అసమగ్రతకు తావు లేకుండా కసరత్తు ి సర్వేకు రంగం సిద్ధం
రాష్ట్రంలో ఈ నవంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బిసి కులగణన సర్వే ఈనెల 30వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 85 వేల మంది ఎన్యూమరేటర్లు ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను ప్రభుత్వం నియమించింది. ఇక గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు సైతం ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. వీరితో పాటు పాఠశాల ఉపాధ్యాయులను కూడా ఈ సర్వేకు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల వేళలు అయిపోయిన తరువాత ఒక్కో ఉపాధ్యాయుడు ప్రతిరోజు 5 నుంచి 7 ఇళ్లను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్యుమరేటర్‌లకు, సూపర్‌వైజర్‌లకు, ఇతర సిబ్బందికి ఆకర్శణీయమైన వేతనాన్ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సర్వే జరిగే ప్రతి గ్రామంలో ముందుగా డప్పు చాటింపు వేయించాలని, సర్వే నిర్వహించే సమయంలో కలెక్టర్‌లు క్షేత్రస్థాయిలో తిరిగి తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్రేటర్ హైదరాబద్ పరిధిలో 21 వేల మంది ఎన్యుమరేటర్‌లను ప్రభుత్వం వినియోగించుకుంటుంది.
రాష్ట్రంలో కులగణనను చాలా పకడ్బందీగా నిర్వహిస్తామని తెలంగాణ బీసీ కమిషన్ చ్కెర్మన్ నిరంజన్ కూడా స్పష్టం చేశారు. ఈ కులగణన సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చినా.. తప్పుడు సమాచారం నమోదు చేసినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కులగణన సర్వే సందర్భంగా కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. కులగణన బృహత్తర కార్యక్రమమని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్వేలో కేవలం బిసి జనాభా గురించి కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని అన్ని వివరాలు సేకరిస్తే మంచిది. ఈ గణన ద్వారా బీసీలతో పాటు అన్ని కులాల జనాభా లెక్కలు, వారి ఆర్థిక స్థితిగతులు తెలుస్తాయి. సర్వే సక్రమంగా జరిగేలా చూడాలి. 80వేల నుంచి 90వేల మంది ఎన్యుమరేటర్లు జనగణనలో పాల్గొంటారు. సర్వేకు వొచ్చే సిబ్బందికి సమగ్రమైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కులగణన అనేది ఎక్స్ రే మాత్రమే కాదని.. హెల్త్ చెకప్ లాంటిందని కూడా సీఎం రేవంత్ అభివర్ణించారు. అందువల్ల అసమగ్రతకు తావు లేకుండా సాగాల్సి ఉంటుంది.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనెల 6వ తేదీ నుంచి ఇంటింటికి సమగ్ర సర్వే కు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దపడిరది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులాల సర్వే ఆధారంగా కులగణనను చేపట్టనుంది. ఈ నేపథ్యంలోనే దీనికోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. అందులో భాగంగా ఇప్టపికే బిసి కమిషన్, పిసిసి ఎవరి స్థాయిలో వారు సమావేశాలు నిర్వహిస్తున్నారు. పనిలో పనిగా సర్వేలో అన్న వివరాలు రాబట్టాలి. కులాలతో పాటు, ప్రజల ఆర్థిక స్థితిగతులు, నిరుద్యోగులు సంఖ్య, అక్షరాస్యుల సంఖ్య, రేషన్ కార్డుల వివరాలు ఇలా మొత్తం వివరాలు సేకరించాలి. దీంతో ప్రజలకు ఏ పథకం అందాలో..అందకూడదో కూడా తెలుసుకునే అవకాశం వస్తుంది. ప్రజల సొమ్ముతో అనేక పథకాలు ప్రవేశ పెట్టిన ప్రభుత్వం..అవి సక్రమంగా పేదలకు అందుతున్నాయో లేదో కూడా తెలుసుకోవాలి. దుబారా అవుతుంటే గుర్తించాలి. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటున్న క్రమంలో ఇళ్లు లేని వారి ఆర్థిక స్థితిగతులను కూడా గుర్తించాలి. ఈ సర్వే దేశానికి దిక్సూచి కావాలని కోరుకుంటున్న సిఎం రేవంత్ అందుకు అనుగుణంగానే సర్వేకు సంబంధించిన విధివిధానాలు ఉండేలా చూసుకోవాలి. అన్ని జిల్లాల్లో ఈ సర్వేపై సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ శ్రేణులను అందుకు సమాయత్తం చేయాలి. ఇంటింటికి సమగ్ర సర్వే , కులగణనను సంబంధించిన ప్రశ్నావళిని ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 56 ప్రధాన ప్రశ్నలతో పాటు 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలను ఖరారు చేసింది. పార్ట్-1లో యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించి 58 ప్రశ్నలుండగా పార్ట్-2లో కుటుంబ వివరాలకు సంబంధించి 17 ప్రశ్నలున్నాయి. మొత్తం 7 పేజీల్లో వీటిని పూరించాల్సి ఉంటుంది.
కుటుంబ యజమానితో పాటు కుటుంబంలోని సభ్యుల వ్యక్తిగత వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. పార్ట్-1లో వ్యక్తిగత వివరాల్లో మతం, సామాజిక వర్గం, కులం, ఉప కులంతో పాటు మాతృభాష, వైవాహిక స్థితి, పాఠశాల రకం, విద్యార్హత, ఉద్యోగం, ఉపాధి, కుల వృత్తి, వార్షిక ఆదాయం, ఐటి రిటర్న్, స్థిరాస్తులు, ధరణి పాసుబుక్ నెంబర్, రిజర్వేషన్‌తో పొందిన ప్రయోజనాలు, గత ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి లబ్దిపొందిన సంక్షేమ పథకాల పేర్లు, రాజకీయ నేపథ్యం, వలస వివరాలను సేకరిస్తారు. ఇందులో ఇంకా ఏమైనా వివరాలు అవసరమో గుర్తించాలి. ఈ గణన తెలంగాణ అభివృద్దికి కేంద్రంగా కావాలి. ప్రభుత్వానికి ఓ సమగ్రమైన నివేదికలా ఉండాలి. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా, పథకాలు రచించాలన్నా ఇదో నిఘంటువులా ఉండాలి. ఇకపోతే కుటుంబ వివరాలు పార్ట్-2లో నమోదు చేస్తారు. ఇందులో గత ఐదేళ్లలో తీసుకున్న రుణాల వివరాలు, పశుసంపద, స్థిరాస్తి, చరాస్తి వివరాలు, రేషన్ కార్డు నెంబర్, నివాస గృహం రకం, మరుగుదొడ్డి, గ్యాస్ కనెక్షన్ వివరాలు తెలపాల్సి ఉంటుంది.
ఆధార్ వివరాలు తప్పనిసరి కాదని ఇందులో స్పష్టం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే లాంటి ప్రశ్నలనే ప్రభుత్వం ఇందులో పొందుపరిచింది. అయితే ఆధార్ కూడా పొందు పర్చాలి. వోటరు వివరాలను కూడా పొందుపరిస్తే మంచిది. గత ప్రభుత్వంలో జరిగిన సర్వేలో 8 అంశాలు, 94 ప్రశ్నలు చేరుస్తూ 2014 ఆగస్టు-19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్రంలోని కోటి గృహాలు, 3.68 కోట్ల జనాభాకు సంబంధించి ఆర్థిక సామాజిక వివరాలను సేకరించింది. ఆ వివరాలు లేవంటున్నారు. అప్పటితో పోలిస్తే ఈ కులగణన సర్వేలో దాదాపు 90శాతం ప్రశ్నలు మళ్లీ పునరావృతం అయ్యాయి. కుటుంబసభ్యుల అనారోగ్య వివరాలు అందులో ఉండగా ఇప్పుడు కులాలకు సంబంధించిన ప్రశ్నలు అదనంగా ఉన్నాయి. గతంలో ఆధార్ వివరాల నమోదు తప్పనిసరి చేయగా ఇప్పుడు ఐచ్ఛికంగా ఉంచారు. అయితే సర్వే అన్నప్పుడు ఒక్కో కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు తీసుకుంటేనే సమగ్రంగా ఉంటుంది. అలాగే భూములు, పశువువల వివరాలు కూడా కుటుంబ సభ్యుల ద్వారానే తెలుస్తాయి అవి కూడా సేకరించాలి. అప్పుడే సమగ్ర సర్వేకు అర్థం ఉంటుంది. ఈ దిశగా సర్వే విధానాలతో ముందుకు సాగితే మంచిది.
-మారుపాక గోవర్ధన్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్