటలకు సరిపోద్ది’ అన్న ఆయన మాటలు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాల్లో రచ్చకు దారితీసింది..”మండువ రవీందర్‌రావు
దాంతో కాసేపు పోలీసులకు బిఆర్‌ఎస్వీ విభాగానికి మధ్య కాసేపు తోపులాట జరిగింది. అలాగే మంగళవారం కెటిఆర్, హరీష్‌రావు అద్వర్యంలో బిఆర్‌ఎస్ భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేయనున్నట్లు పార్టీ వర్గాలద్వారా తెలుస్తున్నది. కన్నీళ్ళపరమైన శ్యాంప్రసాద్‌రెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నమాటలకు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఎల్ నినో కారణంగా పంటభూములకు నీటి కరవు ఏర్పడనున్న దృష్ట్యా సాంకేతిక పరమైన సలహాను సూచిస్తూ ముఖ్యమంత్రికి లేఖరాస్తే తమను బిఆర్‌ఎస్ మద్దతుదారుగా ముద్రవేయడమే కాకుండా ఎప్పుడో బొక్కలోకి తోయాల్సి ఉండెనని, చర్లపల్లి జైల్‌కు పంపకుండా తప్పుచేశానని పేర్కొనడంపై ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు ఏ మాత్రం ఇబ్బందులు పడవద్దనే తాము కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని లేఖలో పేర్కొన్నామని, కానీ తమ సలహాను సీఎం తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్న శ్యాంప్రసాద్‌రెడ్డి తమకు ఏ రాజకీయ పార్టీతో సంబందం లేదని, రేపు ముఖ్యమంత్రి పిలిచినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ ప్రజల కోసం ఉచితంగా పనిచేయడానికి కూడా సిద్దమేనన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ఇంజనీర్లు కూడా స్పందించారు. సుమారు ఎనభైవ ఏట కూడా తెలంగాణ కోసం సర్వీస్ చేయడానికి సిద్దంగా ఉన్న ఇంజనీర్లను పట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
ఇప్పటికే చాలా నీరు వృధాగా కిందకు పోయిందని, వాటిని ఖాలీగా ఉన్న మన రిజర్వాయర్లలో నింపితే రైతన్నలకు మేలు చేసినట్లు అవుతుందన్నారు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో విలేఖరులు ప్రస్తావించినప్పుడు సిఎం రేవంత్‌రెడ్డి కోపం నషాళానికి అందింది. ఆయన ఏ మాత్రం తడుముకోకుండా ‘రక్తం’గురించి మాట్లాడారు. దీనిపై బిఆర్‌ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. రైతులకు కావాల్సిన నీళ్ళు ఇవ్వాలని అడిగితే మా రక్తం చల్లుతే పంటలు పండుతాయంటావా.. రక్తపిపాసి అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ 60 ఏండ్లు పాలించి తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చింది సరిపోలేదా అని ప్రశ్నించారు. హిట్లర్ ఆదర్శమన్న రేవంత్‌రెడ్డి శాడిజం ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొంటూ, రైతులకోసం ఎంత రక్తమైనా ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. ప్రాణాలనే అడ్డుపెట్టి తెలంగాణ సాధించుకున్నోళ్ళం మా రైతుల కోసం నీవు కోరుకున్న రక్తాన్ని ఇవ్వలేమా అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆవేశపడ్డారు. కాగా సిఎం మాటలకు తీవ్రంగా స్పందించిన బిఆర్‌ఎస్వీ తెలంగాణ భవన్‌లో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. వారు సేకరించిన రక్తాన్ని అందించి, పంట భూములకు నీళ్ళు ఇవ్వమని అడిగేందుకు ముఖ్యమంత్రి ఇంటికి బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు.


మండువ రవీందర్‌రావు


