లక్ష్యం 2028

– రాష్ట్రంలో అప్పుడే మొదలైన ఎన్నికల వ్యూహాలు
– రెండేళ్ల ముందే సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు
– గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి ధీమా
– ‘మిషన్-2028’ పై బీజేపీ ఫోకస్
– ఒంటరి పోరాటానికే గులాబీ సైన్యం మొగ్గు

 

 (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)

తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని చూస్తుంటే ఎన్నికలకు ముందస్తుగానే వేడిరాచుకున్నట్లు కనిపిస్తు న్నది. సహజంగా మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్నాయనగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతాయి. శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలకు పైగా సమయమున్నప్పటికీ ఇప్పటి నుండే  ఎన్నికలకు సిద్ధ‌ప‌డుతున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్ని భవిష్యత్‌లో తామే అధికారంలోకి వస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.  ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌, ‌ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌తోపాటు బిజెపి, ఎంఐఎంలు తమ పట్టును నిలుపుకునే విషయంలో వ్యూహాలు పన్నుతున్నాయి.  అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏండ్లలో తాము చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఏకరువు పెడుతూ కాంగ్రెస్‌ ‌విస్తృత ప్రచారం చేసుకుంటున్నది. 2034వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటూ ధీమాగా చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తాజాగా కోహెడ సభలో చేసిన ప్రసంగాన్ని వింటే ఎన్నికల ప్రసంగానికి ఏమాత్రం తీసిపోనిదిగా ఉంది. ‘ఔర్‌ ఏక్‌బార్‌ ‌కాంగ్రెస్‌ ‌సర్కార్‌’ అని పలుమార్లు సభికులతో అనిపించిన తీరు ఎన్నికల సభలను గుర్తుచేసేదిగా ఉంది. అలాగే బిఆర్‌ఎస్‌కూడా ‘రేవంత్‌ ‌హఠావో, తెలంగాణ బచావో’ లాంటి నినాదాలు చేస్తున్నది. మార్పు కోసం బిజెపి.. ఒక్క అవకాశమివ్వండంటూ బిజెపి అవినీతిలేని పాలనను అందిస్తామంటూ పోటాపోటీగా ప్రజలమ ధ్యకు దూసుకుపోతున్న తీరు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నది. ‌తండ్రి పార్టీని వ్యతిరేకించి కొత్తగా తెలంగాణ రక్షణ సేన (టిఆర్‌ఎస్‌)‌ పేర పార్టీని ఏర్పాటుచేసుకున్న కల్వకుంట్ల కవితకూడా రానున్న ఎన్నికల్లో ప్రజలు తనకే పట్టం కడుతారన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వీరికితోడు ఏ పరాయి పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఏర్పడిందో ఆ పార్టీల అధినేతలు ప్రజాస్వామ్య హక్కుపేర మరోసారి తెలంగాణపైన ఆధిపత్యం కోసం దారులు వెదుకుతున్నాయి. అయితే ఈ పార్టీలు ఒంటరిగా బరిలో దిగుతాయా కూటమిగా వస్తాయా అన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కేంద్ర  మంత్రి అమిత్‌షా తాజాగా చేసిన ప్రకటనతో కొంత స్పష్టత వచ్చినప్పటికీ ఎన్నికలనాటికి ఏదైనా జరుగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిఆర్‌ఎస్‌ ‌బలమైన ప్రత్యమ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నది. మిషన్‌-2028 ‌పేరుతో పార్టీని ప్రజలవద్దకు తీసుకువెళ్ళేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నది. వాస్తవానికి గత ఎన్నికల్లోనే రాష్ట్రంపై కాషాయ జండాను ఎగురవేయాలన్న సంకల్పంతో ఉండింది. అయితే ఆ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని మూడవ స్థానానికే పరిమితం చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌ను కోలుకోకుండా చేయాలన్న సంకల్పంతో  రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆ పార్టీపై చేస్తున్న రాజకీయ దాడితో కాంగ్రెస్‌కు ప్రత్యమ్నాయం తామేనని బిజెపి భావిస్తున్నది. దీంతో ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేటాయిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాజాగా మొదటిసారిగా ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ ‌పర్యటనకూడా ఆ పార్టీ వర్గాల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. అయితే ఆయన తన పర్యటనలో భాగంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ ‌కళ్యాణ్‌లను హైదరాబాద్‌లోని వారి గృహాల‌కు వెళ్ళి కలవడమన్నది తెలంగాణ రాజకీయాల్లో ఒకింత దుమారాన్ని లేపింది. ఏపిలో తెలుగుదేశం అధికారంలోకి రావడానికి ఏ కూటమి( టిడిపి,బజెపి,జనసేన) పనిచేసిందో భవిష్యత్‌లో తెలంగాణలోకూడా అదేకూటమి కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదన్న భావన అందరిలో ఏర్పడింది. చాలాకాలంగా తెలంగాణపై కాషాయ జండాను ఎగురవేయాలనుకుంటున్న బిజెపికి మిగతా రెండు పార్టీలు సహకరిస్తాయన్న విషయంలో ఏలాంటి సందేహం లేదు. దానికి తగినట్లుగా  ఇటీవలి టిడిపి మహానాడులో ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌లోకోష్‌ అం‌డమాన్‌తోపాటు, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని చెప్పడం ఒకటికాగా, తమ పార్టీ తెలంగాణలో తప్పకుండా పోటీ చేస్తుందని  జనసేన అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ ఆవేశ ప్రసంగం తర్వాత తెలంగాణలోకూడా ఎన్డీఏ కూటమి పోటీకి సిద్దమవుతుందన్న అనుమానాలకు బలం ఏర్పడినట్లైంది. అయితే అమిత్‌షా వ్యాఖ్యలు అయోమయాన్ని కలిగించేవిగా ఉన్నాయి. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా, స్వంత బలంపైనే పోటీ చేస్తుందనటంతోపాటు ఎన్డీయే కూటమి పార్టీలకు ఎలాంటి ఇబ్బందులుండవనడం కాస్త ఆలోచించాల్సిన విషయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్డీయేలో ఇప్పుడున్న పార్టీలు కాకుండా మరే కొత్తపార్టీతో పొ త్తుపెట్టుకోమన్న విధంగా దాన్ని అర్థం చేసుకోవాలని, కూటమి పార్టీలతో కలిసి పోటీ చేయబోమన్న విషయం పట్ల ఆయన స్పష్టత ఇవ్వలేదంటున్నారు.  రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌బిజెపితో కలుస్తుందని కాంగ్రెస్‌ ‌వర్గాలు చేస్తున్న ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ విధంగా అని ఉంటారంటున్నారు విశ్లేషకులు. అయితే వారు చేస్తున్న విశ్లేషణను బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌కొట్టిపారేస్తూ రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తాజాగా ప్రకటించడం గమనార్హం. దీంతో బిజెపి, బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ‌టిఆర్‌ఎస్‌(‌కవిత)లు 2028 అసెంబ్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తాయన్నది స్పష్టమవుతున్నది. అయితే ఇక్కడ తప్పకుండా తమ పార్టీ పోటీచేస్తుందని చెబుతున్న జనసేన అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ ఒం‌టరిగా పోటీచేస్తాడా, మరోపార్టీతో కలిసి పోటీచేస్తాడా అన్న విషయాన్ని స్ఫష్టంచేయలేదు. బిజెపి నిర్ద్వందంగా ఒంటరిగా బరిలో దిగుతామని చెప్పడంతో ఇక ఆ పార్టీకి మిగిలింది టిడిపి ఒక్కటే. ఆ పార్టీతో కలిసి జనసేన పోటీచేస్తుందా? లేక ఒంటరిగా పోటీచేస్తుందా? లేక ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కేవలం బిజెపికి మద్దతిస్తుందా అన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సిఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *