విద్యావ్యవస్థను గాలికొదిలిన కాంగ్రెస్ సర్కార్

– రాష్ట్రంలో 30 డీఈవో పోస్టులు ఖాళీ
– రాజకీయ కక్షతో ‘మన ఊరు – మన బడి’ నిలిపివేత
– మాజీ మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 30 : రాష్ట్రంలో 33 జిల్లాలకు కేవలం ముగ్గురే రెగ్యులర్ డీఈవోలు ఉన్నారని, 30 చోట్ల పోస్టులు ఖాళీగా పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు విమర్శించారు. సిద్దిపేట రెడ్డి సంఘంలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, ఐఏఎస్ అధికారులకు డీఈవో బాధ్యతలు అప్పగించడం వల్ల వారు విద్యపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారన్నారు. తక్షణమే ప్రభుత్వం రెగ్యులర్ డీఈవోలను నియమించాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షతో మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి బడుల అభివృద్ధిని కుంటుపరిచారన్నారు. కావాలంటే పథకం పేరు మార్చుకోవాలి కానీ బడుల అభివృద్ధిని ఆపొద్దని హితవు పలికారు. కొత్తగా పాఠశాలల్లో ఒక్క గది కూడా కట్టే ప్రయత్నం చేయడం లేదన్నారు. పాఠశాలల్లో స్కావెంజర్ల బిల్లులు గత ఏడాదివి నాలుగు నెలలు, ఈ ఏడాదివి నాలుగు నెలలు పెండింగ్‌లో ఉండటంతో ఆ భారం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై పడుతోందన్నారు. పెండింగ్ బిల్లులు, డీఏల సమస్యలతోపాటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ప్రభుత్వం ఉపాధ్యాయులను తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తోందని హరీష్‌రావు ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *