39 సార్లు దిల్లీకి వెళ్లినా ప్రయోజనమేంటి?

  • ఇప్పటి వరకు ఒక్క రూపాయి తేలేదు
  • రేవంత్‌ ‌దిల్లీ పర్యటనలపై కేటీఆర్‌ ‌విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పదేపదే దిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రేవంత్‌ ‌రెడ్డి మొత్తం 39 సార్లు దిల్లీకి వెళ్లినప్పటికీ, రాష్ట్రాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని కేటీఆర్‌ ‌విమర్శించారు.

రేవంత్‌ ‌తీరు ‘గల్లీలో హోదా మరిచి తిట్లు, దిల్లీలో చిట్‌చాట్లు‘ అన్నట్లు ఉందని, తన కార్యాలయం దాటి బయటకి రావడానికైనా తడబడే రేవంత్‌ ‌దిల్లీలో మాత్రం మాటలతో కోటలు కట్టే ప్రయత్నం చేస్తున్నారని సెటైర్‌ ‌వేశారు. ఈ మేరకు ఇవాళ కేటీఆర్‌ ‌తన ట్విట్టర్‌ ‌ఖాతాలో పలు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో సాగునీటి సమస్య తారాస్థాయికి చేరుకున్నా, పంటలు ఎండిపోతున్నా, రైతులు బిక్కుబిక్కుమంటూ విలవిలలాడుతున్నా సీఎం కనీసం సక్ష సమావేశం కూడా నిర్వహించకుండా దిల్లీకి వరుసగా పర్యటనలు నిర్వహించడం సరికాదని ఆయన మండిపడ్డారు.

రాహుల్‌ ‌గాంధీతో రేవంత్‌ ‌రెడ్డి వ్యక్తిగత సంబంధాల గురించి తెలంగాణ ప్రజలకు ఎలాంటి అవసరం లేదని, సంబంధం మీకే, దాని వల్ల తెలంగాణ ప్రజలకు ఏ మేలు జరుగుతుందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో పార్టీకి వోటు వేసి మోసపోయామని ఇప్పుడు గ్రామా గ్రామాన, గల్లీ గల్లీల్లో తీవ్ర అసంతృప్తితో బయటపడుతున్నారు. అయితే, ప్రజల వాస్తవ సమస్యలపై స్పందించాల్సిన సీఎం మాత్రం తమ బాధలను పట్టించుకోకుండా దిల్లీ చుట్టూ తిరుగుతూ రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘ముఖం బాగోలేక అద్దం పగలగొట్టినట్లు, పాలన చేయలేక పాత గజ్జెలు మోగించినట్లు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు,‘ అంటూ కేటీఆర్‌ ‌ఘాటుగా విమర్శించారు. చివరగా, ‘జాగో తెలంగాణ జాగో‘ అంటూ ప్రజలను అప్రమత్తం చేయాలని తన ట్వీట్‌లో పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page