కోట్లతో నిర్మాణమంటిరి.. కొసరు పనులతోనే నిలిపేస్తిరి..

మేడిపల్లిలో నిలిచిన ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ‌పనులు
వెంటనే పనుల ప్రారంభించాలని స్థానికుల డిమాండ్‌..

‌మేడిపల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 04 : ‌శుచి, శుభ్రత, ప్రజారోగ్యం ప్రధాన ఉద్దేశంగా శాస్త్రీయ దృక్పథం మేళవించి అధునాతన రీతిలో మేడిపల్లిలో నిర్మించతలపెట్టిన సమీకృత మార్కెట్‌ ‌నిర్మాణ పనులకు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. వినియోగదారుల శ్రేయస్సు, రైతుల సంక్షేమం  కోసం ఇంటిగ్రేటెడ్‌ ‌వెజ్‌, ‌నాన్‌ ‌మార్కెట్ల ఏర్పాటుకు గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పలు చోట్ల నిర్మాణాలు ప్రారంభించింది. అదే క్రమంలో శరవేగంగా అభివృద్ది చెందుతున్న నగరమైన పీర్జాదిగూడ మేడిపల్లిలోనూ మూతబడిన రైతు బజార్‌ ‌స్థానంలో రూ. 7.50 కోట్లతో సమీకృత వెజ్‌, ‌నాన్‌ ‌వెజ్‌ ‌మార్కెట్‌ ‌సముదాయం ఏర్పాటుకు రెండున్నర ఏళ్ల క్రితం శ్రీకారం చుట్టింది. అయితే ఏళ్లు గడుస్తున్నా పునాదుల పైన గోడల వరకే పనులు జరిగి అక్కడితోనే ఆగిపోయాయి. లక్షన్నర పైచిలుకు జనాభా గల నగర ప్రజల అవసరాలకు తీర్చేందుకు నిత్యావసర సరుకులైన శాకాహార, మాంసాహార ఉత్పత్తులన్నీ తాజాగా, నాణ్యతతో ఒకేచోట లభించాలనే ఆలోచనతో గత ప్రభుత్వం నగరంలో ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ‌నిర్మాణానికి శ్రీకారం చుట్టినా ఆచరణలో మాత్రం మాత్రం నేటికీ సాకారం కాకపోవడంపై పలువురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్‌ ‌పనులు ప్రారంభమైన కొంత కాలానికే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కోలాహలం ప్రారంభం కావడం.. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌  ఓటమిపాలై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం గద్దెనెక్కిన విషయం తెలిసిందే. ఆ తరువాత బల్ధియాలోనూ అధికారం హస్తగతం చేసుకోవాలనే తాపత్రయంలో నగర మేయర్‌ను పదవీచ్యుతున్ని చేసేందుకు అవిశ్వాసం అంశం తెరపైకి వొచ్చి సుదీర్ఘ కాలం క్యాంపు రాజకీయాలు కొనసాగడంతో అనేక నెలల పాటు స్థానిక పరిపాలన దాదాపుగా స్తంభించిపోయినట్లయింది. దీంతో అభివృద్ది, మౌలిక వసతుల కల్పన విషయం పాలకవర్గం పక్కకు పెట్టి పదవి కాపాడుకోవడం, పదవి చేజిక్కించుకోవడం దానిపై పైనే ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలతో చాలా కాలం రాజకీయ సమరం కొనసాగింది. అయితే చివరికి మేయర్‌ ‌పీఠం కాంగ్రెస్‌ ‌చేతిచిక్కి మరొక కార్పొరేటర్‌ ‌మేయర్‌గా ఎన్నికై నెలలు గడుస్తున్నా ఇంటిగ్రేటెడ్‌ ‌వెజ్‌, ‌నాన్‌ ‌వెజ్‌ ‌మార్కెట్‌ ‌నిర్మాణంపై మాత్రం ఇప్పటికీ దృష్టి సారించకపోవడం విచారకరమని స్థానికులు మండిపడుతున్నారు. గతంలో పనులు ప్రారంభమై పెండింగ్‌లో ఉన్న రహదారి విస్తరణపైనే బల్ధియా ఎక్కువగా ఫోకస్‌ ‌పెట్టి వారానికోసారి మేయర్‌ ‌సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగించడం చేస్తుండడం పలువురు స్వాగతిస్తున్నారు. అయితే ఒకే పనిపై దృష్టి సారించి ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ‌నిర్మాణం గురించి మాటవరుసకైనా ప్రస్తావించకపోవడం విచారకరమని స్థానికులు మండిపడుతున్నారు. అటు రాష్ట్రంలో, పీర్జాదిగూడ బల్ధియాలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ అంసపూర్తిగా మిగిలిపోయిన ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ‌పనులు పూర్తి చేయించేలా చర్యలు చేపట్టాలనే డిమాండ్‌ ‌వినిపిస్తోంది.

లక్షల రూపాయలు వృథా..
అంతకు కొన్నేళ్ళ ముందు నుంచి మేడిపల్లి విశ్రాంత ఉద్యోగుల సంఘం రైతు బజార్‌ ఏర్పాటు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆ సంఘం కృషి, ఒత్తిడితో అప్పటి ప్రభుత్వం రూ.70 లక్షల పైచిలుకు వెచ్చించి మేడిపల్లిలో రైతు బజార్‌ ఏర్పాటు చేసి 2015 లో ప్రారంభించింది. సదరు సంఘం ప్రయత్నాలతో పురుడు పోసుకున్న రైతు బజార్‌ ‌సంబంధిత అధికారుల నియంత్రణ కొరవడి, నిర్లక్ష్యంతో ఆశించిన సత్ఫలితాలు రాక  మొదటి దశలోనే కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తరుణంలోనే ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ ‌వెజ్‌, ‌నాన్‌ ‌వెజ్‌ ‌మార్కెట్ల ఏర్పాటుకు ప్రభుత్వం పూనుకుంది. ఇదే క్రమంలో మేడిపల్లిలో ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ఏర్పాటుకు అప్పటి మేయర్‌ ‌జక్కా వెంకట్‌ ‌రెడ్డి కౌన్సిల్‌ ‌సభ్యుల సహకారంతో ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి పెంచి ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు.

ఆయన కృషితో ప్రభుత్వం పీర్జాదిగూడ మేడిపల్లిలో ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ‌మంజూరీకి పచ్చ జెండా ఊపి రూ. 7.50 కోట్ల భారీ వ్యయంతో అన్ని ఆధునిక వసతులు, హంగులతో శాకాహార, మాంసాహార ప్రియులకు అనుగుణంగా ఒకే చోట అన్నీ లభ్యమయ్యేలా అందుబాటులో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. రెండున్నర ఏళ్ళ క్రితం అప్పటి ఐటీ, మున్సిపల్‌ ‌శాఖల మంత్రి కేటీ రామారావు చేతులమీదుగా భూమి పూజ జరుపుకున్న అనంతరం పనులు ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ‌నిర్మాణ పనులు ప్రారంభమైన తొలి దశలో వేగంగా కొనసాగినా అటు తరువాత ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఏళ్ల తరబడి నుంచి ఆగిపోయిన పనులు మళ్ళీ కొనసాగకపోవండతో పలువురు వినియోగదారులు తీవ్ర నైరాశ్యానికి లోనవుతూ మార్కెట్‌ ‌నిర్మాణ పనులు పున: ప్రారంభించాలని పలు మార్లు పాలకులు, అధికారులపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. అయినా వారు ఉలుకూ పలుకూ లేకుండా ఉండంతో క్షేత్రస్థాయిలో ఇప్పటికీ ఎటువంటి పురోగతి కనిపించడం లేదు.

వారాంతపు సంతలతో ఇక్కట్లు
ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌  అం‌దుబాటులోకి రాకపోవడంతో నగరంలోని అన్ని బస్తీలు, కాలనీల రోడ్లపైనే వారాంతపు మళ్లీ పుంజుకున్నాయి. రైతులు, వ్యాపారులు కూరగాయలు, పండ్లు, ఇతర సరుకులు విక్రయిస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా ప్రమాదాలు జరుగతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నచిన్న రోడ్ల పక్కనే అమ్మకాలతో కొనుగోలుదారులు తమ వాహనాలు రోడ్లపైనే నిలుపుతుండంతో ఈ రోడ్లన్నీ బ్లాక్‌ అవుతున్నాయి. కొందరు వ్యాపారులు మిగిలిన, కుళ్లిన కూరగాయాలు, పండ్ల వ్యర్ధాలను రోడ్లపైనే పడేస్తుండడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ ‌వెజ్‌, ‌నాన్‌ ‌వెజ్‌ ‌మార్కెట్‌ ‌నిర్మాణ పనులను పునఃప్రారంభింయాలని స్థానికులు కోరుతున్నారు.

సమీకృత మార్కెట్‌తో దీర్ఘకాలిక ప్రయోజనాలు..
మేడిపల్లిలో సమీకృత వెజ్‌, ‌నాన్‌ ‌వెజ్‌ ‌మార్కెట్‌ ఏర్పాటు అత్యంత అవసరం. మార్కెట్‌ ‌నిర్మాణ పనులు మధ్యంతరంగా నిలిచిపోవడం విచారకరం. నగరంలో వీది సంతల విసృతి సామాజిక తిరోగమనమే. అపరిశుభ్రతకు తావిచ్చే వారాంతపు వీది సంతల నియంత్రణకు మార్కెట్‌ ‌సముదాయం నిర్మాణమే ఏకైక పరిష్కారం. దీని ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయి. స్వచ్ఛత, పరిశుభ్రతకు, నాణ్యతకు పెద్దపీట వేసే సమీకృత  మార్కెట్‌ అం‌దుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలి.
– ఎ. ఉమామహేశ్వర రావు, మేడిపల్లి.

ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ఎం‌తో అవసరం..
పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ‌పనులు ఆగిపోవడం సరికాదు. ఈ విషయంలో ప్రభుత్వం, స్థానిక పాలకమండలి  చొరవ తీసుకుని పున: ప్రారంభించాలి. ఆధునిక హంగులు, వసతులతో శాస్త్రీయ పద్దతిలో మార్కెట్‌ ‌నిర్మాణంతో వెజ్‌, ‌నాన్‌ ‌వెజ్‌ ఆహార ఉత్పత్తులు ఒకే చోట లభిస్తే వినియోగదారులకు శ్రమ, ఖర్చు తగ్గుతాయి. నగరవాసులకే కాకుండా సమీప ప్రాంతాల వారికి ఎంతో ఉపయోగకరమైన ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌ ‌నిర్మాణంలో ఇక ఏ మాత్రం అలసత్వం తగదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page