– ‘మహాలక్ష్మి’తో పెరిగిన రద్దీ
– 43 వేల మంది కార్మికుల భవిష్యత్తు
– రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు భారీ సవాళ్లు (రామకిష్టయ్య సంగనభట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్)
రాష్ట్ర సాకారంలోనూ, ఆపై ప్రజా బాహుళ్యానికి అనునిత్యం వారధిగా నిలవడంలోనూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టీసీ) పాత్ర అనన్య సామాన్యం. అయితే, స్వరాష్ట్రంలో టీజీ ఆర్టీసీ ప్రస్తుతం అగ్నిపరీక్షను ఎదుర్కొంటోంది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ కార్మిక వర్గాల నుంచి మరోసారి తుఫానులా దూసుకొస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2ను గడువుగా విధిస్తూ, ఆలోగా ప్రభుత్వం స్పష్టమైన, సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు, అవసరమైతే సార్వత్రిక సమ్మెకు వెనుకాడబోమని ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాలలో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. అప్పుల ఊబి, ఆర్థిక లోటు, ఉద్యోగ భద్రతపై ఆందోళనల నడుమ కొట్టుమిట్టాడుతున్న సంస్థకు ఈ తాజా పరిణామాలు పెనుముప్పుగా మారాయి. కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లు, ప్రభుత్వ ఆర్థిక పరిమితుల మధ్య నలుగుతున్న ఆర్టీసీ సంక్షోభాన్ని చారిత్రక పూర్వాపరాలు, ప్రస్తుత ఆర్థిక గణాంకాల వెలుగులో నిశితంగా విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల సుదీర్ఘ పోరాటంలో ప్రధానంగా రెండు డిమాండ్లు అంతర్లీనంగా వినిపిస్తున్నాయి. మొదటిది తిరుగులేని ఉద్యోగ భద్రత, రెండోది ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన హోదా, వేతన భత్యాలు. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సంస్థగా ఆవిర్భవించినప్పటికీ, నాటి నుంచి నేటి వరకు ఆదాయ వ్యయాల మధ్య అగాధం పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ స్థాయులను బట్టి నిరంతరం పెరగడం, సమాంతరంగా ప్రైవేట్ రవాణా రంగం నుంచి ఎదురవుతున్న పోటీ, గ్రామీణ ప్రాంతాల్లో సొంత వాహనాల వినియోగం పెరిగి ప్రయాణికుల సంఖ్య తగ్గడం వంటివన్నీ సంస్థను క్రమంగా కుంగదీశాయి. దీనికి తోడు, ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వివిధ ఉచిత రవాణా సౌకర్యాల తాలూకు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో అందక పోవడం సంస్థ పతనానికి మరింత ఆజ్యం పోసింది. ఈ దీర్ఘకాలిక రుగ్మతలకు కేవలం ప్రభుత్వంలో విలీనం మాత్రమే ఏకైక, శాశ్వత సంజీవని అనేది కార్మిక సంఘాల గట్టి నమ్మకం.
97 డిపోలు, 43వేల మంది కార్మికులు
సంస్థ పరిమాణాన్ని, దాని సేవా విస్తృతిని గమనిస్తే, తెలంగాణ ఆర్టీసీలో ప్రస్తుతం దాదాపు 43 వేల మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 97కు పైగా డిపోలు, దాదాపు 9 వేల పైచిలుకు బస్సుల ద్వారా ఈ సంస్థ ప్రతిరోజూ సుమారు 50 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుస్తోంది. ఇంతటి భారీ ప్రజా బాహుళ్యంతో ముడిపడి ఉన్న సంస్థ ఆర్థిక స్థితి మాత్రం అత్యంత దయనీయంగా మారింది. సంస్థ సంచిత నష్టాలు, అప్పులు వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రోజువారీ వొచ్చే రాబడి కేవలం డీజిల్ ఖర్చులు, వాహనాల నిర్వహణకే సరిపోతుండగా, ఉద్యోగుల వేతనాలు, పాత బాకీలు, రిటైరైన వారి పెన్షన్ల చెల్లింపులు సంస్థకు తలకు మించిన భారంగా మారాయి. ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ హోదాలో ఉంటూ వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకునే పరిమితి కూడా దాటిపోవడంతో, సంస్థ మనుగడే ప్రశ్నార్థకమైంది. ఈ విలీన డిమాండ్ వెనుక 2019 నాటి చారిత్రాత్మక సమ్మె తాలూకు చేదు జ్ఞాపకాలు, ఆవేదనలు దాగి ఉన్నాయి. నాడు సుమారు 52 రోజుల పాటు సాగిన సుదీర్ఘ సమ్మె రాష్ట్ర రవాణా రంగాన్ని పూర్తిగా స్తంభింప జేసింది. ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో సాగిన ఆ పోరాటాన్ని అప్పటి ప్రభుత్వం అత్యంత కఠినంగా అణచివేసే ప్రయత్నం చేసింది. ‘సెల్ఫ్ డిస్మిస్’ ప్రకటనలు, కార్మికులపై క్రమశిక్షణా చర్యలు, జీతాల నిలిపివేత వంటి చర్యలతో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఆ వేదన భరించలేక, భవిష్యత్తు శూన్యమనే ఆందోళనతో సుమారు 30 మందికి పైగా ఆర్టీసీ కార్మికులు గుండెఆగి, మరికొందరు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. చివరకు కోర్టుల జోక్యం, కొన్ని తక్షణ హామీలతో సమ్మె విరమించినప్పటికీ, మూల సమస్య అయిన విలీనం మాత్రం అప్పట్లో కాగితాలకే పరిమితమైంది. ఆ గాయాలు, ఆవేదనలు కార్మిక వర్గాల్లో నేటికీ పచ్చిగానే ఉన్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత తమ సమస్యలకు శాశ్వత మోక్షం లభిస్తుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే ‘మహాలక్ష్మి’ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. ఈ పథకం ద్వారా బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య, ముఖ్యంగా మహిళల రద్దీ అసాధారణంగా పెరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి పోతున్నాయి. అయితే, నాణేనికి మరోవైపు ఉన్న ఆర్థిక కోణాన్ని పరిశీలిస్తే, ఈ ఉచిత ప్రయాణాల వల్ల సంస్థకు రావాల్సిన ప్రత్యక్ష ఆదాయం నిలిచి పోయింది. ప్రభుత్వం నుంచి అందాల్సిన రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో, పూర్తిస్థాయిలో విడుదల కాకపోతే రోజువారీ నిర్వహణ వ్యయాలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ పెరిగినా సంస్థ చేతిలో నగదు కొరత వేధిస్తుండటం విలీన డిమాండ్‌కు మరింత ఊతాన్నిచ్చింది.
కార్మిక జేఏసీ నాయకత్వం విలీనానికి చూపుతున్న కారణాలు ఆర్థికపరమైనవి మాత్రమే కావు, అవి నైతికమైనవి కూడా. ఆర్టీసీ కార్మికులు కేవలం రవాణా సేవలకే పరిమితం కాకుండా, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే సార్వత్రిక ఎన్నికల విధులు, అత్యవసర సేవల నిర్వహణ, వరదలు, తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో సహాయక చర్యల్లో ప్రాణాలకు తెగించి పాల్గొంటున్నారు. సమ్మక్క-సారలమ్మ జాతర, దసరా, సంక్రాంతి వంటి పండుగల సమయాల్లో రాత్రింబవళ్లు అదనపు సర్వీసులు నడుపుతూ ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములవుతున్నారు. ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, తమకు లభించే వేతనాలు, పదోన్నతులు, ముఖ్యంగా పదవీ విరమణ తదనంతర పెన్షన్ భద్రతలో తీవ్ర వివక్ష, అస్పష్టత ఎదురవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ కోణం నుంచి చూస్తే దీని వెనుక పెను ఆర్థిక, పరిపాలనాపరమైన సవాళ్లు దాగి ఉన్నాయి. ఒక కార్పొరేషన్ సంస్థను పూర్తిగా ప్రభుత్వ శాఖగా మార్చడం లేదా ఉద్యోగులను ప్రభుత్వ పరిధిలోకి విలీనం చేయడం అంత సులభతరమైన ప్రక్రియ కాదు. 43 వేల మంది ఉద్యోగుల జీతభత్యాలు, పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ల బాధ్యతను నేరుగా రాష్ట్ర బడ్జెట్‌పై వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టుల రుణాల చెల్లింపుల వంటి భారీ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ఖజానా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో ఆర్టీసీకి ఉన్న వేల కోట్ల రూపాయల అప్పులను, భవిష్యత్ ఆర్థిక భారాలను ప్రభుత్వం తన నెత్తిన వేసుకోవడానికి తీవ్రంగా మథన పడుతోంది. చట్టపరమైన చిక్కులు, ఇతర కార్పొరేషన్ల (విద్యుత్, సింగరేణి వంటివి) నుంచి కూడా ఇటువంటి డిమాండ్లు వచ్చే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం ఈ విషయంలో అడుగులు చాలా జాగ్రత్తగా వేస్తోంది.
భిన్న కోణాల్లో ప్రజల, ప్రజా సంఘాల అభిప్రాయాలు
ఈ మొత్తం వ్యవహారంలో సామాన్య ప్రజల, ప్రజా సంఘాల అభిప్రాయాలు భిన్న కోణాల్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సే ఏకైక జీవననాడి. ప్రైవేట్ వాహనదారులు లాభాలు లేని రూట్లలో సర్వీసులు నడపడానికి సుముఖత చూపని తరుణంలో, నష్టాలు వస్తున్నా సామాన్యుడి కోసం ఆర్టీసీ మాత్రమే బస్సులు నడుపుతోంది. విద్యార్థులు, చిరు వ్యాపారులు, కూలీలు పూర్తిగా ఆర్టీసీ పాస్‌లపైనే ఆధారపడి ఉన్నారు. ఈ రవాణా వ్యవస్థ గనుక సమ్మెల రూపంలో స్తంభిస్తే సామాన్య జనజీవనం అతలాకుతలమవుతుంది. గత సమ్మెల కాలంలో ప్రైవేట్ వాహనాలు సామాన్యులను దోచుకున్న ఉదంతాలను ప్రజలు మరిచిపోలేదు. కాబట్టి, సమ్మెల వల్ల ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టకుండా సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
బస్సులు నిలిచిపోతే..
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో, ఒకవేళ కార్మిక సంఘాలు ప్రకటించినట్లుగా జూన్ 2 తర్వాత ఉద్యమం ఉధృతమై, బస్సులు నిలిచిపోతే అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై, శాంతిభద్రతలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. రాజకీయ పార్టీలు సైతం ఈ సున్నితమైన అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రతిపక్షాలు కార్మికుల డిమాండ్లకు మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండగా, అధికార పక్షం ఇటు కార్మికులను నొప్పించక, అటు ఖజానాను ఇబ్బంది పెట్టని మధ్యేమార్గం కోసం అన్వేషిస్తోంది. ఆర్టీసీ సమస్య అనేది కేవలం కొందరు ఉద్యోగుల జీతభత్యాల సమస్య మాత్రమే కాదు; ఇది రాష్ట్ర సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థ భవిష్యత్తుకు సంబంధించినది. పాలకుల విధానాలు, సరైన ప్రణాళికా లోపం వల్లనే ఒకప్పుడు లాభాల్లో నడిచిన సంస్థ నేడు ఈ స్థితికి చేరిందనే విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా, ఒకవైపు దశాబ్దాలుగా సేవలందిస్తున్న కార్మికుల సామాజిక, ఆర్థిక భద్రతను కాపాడటం, మరోవైపు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటూ ప్రజా రవాణాను బలోపేతం చేయడం సవాలుతో కూడుకున్న పని. ఇందుకు సమ్మెలు, ఘర్షణ పూరిత వాతావరణం ఎంతమాత్రం పరిష్కారం కాబోవు. ప్రభుత్వం తక్షణమే కార్మిక ప్రతినిధులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, నిర్దిష్ట కాలపరిమితిలోగా విలీనం లేదా ప్రత్యామ్నాయ పటిష్ట ఆర్థిక ప్యాకేజీ ద్వారా సంస్థను గట్టెక్కించే కార్యాచరణను ప్రకటించాల్సి ఉంది. పరస్పర పట్టింపులకు పోకుండా, పారదర్శక చర్చల ద్వారానే రవాణా రంగానికి, కార్మికులకు శాశ్వత విముక్తి లభిస్తుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





