రేవంత్ లాంటి ఎన్నో కొరివి దయ్యాలను తుదముట్టించి తెలంగాణ తెచ్చుకున్నాం..
సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : డబ్బు సంచులతో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోతూ పట్టబడ్డ దొంగ నేడు ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నారని, ప్రభుత్వ సొమ్మును రేవంత్ రెడ్డి తెలంగాణ నిర్మాత కేసీఆర్ ను తిట్టడానికి వినియోగిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన టీచర్ల మెదళ్లలో అసభ్యకరమైన భాషను ఎక్కించే యత్నం చేస్తున్నాడని, తెలంగాణ ద్రోహులు తప్ప ఎవ్వరూ కేసీఆర్ ను కొరివి దయ్యం అని అనరని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ వంటి ఎన్నో కొరివి దయ్యాలను తుదముట్టించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను నిజం చేసిన ఉద్యమ సూరీడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రావడం ఇష్టం లేని మాతృ ద్రోహి రేవంత్ కు ఈ కేసీఆర్ త్యాగాలు ఎలా కనిపిస్తాయని ప్రశ్నించారు. రేవంత్ లాంటి కొరివి దయ్యాన్ని తెచ్చుకుని పొరపాటు చేశామని తెలంగాణ సమాజం పాశ్చాతాపంతో ఉందని మండిపడ్డారు. నీ లాంటి వాడి చేతికి పొరపాటున 2014 లో అధికారం ఇస్తే తెలంగాణను అమ్మేసే వాడివి.. కేసీఆర్ చేతిలో తెలంగాణ సురక్షితం గా ఉంది కనుకే నువ్వు సీఎం కాగలిగావు. నీకు సీఎం అనే ఉద్యోగం కూడా కేసీఆర్ చలవే అని గుర్తు పెట్టుకో నువ్వు ఇచ్చిన 30వేల ఉద్యోగ నియామక పత్రాలు కూడా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల వల్లే అని గుర్తుపెట్టుకో నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్. ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది.
బీఆర్ఎస్, పరీక్షలు నిర్వహించింది కూడా బీఆర్ఎసే..అని హరీష్ రావు అన్నారు. మూడు నెలల్లోనే ఇచ్చినం అని చెప్పుకున్న 30వేల ఉద్యోగాల సంగతి కూడా ఇదే. వాటికీ నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్సే, పరీక్షలు నిర్వహించి బీఆర్ఎస్సే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది కూడా బీఆర్ఎస్సే. 7,094 స్టాఫ్ నర్సుల నియామకాల విషయంలోనూ ఇదే అబద్ధం. రేవంత్ నియామక పత్రాలు ఇచ్చిన స్టాఫ్ నర్సుల ఉద్యోగాలకైనా, సింగరేణిలో ఇచ్చిన ఉద్యోగాలకైనా, పోలీసు ఉద్యోగాలకైనా, టీచర్ల ఉద్యోగాలకైనా నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్సే, పరీక్ష నిర్వహించింది బీఆర్ఎస్సే. నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన ఈ ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చినట్లా? నోటిఫికేషన్లు లేకుండా, పరీక్షలు నిర్వహించకుండా, ఏకంగా నియామకపత్రాలు ఇవ్వడం కుదురుతుందా? అని హరీష్ రావు ప్రశ్నించారు. 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా 8,792 టీచర్ పోస్టులు భర్తీ చేశామన,ఇ గురుకులాల్లో 11వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశామని. గురుకులాల్లో 12వేల నాన్ టీచింగ్ పోస్టులకు రిక్రూట్మెంట్ శాంక్షన్ ఇచ్చామని, అంతేకాదు ఇంటర్ కాలేజీల్లో 3096 మందిని, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో 520 మందిని, డిగ్రీ కాలేజీల్లో 280 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ 3232 పోస్టులను, యూనివర్సిటీల్లో 1061 పోస్టులను మంజూరు చేశామని తెలిపారు.ఉద్యోగాలు పొందిన వారికి అనుభవంలో ఉన్న వాస్తవాలు. 25వేల మెగా డీఎస్సీ అని ఊదరగొట్టి, మేమిచ్చిన 5089 డీఎస్సీ పోస్టులకు అదనంగా 6వేలు కలిపి నోటిఫికేషన్ ఇచ్చి మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేసినవు. ఉపాధ్యాయులకు బిల్లా రంగాల గురించి చెబుతావా ? విద్యార్థులకు బిల్లా రంగాల గురించి బోధించమని టీచర్లకు చెబుతున్నావా ? రాహుల్ గాంధీ ని తీవ్రవాది అని ఓ కేంద్రమంత్రి అంటే దిష్టిబొమ్మలు కాల్చారు కదా.. నువ్వు సీఎం స్థానంలో ఉండి బిల్లా రంగాలతో పోల్చవచ్చా నీ దిష్టి బొమ్మలు ఎన్ని కాల్చాలి ? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ లో ఓడిపోయిన వారికి పదవులు ఇవ్వలేదా? ఇదేమైనా కొత్తనా నువ్విపుడు ఓడిపోయిన వారికి పదవులు ఇవ్వలేదా ? కవిత ఎమ్మెల్సీ గా వోట్లతోనే గెల్చింది. కేసీఆర్ హయాంలో లక్షా 60వేలకు పైగా ఉద్యోగాలిచ్చారు. గతంలో అధికారంలో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? కేసీఆర్ మొదలు పెట్టిన 30 వేల ఉద్యోగనియామకాల ప్రక్రియ ను చివరి దశలో పూర్తి చేస్తే నువ్వు ఉద్యోగాలు ఇచ్చినట్టా .. అది నోరా? మోరా ? నాలుకనా లేక తాటి మట్టనా? కట్టిన ఇంటికి సున్నం వేస్తే ఇల్లు నువ్వు కట్టినట్టేనా ? అని ప్రశ్నిచారు. కేసీఆర్ హాయంలో ఉద్యోగాల నియామక ప్రక్రియను కోర్టులకు వెళ్లి అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలు కాదా ? అని నిలదీశారు. హర్యానా వోటర్లు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారెంటీలకు ఘొరీ తవ్వారు. తెలంగాణలో ఇపుడు బొంద తవ్వడం మొదలైంది. గంట కూడా రెస్ట్ లేకుండా పని చేస్తున్నా అని ఈ సిపాయి చెబుతున్నాడు. అంత పని చేస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇన్ని కష్టాలు ఎందుకు.. తెలంగాణకు అసలు సిసలు కొరివి దయ్యం నువ్వే .. తెలంగాణను నీ దుష్ట పన్నాగం నుంచి కాపాడేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తాం అని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.





