వర్షం కోసం ఎదురుచూపులు…ఎల్‌నినో ప్రభావం

దేశ రాజకీయాలు, అంతర్జాతీయ యుద్ధాలు, ఇంధన ధరల పెరుగుదల, పరీక్షల గందరగోళం వంటి అనేక పరిణామాల మధ్య గత కొన్ని వారాలుగా కోట్లాది మంది భారతీయులను ఉత్కంఠకు గురి చేస్తున్న  వార్తలు —నైరుతి రుతుపవనాల రాక..ఎల్ నినో ప్రభావం  . సాధారణ షెడ్యూల్ కంటే మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4న దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు కేవలం వాతావరణ అంశం మాత్రమే కావు; అవి భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారం. మరోవైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతులను నైరుతి రుతుపవనాల తొలి వర్షం పడగానే పంటల సాగుకు తొందరపడవొద్దని కోరుతోంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాకాలం ఎలా సాగుతుందన్న దానిపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసింది.

ఎల్‌నినో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలపై ఏర్పడే ముప్పు మరింత వాస్తవ రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో ఎల్‌నినో అంటే ఏమిటి, దాని ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే తెలంగాణ రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నష్టాలను ఎలా నివారించుకోవాలి అనే అంశాలపై ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.

భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయం ప్రధాన ఉపాధి రంగం. గ్రామీణ జనాభాలో అధిక శాతం మంది రైతులు, వ్యవసాయ కార్మికులు తమ జీవనాధారాన్ని వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడి కొనసాగిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు రైతులు భూములను సిద్ధం చేసుకోవడం, విత్తనాలు కొనుగోలు చేయడం, ఎరువులను సమకూర్చుకోవడం, ట్రాక్టర్లతో దుక్కి దున్నించడం వంటి పనులతో బిజీగా ఉంటారు. ఈ మొత్తం వ్యవస్థలో వర్షం ఆలస్యం కావడం అంటే రైతు ఆర్థిక ప్రణాళిక మొత్తం కుదేలయ్యే ప్రమాదం.

ఈసారి పరిస్థితి మరింత క్లిష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు వర్షాలపై అనిశ్చితి కొనసాగుతుండగా, మరోవైపు అంతర్జాతీయ పరిణామాలు రైతుపై అదనపు భారం మోపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదలతో డీజిల్ ఖర్చులు అధికమయ్యాయి. ట్రాక్టర్లు, పంపుసెట్లు, రవాణా వ్యవస్థలన్నీ డీజిల్‌పై ఆధారపడే భారత వ్యవసాయంలో ఇది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. ఇంధన ధరల పెరుగుదలతో పాటు ఎరువుల సరఫరాలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎరువుల తయారీకి అవసరమైన ముడిసరుకుల ధరలు పెరగడం, సరఫరా గొలుసుల్లో అంతరాయాలు ఏర్పడటం వల్ల రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందడం లేదు. ఇప్పటికే అధిక ఉత్పత్తి వ్యయాలతో ఇబ్బంది పడుతున్న రైతుకు ఇది మరో దెబ్బ.

ఇక బ్యాంకు రుణాల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. వ్యవసాయ రుణాల మంజూరులో ఆలస్యం, కఠిన నిబంధనలు, పెరుగుతున్న అప్పుల భారం కారణంగా చిన్న, సన్నకారు రైతులు మరింత సంక్షోభంలోకి నెట్టబడుతున్నారు. వ్యవసాయం లాభదాయకం కాకపోయినా, రైతు ప్రతి ఏడాది ఆశతోనే భూమిలో పెట్టుబడి పెడతాడు. అయితే ప్రకృతి అనిశ్చితి, మార్కెట్ అస్థిరత, ప్రభుత్వ విధానాల లోపాలు కలిసి అతని భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

ఇక్కడ ప్రభుత్వాల బాధ్యత మరింత పెరుగుతుంది. వర్షాలు ఆలస్యమైనా, యుద్ధాల ప్రభావం ఉన్నా, రైతుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, రుణాలు, ఇంధనం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ ఇన్‌పుట్ల సరఫరాపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. అంతేకాకుండా వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటి నిర్వహణ, సూక్ష్మ సేద్యం, పంటల వైవిధ్యీకరణ వంటి దీర్ఘకాలిక సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.

భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం వాటా శాతం తగ్గిపోయి ఉండవొచ్చు. కానీ దేశ ఆహార భద్రతకు, గ్రామీణ ఉపాధికి, సామాజిక స్థిరత్వానికి వ్యవసాయమే పునాది. రైతు సంక్షేమం కేవలం రైతుల సమస్య కాదు; అది దేశ ఆర్థిక భద్రతకు సంబంధించిన అంశం. నైరుతి రుతుపవనాల రాకతో రైతుల్లో ఒక వైపు ఆశలు మళ్లీ చిగురిస్తుంటే …. మరోవైపు ఎల్‌నినో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాలపై ఏర్పడే ముప్పు ఆందోళనకు గురిచేస్తున్నది.  అయితే  రైతు ఆందోళనను దూరం చేస్తూ …  ఆశలను ఫలవంతం చేయాలంటే ప్రకృతి కరుణతో పాటు ప్రభుత్వాల దూరదృష్టి, సమర్థ విధానాలు కూడా అవసరం. యుద్ధాల ప్రభావం ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ కాలంలో, రైతు చేతిలో విత్తనం సురక్షితంగా నేలను చేరేలా చేయడం ప్రభుత్వాల అత్యంత ప్రాధాన్య కర్తవ్యంగా మారాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *