– వేసవి సెలవుల్లోనూ తప్పని తిప్పలు
– ప్రైవేట్ స్కూల్ టీచర్లకు టార్గెట్ల వేట
– ఎండల్లోనూ బ్రోచర్లు పట్టుకుని ప్రచారం
– లేదంటే ఉద్యోగంపై ప్రభావం
– అధికారులు స్పందించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి
సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, మే 30 :విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ఉపాధ్యాయులు ప్రస్తుతం అడ్మిషన్ల సేకరణలో బిజీ అయ్యారు. ఒకప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే టీచర్లకు కాస్త విశ్రాంతి, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపే అవకాశం, కొత్త విద్యా సంవత్సరానికి సన్నద్ధమయ్యే సమయం ఉండేది. కానీ నేడు ప్రైవేట్ విద్యాసంస్థల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సెలవులు ప్రారంభం కావడంతోనే అనేక పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల వేట ప్రారంభించగా, ఆ బాధ్యతను బోధనా సిబ్బందిపై మోపుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించాలనే లక్ష్యంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు తమ ఉపాధ్యాయులతో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయిస్తున్నాయి. గ్రామాలు, కాలనీల్లో తిరుగుతూ తల్లిదండ్రులను కలిసి తమ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ఉపాధ్యాయులకు అడ్మిషన్ల లక్ష్యాలను నిర్దేశించి, వాటిని చేరుకోకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎండ తీవ్రత అధికంగా ఉన్న ఈ సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి రావడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాబోధన, పాఠ్య ప్రణాళికల రూపకల్పన, నైపుణ్యాల పెంపు వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో అడ్మిషన్ల కోసం తిరగడం తమ వృత్తి గౌరవాన్ని దెబ్బతీస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టార్గెట్లతో నలుగుతున్న గురువులు
విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ ప్రైవేట్ స్కూల్ టీచర్లకు మాత్రం విశ్రాంతి లేకుండా పోతోంది. కొత్త అడ్మిషన్ల కోసం పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా ప్రైవేట్ స్కూల్స్‌లో ప్రతి టీచర్‌కు ప్రత్యేకంగా అడ్మిషన్ టార్గెట్లు ఇస్తున్నట్లు సమాచారం. “రోజుకు ఇన్ని అడ్మిషన్లు తీసుకురావాలి”, “ఈ నెలలో ఇంతమంది పిల్లలను చేర్పించాలి” అంటూ ఒత్తిడి తెస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. టీచర్లను గ్రామాలు, కాలనీలు, బస్తీలు తిరిగి తల్లిదండ్రులను కలవాలని ఆదేశిస్తున్నారని తెలుస్తోంది. స్కూల్ బ్రోచర్లు పంచడం, ఫీజు వివరాలు చెప్పడం, పిల్లలను చేర్పించేందుకు ఒప్పించడం వంటి పనులు చేయిస్తున్నారు.
ఫోన్ కాల్స్ – సోషల్ మీడియా ప్రచారం
కొన్ని స్కూల్‌లలో పాత విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేయించడం, వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయించడం, ఫేస్‌బుక్ పోస్టులు షేర్ చేయించడం వంటి పనులు కూడా టీచర్లతో చేయిస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ అయినప్పటికీ ప్రతిరోజూ స్కూల్‌కు రావాలని కొన్ని యాజమాన్యాలు ఆదేశిస్తున్నాయని టీచర్లు వాపోతున్నారు. హాజరు కాకపోతే జీతం కోత లేదా ఉద్యోగంపై ప్రభావం ఉంటుందని భయపడుతున్నట్లు చెబుతున్నారు.
మానసిక ఒత్తిడిలో టీచర్లు
బోధన వేరే.. అడ్మిషన్ల కోసం మార్కెటింగ్ చేయడం వేరే. సెలవుల్లో కూడా పని ఒత్తిడి పెరిగింది అంటూ పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో గడిపే సమయం కూడా లేకుండా పోతోందని అంటున్నారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ఒత్తిడిపై విద్యా శాఖ అధికారులు స్పందించి, ఉపాధ్యాయుల హక్కులను కాపాడాలని టీచర్లు కోరుతున్నారు.
ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
ప్రస్తుతం విద్యారంగంలో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో పాఠశాలలు విద్యార్థులను ఆకర్షించేందుకు భారీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఆ ప్రచార భారం మొత్తం టీచర్లపై పడటం పట్ల ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సెలవుల సమయంలోనూ పని ఒత్తిడి పెరగడంతో కుటుంబ సభ్యులకు సమయం కేటాయించలేకపోతున్నామని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థులకు బోధించాల్సిన ఉపాధ్యాయులు అడ్మిషన్ ఏజెంట్లుగా మారుతున్న పరిస్థితిపై విద్యాశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. సమ్మర్ హాలిడేస్‌లో విశ్రాంతి దొరకక అడ్మిషన్ల కోసం ఇంటింటికి తిరగాల్సి వస్తున్న పరిస్థితి ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





