హైకోర్టు తీర్పును స్వాగతించిన బిజెపి రాజ్య సభ ఎంపి లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన సాగిస్తుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. సీఎం, మంత్రులు దిల్లీ పర్యటనలు చేస్తున్నారు తప్పితే..ప్రజలకు ఒరిగేదేమీలేదన్నారు. సోమవారం ఆయన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..సీఎం, మంత్రులు దిల్లీకి గులాములుగా మారారని ఎద్దేవా చేశారు. ప్రజావైద్యం పూర్తిగా పడకేసిందని, పేదలు చదువుకునే గురుకులాలను నిర్వీర్యం చేశారన్నారు.
ప్రజల దృష్టిని మరల్చేందుకు హైడ్రాను తెరపైకి తెచ్చారని, చట్టం చేయకుండా జీవో ద్వారానే హైడ్రాను నడుపుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం పెట్టి బస్సుల సంఖ్యను తగ్గించారని, రైతుబంధు రాక, రుణ మాఫీ కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ 9 నెలల పాలనలో 400 మందికిపైగా రైతులు చనిపోయారని దుయ్యబట్టారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ చేసిన మోసానికి సురేందర్‌రెడ్డి ఆత్మహత్యే తార్కాణమన్నారు. ఫసల్ బీమా అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ ఇప్పటి వరకు దాని ఊసే ఎత్తట్లేదని విమర్శి:చారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన బాట పడితే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరి మంత్రి అవుతున్నారని, బిఆర్‌ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుందని, ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే కోర్టు నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. బిజెపి విలువలతో కూడిన రాజకీయాలను కోరుకుంటుందని లక్ష్మణ్ అన్నారు.